- ఐపీఎల్ 17 చాంపియన్ నైట్ రైడర్స్..
- ఫైనల్లో 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ చిత్తు
- ఫైనల్లో 8 వికెట్ల తేడాతో హైదరాబాద్‌కు చెక్
- చెలరేగిన రసెల్, స్టార్క్, వెంకటేశ్,
- బ్యాటింగ్‌లో తేలిపోయిన సన్‌రైజర్స్
ఆరు సార్లు 200 ప్లస్ స్కోర్లు. మూడుసార్లు 250 ప్లస్ మార్కు. రెండుసార్లు అత్యధిక స్కోర్ల రికార్డు బ్రేక్. పవర్ హిట్టింగ్‌ను పతాక స్థాయికి తీసుకెళ్తూ ఈ సీజన్‌లో సన్ రైజర్స్ సాగించిన విధ్వంసమిది. పవర్‌ప్లేలోనే రెండు సార్లు 100 పైచిలుకు రన్స్ చేసి.. 167 రన్స్ టార్గెట్‌ను పది ఓవర్లనే ఊదేసి.. తమతో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థులు భయపడేలా చేసింది. కానీ ఏం లాభం. ఆఖరాటలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది.
లీగ్ దశలో భారీ స్కోర్లతో హడలెత్తించిన సన్‌రైజర్స్ ఆఖరి మెట్టుపై అనూహ్యంగా బోల్తా కొట్టింది.! కోల్‌కతా బౌలింగ్ దాడిని ఎదుర్కోలేక భారీ హిట్టర్లందరూ పెవిలియన్‌కు క్యూ కట్టడంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది..! దీంతో ఏకపక్షంగా సాగిన టైటిల్ పోరులో కేకేఆర్‌కు పోటీ ఇవ్వలేక రెండోసారి టైటిల్ గెలిచే అద్భుతం అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకుంది..! లీగ్ మొత్తం సూపర్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆఖరాటలోనూ అదే జోరు చూపెట్టింది..! చిన్న టార్గెట్‌ను వేగంగా ఛేదించింది. మొత్తం ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ను మూడోసారి ఓడించిన కోల్‌కతా మూడో టైటిల్‌తో మెరిసి మురిసింది..!!
రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్‌లో ఖతర్నాక్ ఆట చూపెట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్ చాంపియన్‌గా నిలిచింది. టోర్నీ స్టార్టింగ్ నుంచి అదరగొట్టిన కేకేఆర్ ఆదివారం రాత్రి చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన మెగా ఫైనల్లో 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. దాంతో లీగ్‌లో పదేండ్ల గ్యాప్ తర్వాత మళ్లీ విజేతగా నిలిచిన కోల్‌కతా ముచ్చటగా మూడోసారి కప్పు నెగ్గి తీన్‌మార్ కొట్టింది.
ఆరేండ్ల తర్వాత ఫైనల్‌కు వచ్చిన సన్ రైజర్స్ రెండోసారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. రెండు బలమైన జట్ల మధ్య ఫైనల్ ఫైట్ హోరాహోరీగా సాగుతుందని అనుకుంటే కేకేఆర్ దెబ్బకు వార్ వన్‌సైడ్ అయింది. ఈ సీజన్‌లో తమ పవర్ హిట్టింగ్‌తో భారీ స్కోర్లు కొడుతూ.. రికార్డులు బద్దలు కొడుతూ ముందుకొచ్చిన సన్ రైజర్స్ బ్యాటర్లు ఆఖరాటలో మాత్రం బోల్తా కొట్టారు.
కేకేఆర్ బౌలర్లు విజృంభించడంతో హైదరాబాద్113 రన్స్‌కే ఆలౌటైంది. ఇప్పటి వరకు జరిగిన 17 ఫైనల్స్‌లో ఇదే అతి తక్కువ స్కోరు. కోల్‌కతా 10.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేజ్ చేసి ఈజీగా గెలిచింది. మొత్తంగా సన్ రైజర్స్‌ను ఓడిస్తూ ఈ సీజన్‌ను షురూ చేసిన కేకేఆర్... ఆదే జట్టుపై నెగ్గి ఫైనల్ చేరింది. ఆఖరాటలోనూ హైదరాబాద్‌ను ఓడించి కప్పు సొంతం చేసుకోవడం విశేషం.
ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్... ఐపీఎల్–17 టైటిల్‌ను సొంతం చేసుకుంది. మిచెల్ స్టార్క్ (2/14), ఆండ్రీ రసెల్ (3/19) సూపర్ బౌలింగ్‌కు తోడు వెంకటేశ్ అయ్యర్ (26 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 నాటౌట్) చెలరేగడంతో.. ఆదివారం జరిగిన మెగా లీగ్ ఫైనల్ ఫైట్‌లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై నెగ్గింది. 2014 తర్వాత కేకేఆర్‌కు ఇది తొలి టైటిల్ కావడం విశేషం. టాస్ గెలిచిన హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 రన్స్‌కే ఆలౌటైంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (19 బాల్స్‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 24), ఐడెన్ మార్‌క్రమ్ (23 బాల్స్‌లో 3 ఫోర్లతో 20) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. తర్వాత కోల్‌కతా 10.3 ఓవర్లలో 114/2 స్కోరు చేసి నెగ్గింది. రహ్మనుల్లా ుర్బాజ్ (32 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39) మెరుగ్గా ఆడాడు. స్టార్క్ కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
బ్యాటర్లు అట్టర్ ఫ్లాఫ్
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ బ్యాటర్లు అట్టర్ ఫ్లాఫ్ అయ్యారు. ఒక్కరు కూడా కేకేఆర్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొలేకపోయారు. లీగ్ దశలో విఫలమైన ఐపీఎల్ కాస్ట్ లీ బౌలర్ మిచెల్ స్టార్క్ (2/14) నాకౌట్ మ్యాచ్‌ల్లో మాత్రం తన జోరును మరోసారి కొనసాగించాడు. బాల్‌ను స్వింగ్ చేస్తూ ఆరంభంలోనే హైదరాబాద్‌ను దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్ ఐదో బాల్‌కే లేట్ స్వింగ్ బాల్‌తో అభిషేక్ (2)ను ఔట్ చేశాడు.
తర్వాతి ఓవర్‌లోనే వైభవ్ ఆరోరా (1/24) ఫుల్ లెంగ్త్ బాల్‌తో ట్రావిస్ హెడ్ (0)ను పెవిలియన్‌కు పంపాడు. చివరి నాలుగు మ్యాచ్‌ల్లో హెడ్ డకౌట్ కావడం ఇది మూడోసారి. వన్‌డౌన్ రాహుల్ త్రిపాఠి (9), మార్‌క్రమ్ ఇన్నింగ్స్‌ను గట్టెక్కించే బాధ్యత తీసుకున్నా కేకేఆర్ బౌలర్ల ముందు నిలవలేకపోయారు. ఐదో ఓవర్‌లో స్టార్క్ వేసిన ఎక్స్‌ట్రా బౌన్స్ బాల్‌కు త్రిపాఠి ఇచ్చిన క్యాచ్‌ను స్క్వేర్ లెగ్‌లో రమన్‌దీప్ సూపర్‌గా అందుకున్నాడు.
పవర్‌ప్లే ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్ 40/3తో కష్టాల్లో పడింది. మార్‌క్రమ్‌తో కలిసిన నితీశ్ కుమార్ (13)ను ఏడో ఓవర్‌లోనే హర్షిత్ రాణా (2/24) వెనక్కి పంపించినా.. హిట్టర్ క్లాసెన్ (16) ఉన్నాడనే భరోసాతో ఇన్నింగ్స్‌పై ఆశలు పెట్టుకున్నారు. కానీ రసెల్ బౌలింగ్‌కు దిగడంతో పరిస్థితి మరింత దిగజారింది. సగం ఓవర్లకు 62/4 స్కోరు చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ను అతను ఘోరంగా దెబ్బకొట్టాడు.
11, 13వ ఓవర్లలో వరుసగా మార్‌క్రమ్, అబ్దుల్ సమద్ (4)ను ఔట్ చేసి వికెట్ల పతనాన్ని వేగం చేశాడు. 12వ ఓవర్‌లో వరుణ్ (1/9).. షాబాజ్ అహ్మద్ (8) వికెట్ తీయగా, 15వ ఓవర్‌లో క్లాసెన్‌ను ఔట్ చేసిన రాణా కోల్‌కతాకు అతిపెద్ద బ్రేక్ ఇచ్చాడు. చివర్లో కమిన్స్ కాసేపు పోరాడినా రసెల్ ముందు నిలవలేకపోయాడు. రెండు ఓవర్ల ముందు కమిన్స్ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేసిన స్టార్క్ ఈసారి మాత్రం ఆ తప్పు చేయలేదు. ఉనాద్కట్ (4), భువనేశ్వర్ (0 నాటౌట్) కూడా విఫలం కావడంతో ఎస్‌ఆర్‌హెచ్ మొత్తం ఓవర్లు కూడా ఆడలేకపోయింది.
