అభిషేక్ ఖతర్నాక్ సెంచరీ.. ఉప్పల్‎లో సన్ రైజర్స్‌ గ్రాండ్ విక్టరీ

అభిషేక్ ఖతర్నాక్ సెంచరీ.. ఉప్పల్‎లో సన్ రైజర్స్‌ గ్రాండ్ విక్టరీ

హైదరాబాద్, వెలుగు: 30 సిక్సర్లు.. 44 ఫోర్లు.. రెండు ఇన్నింగ్స్‌‌‌‌ల్లో కలిపి 492 రన్స్‌‌‌‌. ఇలా పరుగుల ఉప్పెనను తలపించిన పోరులో పంజాబ్ కింగ్స్‌‌‌‌పై సన్ రైజర్స్ హైదరాబాద్‌‌‌‌దే పైచేయి అయింది.  ఓపెనర్ అభిషేక్ శర్మ (55 బాల్స్‌‌‌‌లో 14 ఫోర్లు, 10 సిక్సర్లతో 141) ఖతర్నాక్ సెంచరీతో చెలరేగిన వేళ భారీ టార్గెట్‌‌‌‌ను అలవోకగా ఛేజ్ చేసిన సన్ రైజర్స్‌ శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌‌‌‌లో  8 వికెట్ల తేడాతో పంజాబ్‌‌‌‌ను చిత్తు చేసి రెండో విజయం అందుకుంది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన పంజాబ్ 20 ఓవర్లలో 245/6 స్కోరు చేసింది.  

కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 82) దంచికొట్టగా.. ప్రభ్‌‌‌‌సిమ్రన్ సింగ్ (23 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 42), ప్రియాన్ష్ ఆర్య (13 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 36), స్టోయినిస్ (11 బాల్స్‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌‌‌‌‌, 4 సిక్సర్లతో 34 నాటౌట్‌‌‌‌) ఆకట్టుకున్నాడు. హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం అభిషేక్‌‌‌‌ అసాధారణ ఆటతో సన్ రైజర్స్‌‌‌‌ 18.3 ఓవర్లలోనే  247/2  స్కోరు చేసి గెలిచింది. అభికే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

జోర్‌‌‌‌‌‌‌‌దార్‌‌‌‌‌‌‌‌ అయ్యర్ 

ఓపెనర్ల మెరుపులు.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఖతర్నాక్ ఇన్నింగ్స్‌‌‌‌కు తోడు చివర్లో స్టోయినిస్‌‌‌‌ సిక్సర్ల మోతతో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన కింగ్స్ ఫ్లాట్‌‌‌‌ వికెట్‌‌‌‌పైతొలి ఓవర్ నుంచే సన్ రైజర్స్ బౌలింగ్‌‌‌‌ను ఉతికేసింది. షమీ బౌలింగ్‌‌‌‌లో ఓపెనర్ ప్రభ్‌‌‌‌సిమ్రన్ సింగ్ హ్యాట్రిక్ ఫోర్లతో ఆటను మొదలు పెట్టగా.. కమిన్స్ వేసిన రెండో ఓవర్లో ప్రియాంశ్ ఆర్య  6,4 కొట్టాడు. ఆపై, షమీ బౌలింగ్‌‌‌‌లో 6,6,4 బాదగా.. ప్రభ్‌‌‌‌ సిక్స్‌‌‌‌ కొట్టడంతో మూడు ఓవర్లకే స్కోరు 50 దాటింది. దాంతో తన బదులు కమిన్స్‌‌‌‌ నాలుగో ఓవర్లో హర్షల్‌‌‌‌ను బరిలోకి దించాడు. అతను కూడా 4, 6 ఇచ్చుకున్నా..  స్లో బాల్‌‌‌‌తో ఆర్యను ఔట్‌‌‌‌ చేయడంతో ఫస్ట్ వికెట్‌‌‌‌కు 66 రన్స్ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్ ముగిసింది.

