ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కు మరోసారి ఫుల్ కిక్ ఇచ్చింది. టోర్నీ ప్రారంభంలో ముంబైపై ఆడిన ఇన్నింగ్స్ ను రిపీట్ చేసింది. ఫామ్ లో లేని బెంగళూరు బౌలర్లపై దారుణంగా విరుచుకుపడుతూ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ చేసి తమ రికార్డ్ ను బ్రేక్ చేసుకుంది. చిన్నస్వామి స్టేడియాన్ని బౌండరీలతో హోరెత్తిస్తూ హైదరాబాద్ బ్యాటర్లు వీర ఉతుకుడు ఉతికారు. హెడ్(41 బంతుల్లో 102, 9 ఫోర్లు, 8 సిక్సులు) ఊచకోత సెంచరీకి తోడు క్లాసన్(67, 31 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సులు) మెరుపు హాఫ్ సెంచరీతో నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 287 పరుగులు చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ తొలి ఓవర్ నుంచే విధ్వంసం ప్రారంభమైంది. హెడ్ విధ్వంసంతో పవర్ ప్లేలో ఏకంగా 76 పరుగులు చేయడమే కాదు 7.1 ఓవర్లు ముగిసేసరికి స్కోర్ 100 పరుగులు దాటింది. తొలి వికెట్ కు 108 పరుగులు జోడించిన తర్వాత ఓపెనర్ అభిషేక్ శర్మ 21 బంతుల్లో 34 పరుగులు చేసి ఔటయ్యాడు.ఈ దశలో హెడ్ కు జత కలిసిన క్లాసన్ అదే ఊపును కొనసాగించారు. ముఖ్యంగా హెడ్ కొడితే ఫోర్, లేకపోతే సిక్సర్ అన్నట్టుగా సాగింది. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేసి ఈ ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ ఆసీస్ వీరుడు.. మరో 19 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
హెడ్ ఔటైన తర్వాత దక్షిణాఫ్రికా ద్వయం క్లాసన్, మార్కరం ఇన్నింగ్స్ ను శర వేగంతో ముందుకు తీసుకెళ్లారు. క్లాసన్ ఔటైనా చివర్లో అబ్దుల్ సమద్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 10 బంతుల్లోనే 37 పరుగులు చేసి సన్ రైజర్స్ స్కోర్ బోర్డును 280 పరుగులకు చేర్చాడు. ఆర్సీబీ బౌలర్లలో లాకీ ఫెర్గుసన్ రెండు వికెట్లు, టాప్లీ ఒక వికెట్ తీసుకున్నారు.