- దిగుబడిపై ప్రభావం చూపుతుందని ఆవేదన
- ఏప్రిల్‌లో నాటడంతోనే ఈ పరిస్థితి ఎదురైందంటున్న శాస్త్రవేత్తలు
గద్వాల, వెలుగు: సీడ్ పత్తి విత్తనాలు పెట్టి నెల దాటినా మొక్కలు ఆరు ఇంచులకు మించి పెరగకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సీడ్ విత్తనాలు పెట్టిన టైం నుంచి ఇప్పటివరకు రెండు ఫీట్ల వరకు మొక్కలు పెరగాల్సి ఉంది. ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆశించిన స్థాయిలో పెరగడం లేదని, ఇది దిగుబడిపై ఎఫెక్ట్ చూపుతుందని రైతులు అంటున్నారు. జిల్లాలోని గద్వాల నియోజకవర్గం సీడ్ పత్తి పంటకు పెట్టింది పేరు. కుటీర పరిశ్రమలాగా సీడ్ పత్తిని ఇక్కడి రైతులు సాగు చేస్తుంటారు. గద్వాల నియోజకవర్గంలోని ఈ ఏడాది దాదాపు 40 వేల ఎకరాల్లో సీడ్ పత్తి పంటను సాగు చేశారు. ప్రతి ఏడాది ఏదో ఒక రకంగా సీడ్ పత్తి రైతులు నష్టపోతుండగా, ఈ సారి సీడ్ వేసి పెట్టి దాటినా మొక్కలు అర ఫీట్ కంటే ఎక్కువగా పెరగలేదు. దీనికితోడు ఎర్ర తెగులు సోకడంతో కొందరు రైతులు పంటను తీసేస్తున్నారు.
ఏప్రిల్ ఎండింగ్ లోనే విత్తనాలు పెట్టేసిన్రు..
సీడ్ పత్తి రైతులు విత్తనాలను ఏప్రిల్ ఎండింగ్ లో పెట్టేశారు. ఈ పంట ఎక్కువగా బోరు బావుల కింద సాగు చేస్తారు. వాస్తవంగా మే ఎండింగ్ లో సాగు చేస్తే ఇబ్బందులు వచ్చేవి కావని చెబుతున్నారు. కానీ ఏప్రిల్ ఎండింగ్ లోనే విత్తనాలు పెట్టడంతో ఎండ ఎక్కువగా ఉండడంతో ఆశించిన స్థాయిలో పెరగలేదని అధికారులు చెబుతున్నారు. రైతులు మాత్రం గతంలో ఏప్రిల్ లో పెట్టినా ఎలాంటి ఇబ్బంది రాలేదని, ఈసారి మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దిగుబడిపై ఎఫెక్ట్..
ప్రతీ రైతు తనకున్న పొలంలో అర ఎకరం నుంచి 2 ఎకరాల వరకు సీడ్ పత్తిని సాగు చేస్తుంటారు. పొలం లేని వారు కూడా లీజుకి తీసుకొని సీడ్ పత్తిని సాగు చేస్తారు. ఏప్రిల్ మొదటి వారంలో భూములను రెడీ చేసుకుని కంపెనీలు ఇచ్చే సీడ్ ముందస్తుగానే నాటారు. ఎకరా సీడ్ పత్తి సాగు చేస్తే 5 క్వింటాళ్ల నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కానీ ఈసారి 3 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు కొన్ని చోట్ల ఎర్ర తెగుళ్లతో దిగుబడి సరిగా రాదని కొందరు రైతులు తమ పంటను మొత్తాన్ని దున్నేస్తున్నారు. గత ఏడాది ఎర్ర తెగుళ్లతో సీడ్ రైతులతో పాటు ఇతర రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు.
ముందుగా నాటడంతోనే..
మే చివరిలో లేదంటే జూన్ ఎండింగ్ లో పత్తి పంటను సాగు చేస్తారు. కానీ గద్వాల నియోజకవర్గంలో రైతులు ముందుగానే సీడ్ పత్తి సాగు చేయడంతో ఇబ్బందులు వస్తున్నాయని అంటున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే మొక్క భూమిలోని జింక్, సల్ఫర్, మెగ్నీషియం వంటి వాటిని గ్రహించకపోవడం వల్ల ఎర్ర తెగులు సోకుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రెండేళ్ల నుంచి రైతులకు ఈ విషయంపై అవగాహన కల్పిస్తున్నా పట్టించుకోవడం లేదని అంటున్నారు.
ఎకరాకు రూ.1.50 లక్షలకు పైగా పెట్టుబడి..
సీడ్ పంట సాగుకు ఎకరాకు రూ.1.50 లక్షలకు పైగా పెట్టుబడి పెడతారు. విత్తనం పెట్టినప్పటి నుంచి 70 రోజుల్లో మొక్క ఎదిగాక క్రాసింగ్ స్టార్ట్ చేస్తారు. 50 నుంచి 60 రోజులు క్రాసింగ్ చేసి ప్రతి మొక్కకు 80 నుంచి 100 వరకు కాయలు పట్టేలా చూసుకుంటారు. ఆ తర్వాత కాయలు పగిలాక పత్తిని తీసి ఆరబెట్టి జిన్నింగ్ కు పంపిస్తారు. జీఎంఎస్ పంటకైతే ఎకరాకు నలుగురు కూలీలు 60 రోజులు పని చేస్తారు. అదే మొగ్గ పత్తికైతే ఆరుగురు కూలీలు పనిచేయాల్సి ఉంటుంది. ఇలా పత్తి మొక్క పెట్టినప్పుటి నుంచి క్రాసింగ్ చేసి, పత్తి తీసేంత వరకు 4 నెలల పాటు కష్టపడాల్సి ఉంటుంది. 5 క్వింటాళ్ల దిగుబడి వస్తే ఎకరాకు రూ.లక్ష వరకు రైతుకు మిగిలే అవకాశం ఉంటుంది.
జూన్‌లో నాటితే ఇబ్బంది ఉండదు..
సీడ్, కమర్షియల్ పత్తి జూన్ నెలలో నాటుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మొక్క ఎదుగుదలలో కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్న మాట నిజమే. జింక్ లోపంతో ఎర్ర తెగులు సమస్య వస్తోంది. ఎండలు ఎక్కువగా ఉండడంతోనే పంట దెబ్బతింటుంది. రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నాం. కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది.
- గోవింద్‌నాయక్, డీఏవో, గద్వాల