
ప్రతీకారం లేదు. మళ్లీ పరాభవమే. గత మ్యాచ్‌లో వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపైనా అదే ఫలితాన్ని రిపీట్ చేసింది. టాప్–4 బ్యాటర్లు 0, 8, 1, 2 స్కోర్లతో బోల్తా కొట్టిన వేళ ముంబైకి కనీస పోటీ ఇవ్వలేకపోయిన రైజర్స్ వరుసగా రెండో, మొత్తంగా ఆరో ఓటమి ఖాతాలో వేసుకుంది. ఇంకోవైపు ట్రెంట్ బౌల్ట్ (4/26), దీపక్ చహర్ (2/12) అద్భుత బౌలింగ్‌కు తోడు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (46 బాల్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో70) మెరుపులతో రైజర్స్‌ను మరోసారి పడగొట్టిన ముంబై వరుసగా నాలుగో విజయంతో మరింత జోరందుకుంది.
హైదరాబాద్, వెలుగు: దుమ్మురేపే బ్యాటింగ్‌తో గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి ప్లే ఆఫ్స్ చేరే అవకాశం కూడా కనిపించడం లేదు. మెగా టోర్నీలో మరోసారి చెత్త బ్యాటింగ్‌తో నిరాశపరిచిన సన్ రైజర్స్ ఆరో ఓటమితో డీలా పడింది. సొంతగడ్డపై గత పోరులో రికార్డు ఛేజింగ్‌తో అదరగొట్టిన బ్యాటింగ్ యూనిట్ ఈసారి బోల్తా కొట్టడంతో ఉప్పల్ స్టేడియంలో బుధవారం మ్యాచ్‌లో సన్ రైజర్స్ 7 వికెట్ల తేడాతో ముంబై చేతిలో చిత్తయింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 143/8 స్కోరు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (44 బాల్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 71) ఫిఫ్టీతో జట్టును ఆదుకున్నాడు. అభినవ్ మనోహర్ (37 బాల్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 43) సత్తా చాటాడు . అనంతరం రోహిత్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ (19 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్‌తో ముంబై 15.4 ఓవర్లలోనే 146/3 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. ట్రెంట్ బౌల్ట్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. శుక్రవారం చెపాక్ స్టేడియంలో జరిగే తదుపరి మ్యాచ్‌లో సీఎస్కేతో సన్ రైజర్స్ తలపడనుంది.
టాప్ ఢమాల్.. ఆదుకున్న క్లాసెన్
సొంతగడ్డపై గత మ్యాచ్ రికార్డు టార్గెట్‌ను ఛేజ్ చేసిన సన్ రైజర్స్ ఈసారి బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది. వికెట్ నుంచి లభిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకున్న ముంబై పేసర్లు దీపక్ చహర్, ట్రెంట్ బౌల్ట్ కొత్త బాల్‌తో వరుస ఓవర్లలో వికెట్లు పడగొట్టి సన్ రైజర్స్ టాపార్డర్‌ను కుదేలు చేశారు. అద్భుతంగా ఆడిన క్లాసెన్.. ఇంపాక్ట్ ప్లేయర్ అభినవ్‌తో ఆరో వికెట్‌కు 99 రన్స్ జోడించి జట్టుకు గౌరవప్రద స్కోరు అందించాడు. స్టార్టింగ్‌లో మాత్రం ముంబై పేసర్లు హడలెత్తించారు. తొలి ఓవర్‌లో చహర్ రెండే రన్స్ ఇవ్వగా... బౌల్ట్ తన రెండో బాల్‌కే ఓపెనర్ ట్రావిస్ హెడ్ (0)ను డకౌట్ చేసి సన్ రైజర్స్‌ను తొలి దెబ్బకొట్టాడు.