అతని తర్వాతి ఓవర్లో ప్రభ్‌‌‌‌సిమ్రన్ ఫోర్, శ్రేయస్ సిక్స్ రాబట్టడంతో పవర్‌‌‌‌‌‌‌‌ ప్లేను పంజాబ్‌‌‌‌ 89/1తో ముగించింది. ఫీల్డింగ్ మారిన తర్వాత బౌలింగ్‌‌‌‌కు వచ్చిన అరంగేట్రం స్పిన్నర్ ఎషాన్ మలింగ తన ఐదో బాల్‌‌‌‌కే ప్రభ్‌‌‌‌సిమ్రన్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసి రైజర్స్‌‌‌‌కు మరో బ్రేక్ ఇచ్చాడు. తర్వాతి కానీ ఆతిథ్య జట్టుకు ఈ ఆనందం ఎంతోసేపు నిలువలేదు. మలింగ బౌలింగ్‌‌‌‌లోనే శ్రేయస్, నేహల్ చెరో సిక్స్‌‌‌‌తో స్కోరు వంద దాటించారు. కమిన్స్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో లాంగాన్ మీదుగా భారీ సిక్స్‌‌‌‌ కొట్టిన శ్రేయస్‌‌‌‌.. అప్పటిదాకా పొదుపుగా బౌలింగ్ చేసిన జీషన్‌‌‌‌పై ఫోర్, రెండు సిక్సర్లతో ఎదురుదాడి చేశారు. షమీ వేసిన 13వ ఓవర్లో ఫోర్‌‌‌‌‌‌‌‌తో 22 బాల్స్‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్రతి చేసుకోగా.. స్కోరు 150 దాటింది. 

తర్వాతి ఓవర్లో వాధెరను మలింగ ఎల్బీ చేయగా.. హిట్టర్ శశాంక్ సింగ్ (2) హర్షల్ పటేల్ వెనక్కు పంపడంతో  పంజాబ్ స్పీడు కాస్త తగ్గినట్టు అనిపించింది. కానీ, జీషన్ బౌలింగ్‌‌‌‌లో భారీ సిక్స్ బాదిన శ్రేయస్‌‌‌‌.. మలింగ వేసిన 17వ ఓవర్లో క్లాసిక్ షాట్లతో నాలుగు ఫోర్లు కొట్టి స్కోరు 200 దాటించాడు. ఈ జోరు చూస్తుంటే శ్రేయస్ సెంచరీ చేయడంతో పాటు పంజాబ్ స్కోరు 260–270  దాటేలా కనిపించింది. కానీ, తర్వాతి ఓవర్లో స్లో ఫుల్‌‌‌‌ టాస్‌‌‌‌తో మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌ (3)ను బౌల్డ్ చేసిన హర్షల్ పటేల్ మరో స్లో షార్ట్‌‌‌‌ లెంగ్త్ బాల్‌‌‌‌తో శ్రేయస్‌‌‌‌ను కూడా ఔట్ చేసి ఐదే రన్స్‌‌‌‌ ఇచ్చాడు. 19వ  ఓవర్లో కమిన్స్‌‌‌‌ 8 రన్స్ ఇచ్చినా.. షమీ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా నాలుగు భారీ సిక్సర్లు కొట్టిన స్టోయినిస్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌కు అదిరిపోయే ఫినిషింగ్ ఇచ్చాడు. 

అభిషేక్‌‌‌‌.. చేసేశాడు..

పంజాబ్ బ్యాటర్లు దంచిన పిచ్‌‌‌‌పై సన్ రైజర్స్ మరింత రెచ్చిపోయి ఆడింది. భారీ టార్గెట్ ఛేజింగ్‌‌‌‌లో  ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ పంజాబ్ బౌలింగ్‌‌‌‌ను ఊచకోత కోశారు. అర్ష్‌‌‌‌దీప్ తొలి ఓవర్లో  హెడ్ రెండు ఫోర్లు కొట్టగా.. యాన్సెన్ బౌలింగ్‌‌‌‌లో అభిషేక్ నాలుగు ఫోర్లతో తన ధాటిని మొదలు పెట్టాడు. అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ తర్వాతి ఓవర్లో రనౌట్ ప్రమాదం తప్పించుకున్న హెడ్ హ్యాట్రిక్ ఫోర్లు రాబడితే.. ఇంపాక్ట్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ యశ్ ఠాకూర్ బౌలింగ్‌‌‌‌లో 4, 6, 6తో అభి మరింత గేరు మార్చాడు. ఈ ఓవర్లో అతను శశాంక్‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇచ్చినా అది నో బాల్‌‌‌‌ కావడంతో బతికిపోయాడు. దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న అభి భారీ షాట్లతో రెచ్చిపోవడంతో పవర్‌‌‌‌‌‌‌‌ ప్లేలోనే రైజర్స్83 రన్స్ రాబట్టింది. ఫీల్డింగ్ మారిన రెండు ఎండ్ల నుంచి స్పిన్నర్లు బౌలింగ్‌‌‌‌ చేసినా అభి వెనక్కు తగ్గలేదు.

