ఉప్పల్ వేదికగా ముంబైగా ఇండియన్స్, సన్ రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలు సిసలు మజాను అందించింది. కొడితే సిక్స్ లేకపోతే ఫోర్ అనేట్లుగా ఇరు జట్ల విధ్వంసం సాగింది. మ్యాచ్ లైవ్ లో కాకుండా హైలెట్స్ చూసిన ఫీలింగ్ సగటు క్రికెట్ అభిమానికి కలుగుతుంది. హై స్కోరింగ్ థ్రిల్లర్ గా సాగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ 31 పరుగుల తేడాతో గెలిచి టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. 278 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై 246 పరుగులకే పరిమితమైంది.
భారీ లక్ష్యం కళ్ళ ముందు కనబడుతున్నా.. ముంబై ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. చివరి ఓవర్ వరకు తమ పోరాటాన్ని కొనసాగించింది. తొలి మూడు ఓవర్లలోనే 50 పరుగులు జోడించి కిషాన్, రోహిత్ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. రోహిత్ 12 బంతుల్లో 3 సిక్సర్లు, ఒక ఫోర్ తో 26 పరుగులు చేస్తే.. కిషాన్ 13 బంతుల్లో 4 సిక్సర్లు,2 ఫోర్లతో 34 పరుగులు చేసి సన్ రైజర్స్ బౌలర్లను వణికించారు. స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ ఔటైనా.. తిలక్ వర్మ విధ్వంసం సృష్టించాడు.
బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించాడు. తిలక్ జోరు ధాటికి ఒక దశలో ముంబై గెలుస్తుందేమో అనిపించింది. 34 బంతుల్లో 6 సిక్సర్లు 2 ఫోర్లతో 64 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్ లో ఔటయ్యాడు. తిలక్ ఔట్ తో ముంబై ఛేజింగ్ లో వెనకపడింది. భువనేశ్వర్, ఉనాద్కట్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో పరుగులు రావడం కష్టమైంది. పాండ్య(20), టిం డేవిడ్ (42) పోరాడినా.. లక్ష్యం భారీగా ఉండడంతో ముంబైకి పరాజయం తప్పలేదు.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. ట్రావిస్ హెడ్ ధాటికి తొలి 7 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 102 పరుగులు చేసింది. 24 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్సర్లతో 62 పరుగులు చేసి హెడ్ ఔటయ్యాడు. ఇక్కడ నుంచి అభిషేక్ శర్మ వంతు వచ్చింది. హెడ్ 18 బంతుల్లో అర్ధ సెంచరీ చేస్తే అభిషేక్ మాత్రం అంతకు మించి చెలరేగి 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 23బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 63 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఈ దశలో మార్కరం కు జత కలిసిన క్లాసన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 55 బంతుల్లోనే 116 పరుగులు రాబట్టారు. 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న క్లాసన్ మొత్తం 34 బంతుల్లో 7 సిక్సులు, నాలుగు ఫోర్లతో 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఎండ్ లో మార్కరం 28 బంతుల్లో 42 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ముంబై బౌలర్లలో మఫాకా 4 ఓవర్లలో ఏకంగా 66 పరుగులు.. కోయెట్జ్ నాలుగు ఓవర్లలో 57 పరుగులు సమర్పించుకున్నాడు.
#SunrisersHyderabad vs #MumbaiIndians, 8th Match
— Ariana Television (@ArianaTVN) March 27, 2024
Sunrisers Hyderabad won by 31 runs
SRH 277/3 (20)
MI 246/5 (20) CRR: 12.3
---------------------------------
Watch IPL 2024 Live here:
👉https://t.co/I8WAqdpYxW
Alternatively you also can watch IPL 2024 live on AWCC Sport… pic.twitter.com/KtX4AmX1Nv