అదే ఓవర్లో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (8) సిక్స్ కొట్టినా.. దీపక్ చహర్ వేసిన లెగ్ సైడ్ వైడ్ బాల్‌ను వెంటాడిన ఇషాన్ కిషన్ (1) కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాతి ఓవర్లో బౌల్ట్ స్లో లెంగ్త్ బాల్‌కు అభిషేక్ సింపుల్ క్యాచ్ ఇచ్చి ఔటవగా.. దీపక్ వేసిన ఐదో ఓవర్లో తొలి బాల్‌కే నిర్లక్ష్యమైన షాట్ ఆడిన నితీష్ రెడ్డి (2) సైతం వికెట్ పారేసుకోవడంతో సన్ రైజర్స్ 13/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. బుమ్రా వేసిన ఆరో ఓవర్లో అనికేత్ వర్మ (12) ఫోర్ కొట్టగా.. పవర్ ప్లేను రైజర్స్ 24/4తో ముగించింది. తొలి ఆరు ఓవర్లలో ఆతిథ్య జట్టు ఒక సిక్స్, ఒక ఫోర్ మాత్రమే రాబట్టింది.
ఫీల్డింగ్ మారిన వెంటనే చహర్ బౌలింగ్‌లో ఫోర్‌తో క్లాసెన్ వేగం పెంచే ప్రయత్నం చేశాడు. కానీ, తొమ్మిదో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన హార్దిక్ పాండ్యా ఊరించే షార్ట్ బాల్‌తో అనికేత్‌ను పెవిలియన్ చేర్చడంతో 35 రన్స్‌కే రైజర్స్ సగం వికెట్లు కోల్పోయింది. ఈ లెక్కన రైజర్స్ వందలోపే ఆలౌటయ్యేలా కనిపించింది. కానీ, క్రీజులో కుదురుకున్న క్లాసెన్ ఒక్కసారిగా స్పీడు పెంచాడు. విఘ్నేశ్ పుతుర్ వేసిన పదో ఓవర్లో 6, 4,4తో ఎదురుదాడికి దిగాడు. హార్దిక్ ఓవర్లోనూ మూడు ఫోర్లు బాదడంతో రైజర్స్ శిబిరంలో జోష్ పెరిగింది. మరో ఎండ్‌లో స్ట్రయిక్ రొటేట్ చేసిన అభినవ్ మనోహర్.. బుమ్రా బౌలింగ్‌లో సిక్స్‌తో ఆకట్టుకున్నాడు.
స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ డాట్ బాల్స్‌తో ఒత్తిడి పెంచినా.. పేసర్లను టార్గెట్ చేసి షాట్లు ఆడిన క్లాసెన్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. బుమ్రా బౌలింగ్‌లో రెండు బౌండ్రీలతో 17 ఓవర్లకు స్కోరు 100 దాటించగా.. హార్దిక్ ఓవర్లో అభినవ్ సిక్స్, ఫోర్‌తో ఆకట్టుకున్నాడు. బుమ్రా వేసిన 19వ ఓవర్లో అతనిచ్చిన క్యాచ్‌ను లాంగాన్‌లో సూర్య డ్రాప్ చేయగా.. ఐదో బాల్‌కు సిక్స్ కొట్టిన క్లాసెన్ మరో షాట్‌కు ట్రై చేసి తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. చివరి ఓవర్లో మనోహర్ సిక్స్ కొట్టినా.. అతనితో పాటు కమిన్స్ (1)ను ఔట్ చేసిన బౌల్ట్ 9 రన్స్ ఇవ్వడంతో రైజర్స్ కష్టంగా 140 మార్కు దాటింది.