 19 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసిన అభి ఎనిమిదో ఓవర్లో ఇచ్చిన క్యాచ్‌‌‌‌ను చహల్ వదిలేయడంతో అతనికి మరో లైఫ్ దక్కింది. ఆ ఓవర్లో శర్మ సిక్స్ కొట్టగా.. మ్యాక్సీ బౌలింగ్‌‌‌‌లో హెడ్ రెండు బాల్స్‌‌‌‌ను స్టాండ్స్‌‌‌‌కు చేర్చాడు.   యాన్సెన్ వేసిన పదో ఓవర్లో అభి  రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. మరో ఎండ్‌‌‌‌లో క్రమం తప్పకుండా బౌండ్రీలు రాబట్టిన హెడ్  30 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా..  11 ఓవర్లకే స్కోరు 150 దాటింది.  చహల్ వేసిన 13వ ఓవర్లో మ్యాక్సీకి క్యాచ్ ఇచ్చి హెడ్ ఔటవ్వడంతో  తొలి వికెట్‌‌‌‌కు 171 రన్స్ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్ ముగిసింది. అదే ఓవర్లో సెంచరీ (40 బాల్స్‌‌‌‌) పూర్తి చేసుకున్న అభి ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. క్లాసెన్ (21 నాటౌట్‌‌‌‌) తోడుగా మరింత రెచ్చిపోయాడు. చహల్ వేసిన 15వ ఓవర్లో 6, 4, 6 కొట్టి స్కోరు 200 దాటించాడు. యశ్ ఠాకూర్‌‌‌‌‌‌‌‌ ఓవర్లో 6, 4 కొట్టిన యంగ్‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌ గెలుపు ముంగిట ఔటైనా.. శశాంక్ బౌలింగ్‌‌‌‌లో 4, 6 కొట్టిన క్లాసెన్.. యశ్ బౌలింగ్‌‌‌‌లో ఫోర్‌‌‌‌‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌ను ముగించాడు.


1. ఐపీఎల్‌‌‌‌లో హయ్యెస్ట్ స్కోరు చేసిన ఇండియన్‌‌‌‌గా అభిషేక్ రికార్డు కెక్కాడు. కేఎల్ రాహుల్ (132*) ను అధిగమించాడు. 

2.ఐపీఎల్‌‌‌‌లో ఇది సెకండ్ హయ్యెస్ట్ టార్గెట్ ఛేజింగ్‌. గతేడాది పంజాబ్ కేకేఆర్‌‌‌‌‌‌‌‌పై 262 టార్గెట్ ఛేజ్ చేసి టాప్‌లో ఉంది. 

116  ఈ మ్యాచ్‌‌‌‌లో అభి ఫోర్లు, సిక్సర్ల రూపంలో రాబట్టిన రన్స్‌‌‌‌. ఐపీఎల్‌‌‌‌లో సన్ రైజర్స్‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌కు అత్యధికం. బెయిర్ స్టో (90 రన్స్‌‌‌‌) రికార్డు బ్రేక్ చేశాడు.

సంక్షిప్త స్కోర్లు
పంజాబ్‌‌: 20 ఓవర్లలో 245/6 (శ్రేయస్ 82, ప్రభ్‌‌సిమ్రన్ 42, హర్షల్ 4/42)
సన్ రైజర్స్‌‌:  20 ఓవర్లలో 247/2 (అభిషేక్ 141, హెడ్‌‌ 66, అర్ష్‌‌దీప్ 1-/37)