
వాషింగ్టన్: అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లో వారం రోజుల పరిశోధనల కోసం వెళ్లిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ 250 రోజులుగా అక్కడే ఉండిపోయారు. వారిని తిరిగి తీసుకురావాల్సిన బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో సాంకేతిక సమస్యలు ఎదురుకావడమే దీనికి కారణమని నాసా అధికారులు తెలిపారు. వచ్చే నెలలో వారిద్దరినీ భూమి మీదకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఈ విషయంపై స్పందిస్తూ.. సునీత, బుచ్ విల్మోర్ లను వెంటనే తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలంటూ స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కు సూచించారు.
ట్రంప్ సూచన మేరకు ఐఎస్ఎస్ కు స్పేస్ క్రాఫ్ట్ పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మస్క్ కూడా చెప్పారు. కాగా, ఈ విషయంపై తాజాగా సునీతా విలియమ్స్ స్పందించారు. తాము ఇక్కడ చిక్కుకుపోయామని భావించడంలేదని వివరణ ఇచ్చారు. వారం రోజుల పరిశోధన కోసమే ఇక్కడికి వచ్చినప్పటికీ అనుకోకుండా దొరికిన సమయాన్ని ఇతర ప్రయోగాల కోసం వెచ్చిస్తున్నామని తెలిపారు. అదే విధంగా తాను చిక్కిపోయినట్లు వ్యక్తమవుతున్న ఆందోళనలపై వివరణ ఇస్తూ.. తాను, విల్ మోర్ ఇద్దరమూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నామని స్పష్టతనిచ్చారు.