రోహిత్ ధనాధన్
చిన్న టార్గెట్‌ను ముంబై సులువుగానే అందుకుంది. ముంబై బౌలర్లు విజృంభించిన పిచ్‌పై ఆతిథ్య బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. ఆరంభంలోనే రెండు ఫోర్లతో అలరించిన ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (11)ను రెండో ఓవర్లో ఉనాద్కట్ మెరుపు రిటర్న్ క్యాచ్‌తో ఔట్ చేసినా.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన ఫామ్‌ను కొనసాగించాడు. గత మ్యాచ్‌లో ఫిఫ్టీతో టచ్‌లోకి వచ్చిన రోహిత్.. స్టేడియంలోని అభిమానులు తన పేరు జపిస్తూ ఉత్సాహపరచడంతో మరింత రెచ్చిపోయాడు. కమిన్స్ వేసిన మూడో ఓవర్లో పుల్ షాట్‌తో సిక్స్, ఫోర్‌తో ఆకట్టుకున్నాడు. అదే ఓవర్లో విల్ జాక్స్ (22) సిక్స్ బాదడంతో 17 రన్స్ వచ్చాయి.
ఉనాద్కట్ బౌలింగ్‌లోనూ హిట్‌మ్యాన్ 4, 6తో ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు. ఎషాన్ మలింగ బౌలింగ్‌లో జాక్స్ వరుసగా రెండు ఫోర్లు రాబట్టడంతో పవర్ ప్లేను ముంబై 56/1తో ముగించింది. హర్షల్ పటేల్ పొదుపుగా బౌలింగ్ చేసినా.. జీషన్ అన్సారీ ఓవర్లో లాంగాన్ మీదుగా రోహిత్ మరో సిక్స్‌తో ఆకట్టుకున్నాడు. జీషన్ తర్వాతి ఓవర్లో జాక్స్ ఔటైనా.. హిట్‌మ్యాన్ వెనక్కు తగ్గలేదు. కమిన్స్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన అతను 35 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.
సూర్యకుమార్ యాదవ్ కూడా వరుస బౌండ్రీలు కొట్టడంతో 12 ఓవర్లకే స్కోరు వంద దాటింది. ఫ్యాన్స్ కేరింతల నడుమ హర్షల్ బౌలింగ్‌లో రోహిత్ మూడు ఫోర్లతో మరింత స్పీడు పెంచాడు. గెలుపు ముంగిట ఎషాన్ బౌలింగ్‌లో హిట్‌మ్యాన్ ఔటైనా.. సూర్య రెండు సిక్సర్లతో విజృంభించాడు. ఆపై జీషన్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టిన అతను మరో 26 బాల్స్ మిగిలుండగానే మ్యాచ్ ముగించాడు.
ఇషాన్ ఔట్ కాకున్నా..
ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ క్యాచ్ ఔట్ కాకున్నా వికెట్ పారేసుకున్నాడు. రెండో ఓవర్లో దీపక్ చహర్ వేసిన లెగ్ సైడ్ వైడ్ బాల్‌ను అతను లెగ్ గ్లాన్స్ చేసే ప్రయత్నం చేయగా.. అది కనెక్ట్ అవ్వలేదు. కానీ, బాల్ బ్యాట్‌కు తాకిందని ఇషాన్ పెవిలియన్ బాట పట్టాడు. అప్పటికి వైడ్ సిగ్నల్ ఇవ్వబోయిన అంపైర్ వినోద్.. ఇషాన్ వెనుదిరగడం చూసి ఔటిచ్చాడు. పైగా, అతని ఔట్ కోసం కీపర్, బౌలర్ సహా ముంబై ప్లేయర్లు ఎవ్వరూ అప్పీల్ చేయకపోవడం విశేషం. కానీ, టీవీ రీప్లేలో బాల్ ఇషాన్ బ్యాట్‌కు తగిలినట్టు ఆల్ట్రా ఎడ్జ్‌లో ఎలాంటి స్పైక్ లేకపోవడం గమనార్హం.
సంక్షిప్త స్కోర్లు
హైదరాబాద్: 20 ఓవర్లలో 143/8 (క్లాసెన్ 71, అభినవ్ 43, బౌల్ట్ 4/26), ముంబై: 15.4 ఓవర్లలో 146/3 (రోహిత్ 70, సూర్య 40*, జైదేవ్ 1/25).