
- గిల్, సుందర్ మెరుపులు.. జీటీ హ్యాట్రిక్ విక్టరీ
- సిరాజ్ కెరీర్ బెస్ట్ బౌలింగ్
- గుజరాత్ చేతిలో 7 వికెట్లతో రైజర్స్ చిత్తు
హైదరాబాద్, వెలుగు: సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్లీ ఫెయిలైంది. చెత్తాటతో ఐపీఎల్‌లో వరుసగా నాలుగో మ్యాచ్‌లో ఓడింది. సొంతగడ్డపై రైజర్స్ ఆటను ఆస్వాదించాలని ఆశించిన ఫ్యాన్స్‌ను మరో హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ (4/17) అలరించాడు. గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్న సిరాజ్ లీగ్‌లో కెరీర్ బెస్ట్ బౌలింగ్‌తో విజృంభించిన వేళ రైజర్స్ హిట్టర్లంతా మరోసారి ఫ్లాపయ్యారు. దాంతో ఉప్పల్ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన వన్‌సైడ్ పోరులో రైజర్స్ 7 వికెట్ల తేడాతో టైటాన్స్ చేతిలో చిత్తయింది. తొలుత సన్ రైజర్స్ 20 ఓవర్లలో 152/8 స్కోరు చేసింది. నితీశ్ కుమార్ రెడ్డి (34 బాల్స్‌లో 3 ఫోర్లతో 31), హెన్రిచ్ క్లాసెన్ (19 బాల్స్‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 27), పాట్ కమిన్స్ (9 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 22 నాటౌట్) రాణించారు. సిరాజ్ నాలుగు, ప్రసిధ్ కృష్ణ, సాయి కిశోర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (43 బాల్స్‌లో 9 ఫోర్లతో 61 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (29 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 49) మెరుపులతో జీటీ 16.4 ఓవర్లలో 153/3 స్కోరు చేసి వరుసగా మూడో విక్టరీతో హ్యాట్రిక్ సాధించింది. సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
సిరాజ్ జోరు.. రైజర్స్ అదే తీరు
గత మూడు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌లో నిరాశపరిచిన సన్ రైజర్స్ మరోసారి తడబడింది. పిచ్‌ను పక్కాగ అంచనా వేసి బౌలింగ్ ఎంచుకున్న జీటీ కెప్టెన్ గిల్ నిర్ణయానికి బౌలర్లు పూర్తి న్యాయం చేశారు. లోకల్ స్టార్ సిరాజ్ తొలి ఓవర్లోనే రైజర్స్‌కు షాకిచ్చాడు. రెండు ఫోర్లు కొట్టిన ఓపెనర్ ట్రావిస్ హెడ్ (8)ను ఆరో బాల్‌కే ఔట్ చేశాడు. సిరాజ్ ప్యాడ్లపైకి వేసిన ఫుల్ లెంగ్త్ బాల్‌ను హెడ్ సుదర్శన్ చేతుల్లోకి కొట్టాడు. ఇషాంత్‌ను టార్గెట్ చేసి అభిషేక్ శర్మ (18), ఇషాన్ కిషన్ (17) వరుస బౌండ్రీలు కొట్టినా.. ఐదో ఓవర్లో అభిని పెవిలియన్ చేర్చి ఒకే రన్ ఇచ్చిన సిరాజ్ హోమ్ టీమ్‌ను మరో దెబ్బకొట్టాడు.
