SRH vs RR IPL 2025: రాజస్థాన్‌పై ఘన విజయం.. గెలుపుతో టోర్నీ స్టార్ట్ చేసిన సన్ రైజర్స్

SRH vs RR IPL 2025: రాజస్థాన్‌పై ఘన విజయం.. గెలుపుతో టోర్నీ స్టార్ట్ చేసిన సన్ రైజర్స్

ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్ పై ఘన విజయం సాధించింది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ పోరులో 44 పరుగుల తేడాతో గెలిచి సీజన్ ను గ్రాండ్ గా ప్రారంభించింది. మరోవైపు రాజస్థాన్ చివరి వరకు పోరాడినా టార్గెట్ మరింత పెద్దది కావడంతో ఫలితం లేకుండా పోయింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసి ఓడిపోయింది. 

287 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఒక పరుగే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ పరాగ్.. తొలి బంతికి ఫోర్ కొట్టి రెండో బంతికి ఔటయ్యాడు. ఈ రెండు వికెట్లు కూడా సిమర్జీత్ సింగ్ కే దక్కాయి.  నాలుగో స్థానంలో వచ్చిన నితీష్ రాణా కూడా ఎక్కువ సేపు క్రీజ్ లో నిలబడలేకపోయాడు. కేవలం 11 పరుగులే చేసి షమీ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడినా.. ధృవ్ జురెల్, సంజు శాంసన్ పోరాటం అత్యద్భుతం. 

ఓటమి కళ్ళ ముందు కనబడుతున్నా వీరి పోరాటం సన్ రైజర్స్ జట్టులో దడ పుటించింది. బౌండరీల వర్షం కురిపిస్తూ స్కోర్ కార్డును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరూ తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. నాలుగో వికెట్ కు ఈ జోడీ 9 ఓవర్లలోనే 110 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఏదైనా సంచలనం నమోదవుతుందా అనే సమయంలో శాంసన్, జురెల్ స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. చివర్లో శుభమ్ దూబే, హెట్ మేయర్ బౌండరీలతో విరుచుకుపడ్డారు. అయితే జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ పటేల్, సిమర్జీత్ సింగ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.   

ALSO  READ : Jofra Archer: సన్ రైజర్స్ దెబ్బకు ఆర్చర్ విల విల.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త బౌలింగ్

అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్  నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. తొలి సారి సన్ రైజర్స్ తరపున ఆడుతున్న ఇషాన్ కిషాన్ 45 బంతుల్లో సెంచరీ చేసి దుమ్ము లేపాడు. అతని ఇన్నింగ్స్ లో 6 సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నాయి. ట్రావిస్ హెడ్ (67) హాఫ్ సెంచరీతో మెరుపులు మెరిపించగా.. క్లాసన్(34), నితీష్ రెడ్డి (30) రాణించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో తుషార్ దేశ్ పాండే మూడు వికెట్లు తీసుకోగా.. తీక్షణ రెండు వికెట్లు పడగొట్టాడు. సందీప్ శర్మ ఒక వికెట్ పడగొట్టాడు.