చిన్న సాయంతో పెద్ద మార్పు

చిన్న సాయంతో పెద్ద మార్పు
  • సమాజానికి తిరిగి ఇస్తేనే ఎదుగుదల
  • ప్రజ్వల ఫౌండేషన్  కోఫౌండర్  సునీతా కృష్ణన్
  • ఎస్ వీపీ ఇండియా హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘దాన్ ఉత్సవ్’

హైదరాబాద్, వెలుగు: ఇతరులకు చిన్న సాయం చేయడం ద్వారా పెద్ద మార్పును చూడవచ్చని ప్రజ్వల ఫౌండేషన్  కోఫౌండర్  సునీతా కృష్ణన్  అన్నారు. సమాజానికి తిరిగి ఇస్తేనే ఎదిగేందుకు అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. సోమవారం ఎస్ వీపీ (సోషల్  వెంచర్స్  పార్ట్ నర్స్‌‌‌‌) ఇండియా హైదరాబాద్  ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని దస్ పల్లా హోటల్ లో ‘దాన్ ఉత్సవ్’ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ఎన్జీఓలు, దాతలు, కమ్యూనిటీ లీడర్లతో పాటు 150 చేంజ్ మేకర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా సునీతా కృష్ణన్  మాట్లాడుతూ ఇతరులకు ఇవ్వడం ద్వారా మనల్ని మనం మరింత మెరుగుపర్చుకోవచ్చన్నారు. ఎస్ వీపీ ఇండియా ఆలిండియా హెడ్  గోవింద్  అయ్యర్  మాట్లాడుతూ అవసరమైన వారికి సాయం చేయడానికి దాతలు ఉత్సాహంగా ముందుకు రావాలన్నారు. ‘‘దాతలుగా మన పాత్ర సహాయం చేయడం వరకే కాదు. సమాజాన్ని మార్చడంలోనూ క్రియాశీలకంగా పాల్గొన్నాలి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్జీఓలు.. సవాళ్లను అవకాశాలుగా మలచుకొంటున్నాయి” అని అయ్యర్  అన్నారు.

 ఈ సందర్భంగా ఎన్జీఓలు బ్లడ్  వారియర్స్, గుడ్  యూనివర్స్, ఇంక్విలాబ్  తమ డ్రీమ్  ప్రాజెక్టుల గురించి వివరించాయి. తలసేమియా బాధితులకు క్యారియర్  టెస్టింగ్ ను మరింత తక్కువ ధరకు అందుబాటులోకి తెస్తున్నామని బ్లడ్  వారియర్స్  ఎన్జీఓ తెలిపింది. గ్రామీణ మహబూబ్ నగర్ లో 1500 బాలికలకు లబ్ధి చేకూర్చేలా ‘మెన్ స్ట్రువల్  హెల్త్  ప్రోగ్రాం’ నిర్వహిస్తామని గుడ్  యూనివర్స్  వెల్లడించింది. ఆ ప్రోగ్రాం ద్వారా బాలికలకు నెలసరికి సంబంధించిన ఉత్పత్తులు ఇస్తామని, నెలసరిపై అవగాహన కల్పిస్తామని పేర్కొంది. 7.20 లక్షల సింగిల్  యూజ్  ప్యాడ్లు డిస్పోజ్  కాకుండా నివారిస్తామని గుడ్  యూనివర్స్  తెలిపింది. ‘థింక్ అండ్ మేక్’ ప్రోగ్రాం ద్వారా ప్రభుత్వ బడుల విద్యార్థుల్లో సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు అభివృద్ధి చేస్తామని ఇంక్విల్యాబ్  పేర్కొంది.