- సన్ రైజర్స్‑గుజరాత్ మ్యాచ్ వర్షార్పణం
- ప్లే ఆఫ్స్ చేరుకున్న హైదరాబాద్
హైదరాబాద్, వెలుగు : చల్లటి సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్ల మెరుపులు చూద్దామని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఐపీఎల్ 17లో మరో మ్యాచ్ వాన ఖాతాలో పడింది. సన్ రైజర్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య గురువారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. కనీసం టాస్ కూడా సాధ్యం కాలేదు. దాంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. 13 మ్యాచ్‌ల్లో 15 పాయింట్లతో మూడో ప్లేస్‌తో హైదరాబాద్ ప్లే ఆఫ్స్ బెర్తు సొంతం చేసుకుంది.
రాజస్తాన్ తమ చివరి మ్యాచ్‌లో కేకేఆర్ చేతిలో ఓడి.. సన్ రైజర్స్ ఆదివారం పంజాబ్‌పై గెలిస్తే రెండో ప్లేస్ సాధిస్తుంది. కాగా, గుజరాత్ చివరి రెండు మ్యాచ్‌లు వర్షంతో రద్దవగా.. 14 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో ఎనిమిదో ప్లేస్‌తో లీగ్‌ను ముగించింది. కేకేఆర్, రాజస్తాన్, సన్ రైజర్స్‌కు మూడు బెర్తులు ఖాయమైన నేపథ్యంలో శనివారం ఆర్‌సీబీ పై గెలిస్తే సీఎస్కే నేరుగా ప్లేఆఫ్స్ చేరనుంది.
గ్రౌండ్ స్టాఫ్ చెమటోడ్చినా..
సిటీలో మధ్యాహ్నం భారీ వర్షం కురవగా.. సాయంత్రం తెరిపినిచ్చింది. క్యూరేటర్ చంద్రశేఖర్ నేతృత్వంలోని గ్రౌండ్ స్టాఫ్ అప్పటికే పిచ్, గ్రౌండ్‌ను కవర్లతో కప్పి ఉంచింది. వాన ఆగిన వెంటనే సూపర్ సాపర్ల సాయంతో ఔట్ ఫీల్డ్‌లోని నీటిని బయటకు పంపించారు. భారీగా నీళ్లు నిలిచిన సౌత్ పెవిలియన్ బౌండ్రీ లైన్స్ వద్ద చిత్తడిగా మారిన ఔట్ ఫీల్డ్‌ను సైతం సరి చేశారు. దాంతో 7.35 సమయంలో గ్రౌండ్‌ను రెడీ చేశారు.
8 గంటలకు టాస్ వేస్తారని ప్రకటించగా.. పది నిమిషాలకు తిరిగి చినుకులు మొదలయ్యాయి. తర్వాత వాన తగ్గకపోవడంతో 10.10 గంటలకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ15 నిమిషాల తర్వాత వర్షం పూర్తిగా ఆగిపోవడం గమనార్హం.
డబ్బులు రీఫండ్
ఈ మ్యాచ్‌కు 33,781 మంది ఫ్యాన్స్ హాజరయ్యారు. కానీ ఆట జరగకపోవడంతో నిరాశకు గురయ్యారు. ఒక్క బంతి కూడా పడకపోవడంతో టికెట్ల డబ్బులు రీఫండ్ చేస్తామని ఆర్గనైజర్స్ ప్రకటించారు. ఆ వివరాలను టికెట్లు బుక్ చేసిన ఈ మెయిల్, ఫోన్ నెంబర్లకు పంపిస్తామని తెలిపారు. ఫిజికల్ టికెట్లను తమ వద్దే ఉంచుకోవాలని సూచించారు.
పాయింట్స్ టేబుల్
టీమ్ మ్యాచ్‌లు గెలుపు ఓటమి రద్దు రన్‌రేట్ పాయింట్లు
కోల్‌కతా 13 9 3 1 1.42 19
రాజస్తాన్ 13 8 5 0 0.27 16
హైదరాబాద్ 13 7 5 1 0.40 15
చెన్నై 13 7 6 0 0.52 14
ఢిల్లీ 14 7 7 0 -0.37 14
బెంగళూరు 13 6 7 0 0.38 12
లక్నో 13 6 7 0 -0.78 12
గుజరాత్ 14 5 7 2 -1.06 12
పంజాబ్ 13 5 8 0 -0.34 10
ముంబై 13 4 9 0 -0.27 8