డాక్టర్ అవ్వాలనుకుని.. ఆస్ట్రోనాట్ గా స్పేస్​కు

డాక్టర్ అవ్వాలనుకుని..  ఆస్ట్రోనాట్ గా స్పేస్​కు
  • సునీతా విలియమ్స్ తండ్రిది గుజరాత్, తల్లిది స్లోవేనియా
  • 1957లోనే అమెరికాకు వలస
  • ఫెడరల్ పోలీస్ ఆఫీసర్​ను పెళ్లాడిన సునీత

న్యూఢిల్లీ: అమెరికన్ నేవీలో కెప్టెన్​గా పనిచేసిన సునీతా విలియమ్స్.. 1965, సెప్టెంబర్ 19న ఓహియో స్టేట్​లోని యూక్లిడ్ సిటీలో జన్మించారు. గుజరాత్ మెహసానాలోని ఝులాసన్​కు చెందిన దీపక్ పాండ్యా, స్లొవేనియాకు చెందిన ఉర్సులిన్ బోనీ పాండ్యా ఆమె తల్లిదండ్రులు. సునీతా విలియమ్స్ కు అన్న జయ్‌‌‌‌ థామస్, అక్క దినా ఆనా ఉన్నారు. 1957లో దీపక్ పాండ్యా అమెరికాకు వలస వెళ్లారు. న్యూరో సైంటిస్ట్​గా అక్కడే సెటిల్ అయ్యారు. సునీతా విలియమ్స్.. వెటర్నరీ డాక్టర్ అవ్వాలనుకున్నారు.

 కానీ.. అన్న జయ్​కు అమెరికన్ నేవీ అకాడమీలో ఉద్యోగం రావడంతో సునీతాను కూడా నేవీలోనే చేర్పించాలని అనుకున్నారు. అన్న జయ్‌‌‌‌ అడుగుజాడల్లో నడుస్తూ ఆమె కూడా నేవీ అకాడమీలో ప్రవేశం పొందారు. హెలికాప్టర్‌‌‌‌ నడపడంలోనూ ప్రావీణ్యం సాధించారు. మేరీల్యాండ్‌‌‌‌లోని అనాపోలిస్‌‌‌‌లో అమెరికన్ నేవీ అకాడమీ నుంచి 1987లో ఫిజిక్స్​ లో పట్టా పొందారు. ఆ తర్వాత సునీత అమెరికా సైన్యంలో చేరారు. అనంతరం బేసిక్ డైవింగ్ ఆఫీసర్​గా పదోన్నతి పొందారు. 1989లో నేవీ ఎయిర్ ట్రైనింగ్ కమాండ్​లో నేవీ ఏవియేటర్​గా చేరారు. యుద్ధ విమానాలు నడపడంలో ట్రైనింగ్ తీసుకున్నారు. తర్వాత నేవీ నుంచి రిటైర్ అయ్యాక.. 1998, ఆగస్టులో జాన్సన్ స్పేస్ సెంటర్​లో ఆస్ట్రొనాట్​గా ట్రైనింగ్ తీసుకున్నారు.

రెండు సార్లు ఇండియా పర్యటన

ఫెడరల్ పోలీస్ అధికారి అయిన మైకేల్‌‌‌‌ జే.విలియమ్స్‌‌‌‌ను 1989లో సునీతా విలియమ్స్ పెండ్లి చేసుకున్నారు. వుడ్స్‌‌‌‌హోల్‌‌‌‌లోని సెయింట్‌‌‌‌ జోసెఫ్స్‌‌‌‌ చర్చి వీరి పెండ్లికి వేదికైంది. టెక్సస్‌‌‌‌లోని హూస్టన్‌‌‌‌లో నివసిస్తున్న వీరికి పిల్లలు లేరు. అహ్మదాబాద్​కు చెందిన ఓ బాలికను దత్తత తీసుకుందామని భావించారు. కానీ.. సాధ్యం కాలేదు. తొలి రెండు స్పేస్ మిషన్లు కంప్లీట్ అవ్వగానే సునీతా విలియమ్స్ 2007, 2013లో ఇండియాను సందర్శించారు.

 గుజరాత్‌‌‌‌లోని సబర్మతి ఆశ్రమంతో పాటు స్వగ్రామం ఝులాసన్‌‌‌‌కు వెళ్లారు. 2008లో ఇండియన్ గవర్నమెంట్.. ఆమెను పద్మభూషణ్​తో సత్కరించింది. భారతీయ మూలాలు కలిగిన సునీతా విలియమ్స్​కు ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, దేవుళ్లు అన్నా ఎంతో గౌరవం. స్పేస్ మిషన్​కు వెళ్లినప్పుడల్లా ఆమె సమోసాలు, స్లోవేనియన్ జెండా, వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్లారు.