ఐపీఎల్లో చెత్త ప్రదర్శనతో అభిమానుల ఆగ్రహానికి గురవుతూ.. తీవ్ర విమర్శల పాలవుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చే ఐపీఎల్ కోసం ఇప్పుడే కసరత్తు ప్రారంభించింది. రాబోయే ఐపీఎల్లో పటిష్ట జట్టును బరిలోకి దింపే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే టీమ్ లో మార్పులు చేస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్..తాజాగా కొత్త కోచ్ ను నియమించింది. ప్రస్తుత కోచ్ , విండీస్ లెజెండ్ బ్రియాన్ లారాను తొలగించింది. లారా స్థానంలో న్యూజిలాండ్ ఆల్ రౌండర్ డానియల్ వెటోరీని నియమించింది.
బై బై లారా..
ఐపీఎల్ లో 2016లో విజేతగా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్..ఆ తర్వాత టైటిల్ ను దక్కించుకోలేకపోయింది. ఆటగాళ్లు, కోచ్ లు మారినా..సన్ రైజర్స్ రాత మాత్రం మారడం లేదు. దీంతో వచ్చే ఐపీఎల్ లో ఎలాగైనా విజేతగా నిలవాలని భావిస్తున్న జట్టు యాజమాన్యం..జట్టును ప్రక్షళన చేయాలని భావించింది. ఇందులో భాగంగానే గత సీజన్ లో కొంత మంది ఆటగాళ్లను వదులుకుంది. మరికొంత మందిని వేలంలో కొనుగోలు చేసింది. తాజాగా హెడ్ కోచ్ బ్రియన్ లారాను తొలగించింది సన్ రైజర్స్. లారా స్థానంలో డానియల్ వెట్టోరిని హెడ్ కోచ్ గా నియమించుకుంది. ఈ మేరకు సన్‌రైజర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కివీ లెజెండ్ డానియల్ వెటోరీ ఆరెంజ్ ఆర్మీ హెడ్ కోచ్‌గా జాయిన్ అవుతున్నాడు. వెల్‌కమ్ కోచ్' అని సన్‌రైజర్స్ పోస్టు చేసింది.
వెటోరీపైనే ఆశలు..
ఐపీఎల్ లో డానియల్ వెటోరి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. క్రికెట్‌నుంచి తప్పుకున్న తర్వాత ఆర్సీబీ జట్టుకే కోచ్ గా నియమితుడయ్యాడు. 2014 - 2018 మధ్య హెడ్‌కోచ్‌గా పనిచేశాడు. వెటోరి కోచ్ గా ఉన్న సమయంలో ఆర్సీబీ 2015లో ప్లేఆఫ్స్ చేరింది. 2016లో ఏకంగా ఫైనల్ చేరుకుంది. అయితే ఈ రెండు సీజన్ ప్లేఆఫ్స్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఆర్సీబీ ఓడింది. ప్రస్తుతం వెటోరీ ఆస్ట్రేలియా మెన్స్ టీమ్ కోచ్‌గా ఉన్నాడు. అలాగే బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్, కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో బర్బాడోస్ రాయల్స్ జట్లకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. డానియల్ వెటోరి కెరీర్ విషయానికి వస్తే..న్యూజిలాండ్ తరపున అతను 113 టెస్టులు ఆడి 4531 పరుగులు చేశాడు. 295 వన్డేల్లో 2253 పరుగులు, 34 టీ20ల్లో 205 పరుగులు సాధించాడు. 34 ఐపీఎల్ మ్యాచ్ లు కూడా ఆడాడు.
ఆరేళ్లలో నలుగురు..
గత ఆరేళ్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నలుగురు కోచ్‌లు నియమించుకుంది. వెటోరి కంటే ముందు సన్‌రైజర్స్‌కు... టామ్ మూడీ, ట్రివోర్ బెయిలిస్, బ్రియన్ లారా హెడ్కోచ్లుగా పనిచేశారు. ఐపీఎల్లో 2016 నుంచి -2020 వరకు ప్లేఆఫ్స్ చేరిన సన్‌రైజర్స్.... 2021 నుంచి 2023 వరకు కేవలం 13 విజయాలనే నమోదు చేసి.. 29 మ్యాచుల్లో ఓడిపోయింది. లాస్ట్ సీజన్ లో అయితే సన్‌రైజర్స్... 14 మ్యాచ్‌లు ఆడింది. అందులో కేవలం నాలుగే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో చివర్లో నిలిచింది.
- ALSO READ :ఎంపీల క్రికెట్‌కు బీసీసీఐ విరాళం