DC vs SRH: పరువు నిలబెట్టిన అనికేత్.. బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైన సన్ రైజర్స్

DC vs SRH: పరువు నిలబెట్టిన అనికేత్.. బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైన సన్ రైజర్స్

విశాఖ పట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. యువ బ్యాటర్ అనికేత్ వర్మ (41 బంతుల్లో 74: 5 ఫోర్లు, 6 సిక్సర్లు) మినహాయిస్తే మిగిలిన వారు కనీస ప్రదర్శన కూడా చేయలేకపోయారు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు.. పటిష్టమైన సన్ రైజర్స్ బ్యాటర్లను కట్టడి చేయడంలో సఫలమయ్యారు. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌట్ అయింది. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ కు మంచి ఆరంభం లభించలేదు. ఫామ్ లో లేని అభిషేక్ శర్మ ఒక పరుగు చేసి ఈ సారి రనౌట్ రూపంలో వెనుదిరగాల్సి వచ్చింది. వెంటనే ఇషాన్ కిషాన్ (2) స్టార్క్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి బౌండరీ దగ్గర దొరికిపోయాడు. నితీష్ కుమార్ రెడ్డి వచ్చి రాగానే భారీ షాట్ కొట్టి క్యాచ్ ఇచ్చి డకౌటయ్యాడు. కాసేపటికే హెడ్ (22) స్టార్క్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. దీంతో సన్ రైజర్స్ 37 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది 

Also Read :  టీమిండియాతో వన్డే, టీ20 సిరీస్

ఈ దశలో సన్ రైజర్స్ వెనకడుగు వేయలేదు. క్లాసన్, కొత్త కుర్రాడు అనికేత్ శర్మ అద్భుతంగా ఆడారు. బౌండరీలతో హోరెత్తించారు. ముఖ్యంగా అనికేత్ ఆడిన విధానం అద్భుతమని చెప్పాలి. కొత్త కుర్రాడైనా ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. మరో ఎండ్ లో క్లాసన్ (32) కూడా బ్యాట్ ఝుళిపించడంతో 10 ఓవర్లకే జట్టు స్కోర్ 105 పరుగులకు చేరింది. ఈ దశలో భారీ స్కోర్ ఖాయమనుకుంటే మన బ్యాటర్లు తడబడ్డారు. మోహిత్ శర్మ స్లో బంతితో క్లాసన్ ను బోల్తా కొట్టించాడు. 

ఇదే ఊపులో అభినవ్ మనోహర్ (4), పాటు కమ్మిన్స్ (2) వెంటనే ఔటయ్యారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా అనికేత్ అసమాన పోరాటం ఆకట్టుకుంది. అక్షర్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 15 ఓవర్లో వరుసగా 4, 6, 6 పరుగులు కొట్టాడు. అనికేత్ ఔట్ కావడంతో సన్ రైజర్స్ తక్కువ స్కోర్ కే పరితమైంది. ఢిల్లీ బౌలర్లలో స్టార్క్ ఐదు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. మోహిత్ శర్మకు ఒక వికెట్ దక్కింది.