SRH vs MI: హమ్మయ్య పరువు కాపాడారు: సన్ రైజర్స్‌ను నిలబెట్టిన క్లాసన్, మనోహర్.. ముంబై ముందు స్వల్ప లక్ష్యం

SRH vs MI: హమ్మయ్య పరువు కాపాడారు: సన్ రైజర్స్‌ను నిలబెట్టిన క్లాసన్, మనోహర్.. ముంబై ముందు స్వల్ప లక్ష్యం

ముంబై ఇండియన్స్ తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లో తీవ్రంగా నిరాశపరించింది. బుధవారం (ఏప్రిల్ 23) జరుగుతున్న ఈ మ్యాచ్ లో సొంతగడ్డపై ఆడతారనుకుంటే ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చారు. టాపార్డర్, మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలమైన వేళ.. వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసన్ (44 బంతుల్లో 71: 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే బ్యాటింగ్ భారాన్ని మోశాడు. క్లాసన్ హాఫ్ సెంచరీతో పాటు అభినవ్ మనోహర్ (37 బంతుల్లో 43) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. 71 పరుగులు చేసి క్లాసన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ముంబై బౌలర్లు పవర్ ప్లే లో విజృంభించడంతో 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలో పడింది. రెండో ఓవర్ తొలి బంతికి ఓపెనర్ ట్రావిస్ హెడ్ (0) భారీ షాట్ కు ప్రయత్నించి బోల్ట్ బౌలింగ్ లో ఔటయ్యాడు. మూడో ఓవర్ లో చాహర్ తొలి బంతికే ఇషాన్ కిషాన్ (8) ను పెవిలియన్ కు పంపాడు. నాలుగో ఓవర్లో బోల్ట్ మరో షాక్ ఇచ్చాడు. అభిషేక్ శర్మ (8) ను ఔట్ చేయడంతో సన్ రైజర్స్ మూడో వికెట్ కోల్పోయింది.

ఈ సీజన్ లో పేలవ ఫామ్ లో ఉన్న నితీష్ రెడ్డి (2), యువ బ్యాటర్ అనికేత్ వర్మ (12) కూడా ఎక్కవ సేపు క్రీజ్ లో నిలవలేకపోయారు. దీంతో 35 పరుగులకే సగం జట్టు పెవిలియన్ కు చేరింది. ఈ దశలో సన్ రైజర్స్ 100 పరుగుల మార్క్ అయినా చేరుతుందా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ దశలో క్లాసన్, అభినవ్ మనోహర్ జట్టును నిలబెట్టారు. 5 వికెట్లు పడినా వెనకడుగు వేయకుండా ఎదురు దాడికి దిగారు. ముఖ్యంగా క్లాసన్ చెలరేగి ఆడి జట్టు స్కోర్ ను ముందుకు తీసుకెళ్లాడు. వీరిద్దరూ ఆరో వికెట్ కు 99 పరుగులు జోడించడంతో సన్ రైజర్స్ 140 పరుగుల మార్క్ దాటింది. ముంబై బౌలర్లలో బోల్ట్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. దీపక్ చాహర్ రెండు.. బుమ్రా, హార్దిక్ పాండ్య తలో వికెట్ తీసుకున్నారు.