IPL 2024: ఆ రెండు జట్లు లేవు.. టైటిల్ గెలవడానికి సన్ రైజర్స్‌‌కు సువర్ణావకాశం

IPL 2024: ఆ రెండు జట్లు లేవు.. టైటిల్ గెలవడానికి సన్ రైజర్స్‌‌కు సువర్ణావకాశం

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అదరగొడుతుంది. కమ్మిన్స్ నేతృత్వంలో ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించడమే కాదు.. ఏకంగా టాప్ 2 లో చోటు సంపాదించి కోల్ కతా నైట్ రైడర్స్ తో క్వాలిఫయర్ 1 మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. తొలి మ్యాచ్ ను ఓటమితో ఆరంభించినా ఆ తర్వాత ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించింది. ఇదే ఊపులో టైటిల్ కొట్టాలని తెలుగు అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. 

సన్ రైజర్స్ ఐపీఎల్ ట్రోఫీ గెలవడానికి ఇదొక మంచి అవకాశమని చెప్పాలి. దీనికి కారణం ఈ సారి చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు లీగ్ దశలోనే ఇంటిదారి పట్టడం. ఈ రెండు జట్లు కూడా ఐపీఎల్ ను శాసించాయి. ప్లే ఆఫ్స్ కు వచ్చాయంటే టైటిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తాయి. రోహిత్ సారధ్యంలోని ముంబై ఇండియన్స్ 5 సార్లు ఛాంపియన్ గా అవతరిస్తే.. ధోనీ సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ 5 సార్లు ట్రోఫీను గెలుచుకున్నాయి. ఈ రెండు జట్లు ఈ సీజన్ లో ప్లే ఆఫ్ కు అర్హత సాధించకపోవడంతో టైటిల్ సన్ రైజర్స్ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ కు వెళ్లిన మరో మూడు జట్లు. ఈ మూడు బలమైన జట్లే అయినా చెన్నై, ముంబై జట్లలా అనుభవం లేకపోగా ఒత్తిడిలో చిత్తవుతాయి. దీంతో కొంచెం శ్రమిస్తే ఈ సీజన్ లో మనం సన్ రైజర్స్ ను విజేతగా చూడొచ్చు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న కమ్మిన్స్ సేన అదే ఊపును ప్లే ఆఫ్స్ లో కొనసాగిస్తే 2016 తర్వాత మరోసారి టైటిల్ అందుకోవచ్చు.