DC vs SRH: సరిపోని ఢిల్లీ మెరుపులు.. సన్ రైజర్స్ భారీ విజయం

DC vs SRH: సరిపోని ఢిల్లీ మెరుపులు.. సన్ రైజర్స్ భారీ విజయం

ఐపీఎల్ లో సన్ రైజర్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ పై జరిగిన ఈ మ్యాచ్ లో 67 పరుగుల భారీ విజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ 199 పరుగులకే పరిమితమైంది. 7 మ్యాచ్ ల్లో సన్ రైజర్స్ కు ఇది ఐదో విజయం కాగా.. 8 మ్యాచ్ ల్లో ఢిల్లీకి ఇది ఐదో పరాజయం. 

267 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీకి అదిరిపోయే ఆరంభం లభించింది. తొలి ఓవర్లోనే పృథ్వి షా నాలుగు ఫోర్లు కొట్టి 16 పరుగులు రాబట్టాడు. 16 పరుగులు చేసి షా ఔటైనా.. మరో ఓపెనర్  జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్  ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మూడో ఓవర్లో సుందర్ బౌలింగ్ లో మూడు ఫోర్లు, మూడు సిక్సులతో ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. మరో ఎండ్ లో అభిషేక్ పోరెల్ బ్యాట్ ఝళిపించడంతో స్కోర్ బోర్డు పరుగులెత్తింది. 

ఉన్నంత సేపు వేగంగా ఆడిన  జేక్ ఫ్రేజర్ 18 బంతుల్లోనే 7 సిక్సులు, 5 ఫోర్లతో 65 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే అభిషేక్ పోరెల్ (22 బంతుల్లో 42,7 ఫోర్లు, ఒక సిక్సర్) స్టంపౌటయ్యాడు. దీంతో ఢిల్లీ లక్ష్య ఛేదనలో వెనకపడింది. స్టబ్స్(10) కూడా ఔట్ కావడంతో మ్యాచ్ పూర్తిగా సన్ రైజర్స్ వైపు మళ్లింది. చివర్లో రిషబ్ పంత్(44) బ్యాట్ ఝుళిపించినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. సన్ రైజర్స్ బౌలర్లలో నటరాజన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. మార్కండే, నితీష్ రెడ్డి తలో రెండు వికెట్లు తీసుకున్నాడు.    

అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్..  ఓపెనర్లు ట్రావిస్ హెడ్(32 బంతుల్లో 89,11 ఫోర్లు, 6 సిక్సులు), అభిషేక్ శర్మ(12 బంతుల్లో 46, 2 ఫోర్లు, 6 సిక్సులు) శివాలెత్తడం.. చివర్లో షాబాజ్ అహ్మద్(29 బంతుల్లో 59,2 ఫోర్లు,5 సిక్సులు) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు.