SA20: వరుసగా మూడోసారి ఫైనల్‌కు చేరిన సన్ రైజర్స్.. ప్రత్యర్థి ఎవరంటే..?

SA20: వరుసగా మూడోసారి ఫైనల్‌కు చేరిన సన్ రైజర్స్.. ప్రత్యర్థి ఎవరంటే..?

సౌతాఫ్రికా ప్రీమియర్ లీగ్ లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ వరుస విజయాలతో దూసుకెళ్తుంది. తొలి మూడు మ్యాచ్ లు ఓటమితో ఆరంభించిన సన్ రైజర్స్ ఆ తర్వాత  ఒక్కసారిగా విజృంభించి ఫైనల్ కు చేరుకుంది. గురువారం (ఫిబ్రవరి 6) క్వాలిఫయర్ 2లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ పార్ల్ రాయల్స్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి ముంబై కేప్ టౌన్ తో ఫైనల్ సమరానికి సిద్ధమైంది. సౌతాఫ్రికా టీ20 లీగ్ లో ఇది మూడో సీజన్ కాగా.. మూడు సార్లు సన్ రైజర్స్ ఫైనల్ కు చేరుకోవడం విశేషం. తొలి రెండు సీజన్ లలో టైటిల్ గెలుచుకున్న మార్కరం సేన హ్యాట్రిక్ టైటిల్ పై కన్నేసింది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పార్ల్ రాయల్స్ జట్టుకు మంచి ఆరంభం దక్కలేదు. మిచెల్ ఓవెన్‌ను మార్కో జాన్సెన్ డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ లువాన్ డ్రే-ప్రిటోరియస్, రూబిన్ హెర్మాన్ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నిర్మించి జట్టును ఆదుకున్నారు. ప్రిటోరియస్ 41 బంతుల్లో 59 పరుగులు చేయగా.. హెర్మాన్ చివరి వరకు క్రీజ్ లో ఉండి 53 బంతుల్లో 81 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి ఆటతో పార్ల్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.

Also Read :- శ్రేయాస్ అయ్యర్ తొలి వన్డే ప్లేయింగ్ 11లో లేడా

లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ డేవిడ్ బెడింగ్‌హామ్‌ వికెట్ ను త్వరగానే కోల్పోయింది. క్వెనా మఫాకా అతన్ని 9 పరుగులకే ఔట్ చేశాడు. ఈ దశలో మరో ఓపెనర్ టోనీ డి జోర్జీ(78), జోర్డాన్ హెర్మాన్ (69) భారీ భాగస్వామ్యాన్ని నిర్మించి జట్టును విజయతీరాలకు చేర్చారు. రెండో వికెట్ కు ఏ జోడీ ఏకంగా 111 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించడం విశేషం. ముఖ్యంగా డి జోర్జీ  అద్భుతమైన ఇన్నింగ్స్‌తో 49 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 78 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో సన్ రైజర్స్ 19.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేజ్ చేసింది. డి జోర్జీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.