
హైదరాబాద్, వెలుగు: వరుస ఓటములతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై కీలక పోరుకు సిద్ధమైంది. శనివారం రాత్రి ఇక్కడి ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై గెలిచి తిరిగి గాడిలో పడాలని చూస్తోంది.
గత సీజన్ రన్నరప్ అయిన సన్ రైజర్స్ ఈ సారి తొలిపోరులో రాజస్తాన్ రాయల్స్‌పై 286 స్కోరు చేసి 44 రన్స్ తేడాతో గెలిచి అంచనాలను అమాంతం పెంచింది. ఆ మ్యాచ్‌లో మన బ్యాటర్ల జోరు చూసి లీగ్‌లో300 రన్స్ స్కోరు చేసే సత్తా హైదరాబాద్‌కే ఉందని అందరూ అంచనా వేశారు. కానీ, రైజర్స్ అతి దూకుడైన బ్యాటింగ్ స్టయిల్ తర్వాత ప్రతికూల ఫలితాలు తెచ్చింది.
గత నాలుగు మ్యాచ్‌ల్లో 190, 163, 120, 152 స్కోర్లు చేసి ఘోర ఓటములను మూటగట్టుకుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హైన్రిచ్ క్లాసెన్ లాంటి కీలక ఆటగాళ్లు ఫామ్ కోల్పోవడం జట్టును దెబ్బతీస్తోంది. హెడ్ ఈ సీజన్‌లో వరుసగా 67, 47, 22, 4, 8 స్కోర్లు చేశాడు.
అభిషేక్ శర్మ టాప్ స్కోరు 24 రన్స్ మాత్రమే. తొలి పోరులోనే అద్భుత సెంచరీ కొట్టిన ఇషాన్ అదే జోరును కొనసాగించలేకపోయాడు. క్లాసెన్ ఇప్పటిదాకా తన మార్కు ఇన్నింగ్స్ ఆడలేదు. మొత్తంగా టాపార్డర్ విఫలమవ్వడం సన్ రైజర్స్ బ్యాటింగ్‌ను బలహీనంగా మార్చింది. అదే సమయంలో బౌలింగ్‌లోనూ పలు సమస్యలు సన్ రైజర్స్‌ను వెంటాడుతున్నాయి.
కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్ వంటి సీనియర్లు ఉండి కూడా రైజర్స్ బౌలింగ్ యూనిట్ నిలకడగా రాణించలేకపోయింది. ఆరంభ ఓవర్లలో వికెట్లు తీసే సామర్థ్యం లేకపోవడంతో పాటు, మధ్య ఓవర్లలోనూ ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి సృష్టించడంలో రైజర్స్ విఫలమవుతోంది.
పంజాబ్ చేతిలోనూ ఓడితే ఈ సీజన్ ప్లే ఆఫ్స్ అవకాశాలపై కమిన్స్ సేన ఆశలు కోల్పోవాల్సిన పరిస్థితి రానుంది. దాంతో బ్యాటర్లు వెంటనే గాడిలో పడటంతో పాటు బౌలింగ్ యూనిట్ కూడా శక్తి మేరకు కృషి చేస్తేనే హైదరాబాద్ తిరిగి విజయాల బాట పట్టగలదు.
జోష్‌లో పంజాబ్
సన్ రైజర్స్‌తో పోల్చితే పంజాబ్ కింగ్స్ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. గత సీజన్లలో చివరి స్థానాల కోసం పోటీ పడ్డ పంజాబ్ కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో ఈసారి అద్భుతంగా ఆడుతోంది. నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. శ్రేయస్ బ్యాట్‌తో ముందుండి రాణిస్తూ, కెప్టెన్‌గానూ సక్సెస్ అవుతున్నాడు.
పంజాబ్ విజయాల్లో మరో హైలైట్ యంగ్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య అనొచ్చు. సీఎస్కేతో గత మ్యాచ్‌లో మిగతా బ్యాటర్లు ఫెయిలైనా ఖతర్నాక్ సెంచరీతో జట్టును గెలిపించాడు. శశాంక్ సింగ్ కూడా ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే విషయం. బౌలింగ్‌లోనూ ఆ టీమ్ మెరుగ్గానే ఉంది. అర్ష్ దీప్ సింగ్, లోకీ ఫెర్గుసన్, యుజ్వేంద్ర చహల్, యాన్సెన్ సత్తా చాటుతున్నారు. దాంతో పంజాబ్ కింగ్స్ ఐదో విజయంపై కన్నేసింది.