
వైఎస్ వివేకా హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎంపీ అవినాష్ రెడ్డిని ఏప్రిల్ 25 వరకు అరెస్ట్ చేయోద్దని సీబీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సునీత అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె పిటిషన్ పై ఏప్రిల్ 21శుక్రవారం రోజున విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు 25వ తేదీన తుది తీర్పు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
ఏప్రిల్ 25వ తేదీ వరకు ప్రతిరోజూ అవినాశ్‌రెడ్డి సీబీఐ ఎదుట హాజరుకావాలని తెలంగాణ హైకోర్టు షరతు విధించింది. విచారణకు సహకరించాలని, సీబీఐ అధికారులు ప్రశ్నలను లిఖితపూర్వకంగా అందజేయాలని తెలిపింది. అవినాశ్ రెడ్డి ఇచ్చే సమాధానాలను ఆడియో, వీడియో రికార్డు చేయాలని, విచారణకు సంబంధించిన రికార్డులను కోర్టుకు సమర్పించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.