సుంకిశాల ప్రాజెక్టు ఇక ప్రశ్నార్థకమేనా?

సుంకిశాల  ప్రాజెక్టు ఇక ప్రశ్నార్థకమేనా?
  • రిటైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూలిపోవడంతో నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు
  • మళ్లీ పనులు చేయాలంటే నాగార్జున సాగర్ నీటి మట్టం505 అడుగులకు తగ్గాలి
  • సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రస్తుత నీటి మట్టం585 అడుగులు 
  • నీటి నిల్వలు ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి
  • ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.840 కోట్ల నుంచి రూ.2,200 కోట్లకు చేరిక

హైదరాబాద్, వెలుగు: వేసవి కాలంలో నాగార్జున సాగర్​నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరినా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా ఉండేందుకు చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇటీవల ప్రాజెక్టుకు సంబంధించి రిటైనింగ్ వాల్ కూలిపోవడం, టన్నెల్ గేట్ కొట్టుకుపోవడంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టును ఇప్పట్లో పూర్తి చేయడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. దీంతో మొత్తం ప్రాజెక్టు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 

దీనిపై ఏం చేయాలన్న దానిపై మెట్రో వాటర్ బోర్డు అధికారులు సైతం సందిగ్ధంలో పడ్డారు. కూలిన గోడ, టన్నెల్ గేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మళ్లీ నిర్మించడానికి కాంట్రాక్టు సంస్థ అంగీకరించినా.. ఇప్పట్లో పనులు చేపట్టడం సాధ్యం కాదని అధికారులు అంగీకరిస్తున్నారు. ఎందుకంటే నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీ 505 అడుగుల వద్ద ఉన్నప్పుడే ఈ పనులు సాధ్యమవుతాయని, కానీ ప్రస్తుతం సాగర్ ఫుల్ ట్యాంక్ లెవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరిందన్నారు.

 ప్రస్తుతం నీటిని తోడడం కూడా సులభం కాదని అంటున్నారు. సాగర్ డెడ్ స్టోరేజీకి ఎప్పుడు చేరుకుంటుందో అప్పుడే పనులు చేయడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పూర్తి స్థాయి నీటి మట్టం 312 టీఎంసీ (590 అడుగులు)లకు గాను, ఇప్పుడు 299 టీఎంసీల(585 అడుగులు) నీరు ఉంది. పనులు చేపట్టాలంటే నీటి మట్టం తగ్గాల్సి ఉండటంతో, ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. 

రూ.840 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం.. 

సుంకిశాల ప్రాజెక్టును 2012లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా టాటా కన్సల్టెన్సీ సంస్థకు డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారీ పనులు అప్పగించింది. 2012 నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆ సంస్థ ఈ ప్రాజెక్టుకు రూ.840 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూపొందించి, ప్రభుత్వానికి సమర్పించింది. ప్రాజెక్టులో భాగంగా సుంకిశాల వద్ద నాగార్జునసాగర్ రిజర్వాయర్ నీటి మట్టం 480- అడుగుల నుంచి 475 అడుగుల వరకు ఉంటుందని వెల్లడించింది. ఇక్కడ వాటర్ బోర్డు తాగు నీటి సేకరణ కోసం నీటిలో 4.5 మీటర్ల వ్యాసార్థంతో మూడు టన్నెల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మించాలని ప్రతిపాదించింది.

వీటి ద్వారా నీటిని పక్కనే నిర్మించే సర్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి తరలించాలని ప్రతిపాదించింది. అక్కడి నుంచి 17.2 కిలోమీటర్లు.. 2,375 మిల్లీమీటర్ల వ్యాసంతో వేసే పైప్ లైన్ ద్వారా నీటిని కోదండపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని శుద్ధి కేంద్రానికి తరలించాలని ప్రతిపాదించింది. ప్రాజెక్టుకు అవసరమైన రూ.840 కోట్లను జైకా నుంచి రుణంగా తీసుకోవాలని నిర్ణయించారు. 

ఈ ప్రాజెక్టు పూర్తయితే సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నీటి మట్టం డెడ్ స్టోరేజీకి వచ్చినా.. పంపింగ్ అవసరం లేకుండానే నీటిని తరలించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఈ పనులు చేపట్టడం సరికాదని, శ్రీశైలం ఎడమ కాలువ (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీసీ) నుంచే నీటిని తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అప్పటి నల్గొండ ఎంపీగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రాజెక్టును వ్యతిరేకించారు. దీంతో కొంతకాలం ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు.

రెండున్నర రెట్లు పెరిగిన వ్యయం..

2014లో తెలంగాణ ఆవిర్భావంతో పాటు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. దీంతో మళ్లీ సుంకిశాల ప్రాజెక్టుపై మెట్రో వాటర్ బోర్డు కసరత్తు ప్రారంభించింది. ఈసారి టాటా కన్సల్టెన్సీ ఇచ్చిన డిజైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కాకుండా వాటర్ బోర్డులోని ఓ ముఖ్య​అధికారి నేతృత్వంలో డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మార్పులు చేసినట్టు అధికారులు తెలిపారు. డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్న స్థలంలో కాకుండా మరో స్థలంలో ప్రాజెక్టును నిర్మించారు. 2021లో సుంకిశాల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ముందుగా అనుకున్న రూ.840 కోట్ల అంచనా వ్యయం.. రూ. రెండున్నర రెట్లు పెరిగి రూ.2,200 కోట్లకు చేరింది. 

రెండేండ్ల పాటు ప్రాజెక్టు పనులు ఒక అడుగు ముందుకేస్తే.. మరో అడుగు వెనకకు అన్నట్టు సాగుతోంది. గత వేసవి నాటికే ప్రాజెక్టును పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుని టన్నెల్ పనులు, రిటైనింగ్ వాల్ నిర్మాణం చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తమ ప్రభుత్వ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలూ ఉన్నాయి. అయితే కాంట్రాక్టు సంస్థల నిర్లక్ష్యం కారణంగా ఈ నెల 2న సుంకిశాల రిటైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాల్ కూలిపోయినట్లు అధికారులు తెలిపారు.