SRH vs PBKS: ఉప్పల్‌లో సన్ రైజర్స్ అద్భుతం.. విధ్వంసకర సెంచరీతో పంజాబ్‌ను ఓడించిన అభిషేక్

SRH vs PBKS: ఉప్పల్‌లో సన్ రైజర్స్ అద్భుతం.. విధ్వంసకర సెంచరీతో పంజాబ్‌ను ఓడించిన అభిషేక్

ఐపీఎల్ 2025 లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతం చేసింది. అసాధారణ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి ప్రత్యర్థి పంజాబ్ కు ఊహించని షాక్ ఇచ్చింది. ఉప్పల్ వేదికగా  శనివారం (ఏప్రిల్ 12) పంజాబ్ కింగ్స్ పై జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారీ స్కోర్ కళ్ళముందు ఉన్నా.. అభిషేక్ శర్మ (55 బంతుల్లో 14 ఫోర్లు.. 10 సిక్సర్లతో 141) ఊర మాస్ ఉతుకుడుతో మ్యాచ్ ఏకపక్షం అయిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ 18.3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసి గెలిచింది.

246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వీర ఉతుకుడు ఉతుకుతూ తొలి వికెట్ కు 12.2 ఓవర్లలోనే 170 పరుగులు జోడించి పటిష్ట స్థితికి చేర్చారు. తొలి ఓవర్ నుంచే ఇద్దరూ ధాటిగా ఇన్నింగ్స్ ను ఆరంభించారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ అదే పనిగా చెలరేగాడు. రెండో ఓవర్ లో నాలుగు ఫోర్లు బాదడంతో పాటు.. ఐదో ఓవర్ లో 16 పరుగులు వచ్చాయి. వీరిద్దరి ధాటికి పవర్ ప్లే లో సన్ రైజర్స్ వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసింది. 

Also Read : ఇది కదా తుఫాన్ ఇన్నింగ్స్ అంటే

పవర్ ప్లే తర్వాత వీరిద్దరూ ఇంకా దూకుడు ప్రదర్శించారు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ 19 బంతుల్లో.. హెడ్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసుకున్నారు. 10 ఓవర్లో మార్కో జాన్సెన్ బౌలింగ్ లో రెండు సిక్సులు, రెండు ఫోర్లు సఫారీ బౌలర్ కు చుక్కలు చూపించాడు. అప్పటికే మ్యాచ్ సన్ రైజర్స్ చేతుల్లోకి రాగా.. 66 పరుగులు చేసి హెడ్ ఔటయ్యాడు. తర్వాత 40 బంతుల్లోనే సెంచరీ చేసిన అభిషేక్.. మొత్తం 55 బంతుల్లో 14 ఫోర్లు.. 10 సిక్సర్లతో 141 పరుగులు చేసి ఔటయ్యాడు. అప్పటికే సన్ రైజర్స్ విజయం ఖరారు కాగా.. చివర్లో క్లాసన్(21), కిషాన్ (9) మ్యాచ్ ను ఫినిష్ చేశారు. పంజాబ్ బౌలర్లలో ఆర్ష దీప్ సింగ్, చాహల్ కు తలో వికెట్ దక్కింది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఉప్పల్ లో పరుగుల వరద పారించారు. ఓపెనర్లు ఇచ్చిన అద్భుతమైన ఆరంభానికి తోడు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్( 32 బంతుల్లో 86:6 ఫోర్లు,6 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోర్ చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు, ఇషాన్ మలింగ రెండు వికెట్లు తీసుకున్నారు.