సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ ..తొలి క్వాలిఫయర్‌‌లో 8 వికెట్ల తేడాతో ఓటమి

సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ ..తొలి క్వాలిఫయర్‌‌లో 8 వికెట్ల తేడాతో ఓటమి
  • చెలరేగిన శ్రేయస్‌‌, వెంకటేశ్‌‌, స్టార్క్‌‌
  • రాహుల్‌‌, క్లాసెన్‌‌ శ్రమ వృథా

అహ్మదాబాద్‌‌ : లీగ్ దశలో పరుగుల సునామీ సృష్టించిన సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌.. క్వాలిఫయర్స్‌‌–1లో చతికిలపడింది. పవర్‌‌ హిట్టర్లందరూ అట్టర్‌‌ ఫ్లాఫ్‌‌ కావడంతో భారీ స్కోరు చేయలేకపోయింది. చిన్న టార్గెట్‌‌ను శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (24 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 4 సిక్స్‌‌లతో 58 నాటౌట్‌‌), వెంకటేశ్‌‌ అయ్యర్‌‌ (28 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 4 సిక్స్‌‌లతో 51 నాటౌట్‌‌) నిలకడగా ఛేదించడంతో.. మంగళవారం జరిగిన మ్యాచ్‌‌లో కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌ 8 వికెట్ల తేడాతో హైదరాబాద్‌‌పై నెగ్గి ఫైనల్‌‌ ఫైట్‌‌కు అర్హత సాధించింది. టాస్‌‌ గెలిచిన హైదరాబాద్‌‌ 19.3 ఓవర్లలో 159 రన్స్‌‌కే ఆలౌటైంది.

రాహుల్‌‌ త్రిపాఠి (35 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 55), క్లాసెన్‌‌ (21 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 32), కమిన్స్‌‌ (24 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 30) మినహా మిగతా వారు నిరాశపర్చారు. తర్వాత కోల్‌‌కతా 13.4 ఓవర్లలో 164/2 స్కోరు చేసి గెలిచింది. స్టార్క్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. బుధవారం రాజస్తాన్‌‌, బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌‌ విన్నర్‌‌తో హైదరాబాద్‌‌ శుక్రవారం రెండో క్వాలిఫయర్‌‌ ఆడుతుంది. 

స్టార్క్‌‌ దెబ్బ..

ఫ్లాట్‌‌ వికెట్‌‌పై బ్యాటింగ్‌‌ ఎంచుకున్న హైదరాబాద్‌‌ను ఆరంభంలోనే స్టార్క్‌‌ (3/34) కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఇన్నింగ్స్‌‌ రెండో బాల్‌‌కు ట్రావిస్‌‌ హెడ్‌‌ (0)ను, ఐదో ఓవర్‌‌లో వరుస బాల్స్‌‌లో నితిశ్‌‌ కుమార్‌‌ (9), షాబాజ్‌‌ అహ్మద్‌‌ (0)ను ఔట్‌‌ చేశాడు. రెండో ఓవర్‌‌లో అభిషేక్‌‌ శర్మ (3)ను వైభవ్​ అరోరా (1/17) పెవిలియన్‌‌కు పంపడంతో ఎస్‌‌ఆర్‌‌హెచ్‌‌ 39/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో రాహుల్‌‌, క్లాసెన్‌‌ ఇన్నింగ్స్‌‌ను ఆదుకున్నారు. వికెట్‌‌ను కాపాడుకుంటూ సింగిల్స్‌‌ తీస్తూ 45/4తో పవర్‌‌ప్లేను ముగించారు. ఫీల్డింగ్‌‌ పెరిగిన తర్వాత 8వ ఓవర్‌‌లో రాహుల్‌‌ తొలి సిక్స్‌‌, ఓ ఫోర్‌‌ బాదాడు.

వెంటనే క్లాసెన్‌‌ కూడా 6, 4, 4తో బ్యాట్‌‌ ఝుళిపించడంతో ఫస్ట్‌‌ టెన్‌‌లో హైదరాబాద్‌‌ స్కోరు 92/4కు చేరింది. ఇక ఓకే అనుకుంటున్న టైమ్‌‌లో తొలి ఓవర్‌‌ (11వ) వేసిన నరైన్‌‌ (1/40).. క్లాసెన్‌‌ను ఔట్‌‌ చేసి ఐదో వికెట్‌‌కు 62 రన్స్‌‌ భాగస్వామ్యాన్ని ముగించాడు. అబ్దుల్‌‌ సమద్‌‌ (16)తో కలిసి తర్వాతి రెండు ఓవర్లలో 14 రన్స్‌‌ చేసిన రాహుల్‌‌ అనూహ్యంగా రనౌటయ్యాడు. తర్వాతి బాల్‌‌కు సన్వీర్‌‌ సింగ్‌‌ (0)ను డకౌట్‌‌ చేశాడు. 15వ ఓవర్‌‌లో సమద్‌‌ కూడా వెనుదిరిగాడు. ఈ టైమ్‌‌లో వచ్చిన కమిన్స్‌‌ ధనాధన్‌‌ బ్యాటింగ్‌‌కు తెరలేపాడు.

16వ ఓవర్‌‌లో భువనేశ్వర్‌‌ (0)ను వరుణ్‌‌ (2/26) ఔట్‌‌ చేయడంతో స్కోరు 126/9గా మారింది. చివర్లో విజయకాంత్‌‌ (7 నాటౌట్‌‌)కు స్ట్రయిక్‌‌ ఇవ్వకుండా కమిన్స్‌‌ 4, 6, 6, 4 కొట్టి మరో మూడు బాల్స్‌‌ మిగిలి ఉండగానే లాస్ట్‌‌ వికెట్‌‌గా ఔటయ్యాడు. పదో వికెట్‌‌కు 33 రన్స్‌‌ జత చేయడంతో  ఆ మాత్రం టార్గెటైనా వచ్చింది. 

నిలకడగా ఛేదన..

ఛేదనలో కోల్‌‌కతాకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. ఓపెనర్లు రహమానుల్లా గుర్బాజ్‌‌ (23) ఫోర్‌‌తో ఖాతా తెరిస్తే, నరైన్‌‌ (21) రెండు ఫోర్లతో టచ్‌‌లోకి వచ్చాడు. ఆ వెంటనే గుర్బాజ్‌‌ సిక్స్‌‌తో రెండో ఓవర్‌‌లోనే 20 రన్స్‌‌ వచ్చాయి. భువీ వేసిన థర్డ్‌‌ ఓవర్‌‌లో గుర్బాజ్‌‌ 6, 4 కొట్టి నాలుగో ఓవర్‌‌లో నటరాజన్‌‌ (1/22)కు వికెట్‌‌ ఇచ్చాడు. తొలి వికెట్‌‌కు 44 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. వచ్చీ రావడంతో వెంకటేశ్‌‌ మూడు ఫోర్లు కొట్టడంతో పవర్‌‌ప్లేలో కేకేఆర్‌‌ 63/1 స్కోరు చేసింది. కానీ ఏడో ఓవర్‌‌లో నరైన్‌‌ ఔట్‌‌కావడంతో నైట్‌‌రైడర్స్‌‌ స్కోరు 67/2గా మారింది. 

ఈ దశలో శ్రేయస్‌‌ నిలకడగా ఆడితే వెంకటేశ్‌‌ భారీ హిట్టింగ్‌‌కు దిగాడు. విజయ్‌‌కాంత్‌‌, కమిన్స్‌‌, నటరాజన్‌‌ను టార్గెట్‌‌ చేసి భారీ సిక్స్‌‌లు బాదాడు. అప్పటివరకు నెమ్మదిగా ఆడిన శ్రేయస్‌‌ వరుసగా 4, 6, 6, 4, 6, 6 దంచాడు. దీంతో మూడో వికెట్‌‌కు 44 బాల్స్‌‌లోనే 97 రన్స్‌‌ జత చేసి మరో 38 బాల్స్‌‌ మిగిలి ఉండగానే ఈజీగా విజయాన్ని అందించాడు.