
- KTR, హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన సునీతా లక్ష్మారెడ్డి
- పెద్దసంఖ్యలో సర్పంచ్ లు, ఎంపీటీసీలు గులాబీ గూటికి
హైదరాబాద్ : TRS లో చేరారు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీలో కీలక నాయకుడు హరీష్ రావుల సమక్షంలో ఆమె గులాబీ కండువా కప్పుకున్నారు. సునీతాలక్ష్మారెడ్డి తో పాటు… మెదక్ జిల్లాకు చెందిన పలువులు సర్పంచ్ లు, ఎంపీటీసీలు టీఆర్ఎస్ లో పెద్దసంఖ్యలో చేరారు.
TDP ఖతం.. కాంగ్రెస్ గతం : కేటీఆర్
కేటీఆర్ మాట్లాడుతూ.. “మెదక్ జిల్లాలో పది సీట్లలో 9 సీట్లు గెల్చుకున్నామంటే అందుకు కారణం హరీష్ రావే. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులుపెడుతోంది. ప్రజలు టీఆర్ఎస్ వెంట ఉన్నారు కాబట్టే.. నాయకులు మన పార్టీవైపు ఆకర్షితులవుతున్నారు. తెలంగాణలో తెలుగుదేశం ఖతం… కాంగ్రెస్ పార్టీ గతం… అన్నట్టుగా పరిస్థితి మారింది. కాంగ్రెస్ పై జనంలో ఆసక్తి కొరవడింది. తెలంగాణను చిన్నచూపు చూస్తున్న బీజేపీకి మెదక్ లో డిపాజిట్ గల్లంతు చేయాలి” అని అన్నారు.
కాంగ్రెస్, బీజేపీ ఓట్లు ఏరుకునే పార్టీలు : హరీష్ రావు
ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు.. “ గెలవడం సంగతి పక్కనపెట్టి.. మిగిలిన ఓట్లు ఏరుకునే పరిస్థితి కాంగ్రెస్, బీజేపీల్లో ఉంది. దేశంలో ఎక్కడా లేని పరిస్థితి తెలంగాణలో ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ కు.. టీఆర్ఎస్సే పోటీ. మనకు మనమే పోటీ. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. ఎక్కడా గెలిచే పరిస్థితి లేదు. జహీరాబాద్ లో రాహుల్ సభకు జనం లేరు. కాంగ్రెస్ కు కార్యకర్తలే కరువయ్యారు. రాహుల్ తెలంగాణ గురించి ఒక్క మాట చెప్పలేదు. తెలంగాణలో చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు ఒక్క ఎమ్మెల్యే స్థానంలోనే మాత్రమే బీజేపీ గెలిచింది. నీతి ఆయోగ్ చెప్పినా… రాష్ట్ర ప్రాజెక్టులు, పథకాలకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదు. ఈ ఎన్నికల్లో కూడా బీజేపీ ఒక్కసీట్ కూడా గెలవదు. కేంద్రం నుంచి రావాల్సిన వాటాను సాధించుకోవాలంటే 16 సీట్లు గెలవాలి. నర్సాపూర్ లో లక్ష ఎకరాలకు గోదావరి నీళ్లు తేవడమే టీఆర్ఎస్ లక్ష్యం” అన్నారు హరీష్ రావు.
కష్టపడేవారికి కాంగ్రెస్ లో గుర్తింపు లేదు : సునీతా లక్ష్మారెడ్డి
సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మెదక్ జిల్లా అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో నాయకులకు నాయకత్వంపై విశ్వాసం పోయిందన్నారు. కాంగ్రెస్ కు భవిష్యత్ లేదన్న సంగతి…. కాంగ్రెస్ నాయకులకు అర్థమైందన్నారు. తనలాగా కష్టపడి పనిచేసేవారిని కూడా కాంగ్రెస్ దూరం చేసుకుంటోందని అన్నారు. దేశం మొత్తానికి తెలంగాణ రోల్ మోడల్ అయిందనీ… టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు దేశానికి ఆదర్శంగా మారాయని చెప్పారు. ప్రజలంతా ఒకవైపు ఉంటే… కాంగ్రెస్ పార్టీ మరోవైపు ఉండిపోయిందని అన్నారు. జనం ఎక్కడుంటే అక్కడుండాలన్న ఉద్దేశంతోనే తాను టీఆర్ఎస్ లో చేరుతున్నానని చెప్పారు.
ఇక జై కాంగ్రెస్ నినాదం మరవాలనీ… MPగా కొత్త ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని చెప్పారు నాయకులు.