ఇక్కడి నుంచి ప్రసిధ్ కృష్ణ, రషీద్ ఖాన్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో రైజర్స్ డీలా పడింది. ఇషాన్‌తో పాటు నితీశ్ రెడ్డి సింగిల్స్‌కే పరిమితం అయ్యారు. ప్రసిధ్ వేసిన ఎనిమిదో ఓవర్లో షాట్‌కు ట్రై చేసిన ఇషాన్.. ఇషాంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్లాసెన్ కూడా ఇబ్బంది పడటంతో వరుసగా ఐదు ఓవర్లలో ఒక్క బౌండ్రీ కూడా రాలేదు. సగం ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్ 64/3తో నిలిచింది. రషీద్ వేసిన తర్వాతి ఓవర్లో నితీశ్ రెండు ఫోర్లు.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో క్లాసెన్ 4,6తో ఇన్నింగ్స్‌కు మళ్లీ ఊపు తెచ్చారు. సాయి కిశోర్ బౌలింగ్‌లోనూ చెరో ఫోర్ కొట్టడంతో రైజర్స్ స్కోరు వంద దాటి పుంజుకున్నట్టు కనిపించింది. కానీ, అదే ఓవర్లో లైన్ మిస్సైన క్లాసెన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కిశోర్ బౌలింగ్‌లోనే నితీశ్ కూడా ఔటయ్యాడు. డెత్ ఓవర్లలోనూ పరిస్థితి మారలేదు. కమిందు మెండిస్ (1) ఫెయిలవగా.. ప్రసిధ్ బౌలింగ్‌లో అనికేత్ వర్మ (18), ఇషాంత్ బౌలింగ్‌లో కమిన్స్ చెరో రెండు ఫోర్లు కొట్టారు. కానీ, 19 ఓవర్లో మళ్లీ బౌలింగ్‌కు దిగిన సిరాజ్ మూడే రన్స్ ఇచ్చి అనికేత్, సిమర్‌జీత్ సింగ్ (0)ను ఔట్ చేశాడు. ఇషాంత్ వేసిన చివరి ఓవర్లో కమిన్స్ 4, 6.. షమీ (6 నాటౌట్) ఫోర్ రాబట్టడంతో రైజర్స్ అతి కష్టంగా 150 మార్కు అందుకుంది.
గెలిపించిన గిల్, సుందర్
చిన్న టార్గెట్ ఛేజింగ్‌ను గుజరాత్ తడబడుతూ ఆరంభించినా కెప్టెన్ గిల్, వాషింగ్టన్ సుందర్ జట్టుకు విజయం అందించారు. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్లను స్టార్టింగ్‌లోనే ఔట్ చేసిన పేసర్లు కమిన్స్, షమీ పదునైన బంతులతో జీటీని ఒత్తిడిలోకి నెట్టారు. షమీ బౌలింగ్‌లో సాయి సుదర్శన్(5) అనికేత్‌కు క్యాచ్ ఇవ్వగా.. బట్లర్ (0)ను కమిన్స్ డకౌట్ చేశాడు. దాంతో నాలుగు ఓవర్లకు జీటీ 17/2తో నిలవడంతో రైజర్స్ విజయంపై ఆశలు రేగాయి. కానీ, ఆతిథ్య బౌలర్లు ఇదే జోరును కొనసాగించలేకపోయారు. షమీ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన గిల్ టచ్‌లోకి వచ్చాడు. జీటీ తరఫున అరంగేట్రం చేసిన సుందర్ ఆరో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన సిమర్‌జీత్‌కు రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో స్వాగతం పలికాడు.
పవర్ ప్లేను 48/2తో ముగించిన గిల్, సుందర్ ఫీల్డింగ్ మారిన తర్వాత కూడా మంచి సమన్వయంతో బ్యాటింగ్ చేశారు. స్పిన్నర్లను పక్కాగ ఎదుర్కొంటూ క్రమం తప్పకుండా బౌండ్రీలు కొట్టడంతో 13 ఓవర్లలో జీటీ స్కోరు వంద దాటగా.. గిల్ 36 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అయితే, షమీ బౌలింగ్‌లో అనికేత్ పట్టిన చురుకైన క్యాచ్‌కు ఔటైన సుందర్ ఒక్క పరుగు తేడాతో ఫిఫ్టీ కోల్పోయాడు. దాంతో మూడో వికెట్‌కు 90 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయింది. కానీ, అప్పటికే మ్యాచ్ జీటీ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇక, ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన రూథర్‌ఫోర్డ్ (16 బాల్స్‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 35 నాటౌట్)వరుస బౌండ్రీలతో హోరెత్తించడంతో మరో 20 బాల్స్ మిగిలుండగానే జీటీ ఆటను ముగించింది.
సంక్షిప్త స్కోర్లు
సన్ రైజర్స్: 20 ఓవర్లలో 152/8 (నితీశ్ 31, క్లాసెన్ 27, కమిన్స్ 22*, సిరాజ్ 4/17)
గుజరాత్: 16.4 ఓవర్లలో153/3 (గిల్ 61*, సుందర్ 49, షమీ 2/28)
100 ఐపీఎల్‌లో సిరాజ్ వంద వికెట్ల క్లబ్‌లో చేరాడు. అభిషేక్ వికెట్ తీసి ఈ మార్కు అందుకున్నాడు.