వెంకటేశ్ ధనాధన్
చిన్న ఛేజింగ్‌ను కోల్‌కతా వేగంగా మొదలుపెట్టింది. రెండో ఓవర్‌లో సిక్స్ కొట్టిన సునీల్ నరైన్ (6)ను కమిన్స్ (1/18) ఔట్ చేసినా పెద్దగా ఇబ్బంది పడలేదు. గుర్బాజ్, వెంకటేశ్ ధనాధన్ బ్యాటింగ్‌తో హడలెత్తించారు. థర్డ్ ఓవర్‌లో వెంకటేశ్ 4, 6, 6తో 20 రన్స్ దంచాడు. గుర్బాజ్ మూడు ఫోర్లతో టచ్‌లోకి రాగా, ఆరో ఓవర్‌లో వెంకటేశ్ వరుసగా 4, 4, 6, 4తో నటరాజ్‌కు చుక్కలు చూపెట్టాడు. 72/1తో పవర్‌ప్లేను ముగించిన కోల్‌కతా లక్ష్యాన్ని చేరడానికి కూడా పెద్దగా టైమ్ తీసుకోలేదు. తర్వాత రెండు ఫోర్లు, ఓ సిక్స్ కొట్టిన గుర్బాజ్‌ను 9వ ఓవర్‌లో షాబాజ్ (1/22) వెనక్కి పంపాడు. దీంతో రెండో వికెట్‌కు 91 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. వెంకటేశ్‌తో కలిసిన శ్రేయస్ (6 నాటౌట్) ఫోర్‌తో ఖాతా తెరిచాడు. 24 బాల్స్‌లో ఫిఫ్టీ క్టొటిన వెంకటేశ్ ఇచ్చిన క్యాచ్‌ను 11వ ఓవర్‌లో త్రిపాఠి డ్రాప్ చేసినా విజయానికి కావాల్సిన రన్స్‌ను శ్రేయస్ అందించాడు.
సంక్షిప్త స్కోర్లు
హైదరాబాద్: 18.3 ఓవర్లలో 113 ఆలౌట్ (కమిన్స్ 24, మార్‌క్రమ్ 20, రసెల్ 3/19). కోల్‌కతా: 10.3 ఓవర్లలో 114/2 (గుర్బాజ్ 39, వెంకటేశ్ 52*, కమిన్స్ 1/18).
రేటుకు న్యాయం చేసిండు
మిచెల్ స్టార్క్. ఈ సీజన్ ఆరంభానికి ముందే వార్తల్లో నిలిచాడు. కేకేఆర్ ఫ్రాంచైజీ లీగ్ చరిత్రలోనే అత్యధిక రేటుతో (రూ. 24.75 కోట్లు) అతడిని కొనుగోలు చేసింది. అందరి కండ్లూ తన మీదే ఉండగా.. ఈ సీజన్ సగం వరకూ స్టార్క్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. చాలా మ్యాచ్‌ల్లో ఓవర్‌కు పది రన్స్ ఇచ్చుకున్నాడు. కానీ, ప్లేఆఫ్స్‌లో మాత్రం అదరగొట్టి సన్ రైజర్స్ పాలిన విలన్ అయ్యాడు. క్వాలిఫయర్1లో 3 వికెట్లు పడగొట్టాడు. హిట్టర్ హెడ్‌ను డకౌట్ చేసిన తీరు సూపర్. ఫైనల్లోనూ అదే పెర్ఫామెన్స్ రిపీట్ చేస్తూ మరోసారి సన్ రైజర్స్ నడ్డి విరిచాడు. తొలి స్పెల్ 3 ఓవర్లలో రెండు వికెట్లు తీసి 14 రన్సే ఇచ్చిన అతను కీలకమైన అభిషేక్, త్రిపాఠి వికెట్లు తీసిన కేకేఆర్ విజయానికి బాటలు వేశాడు. క్వాలిఫయర్1, ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన స్టార్క్..ఆలస్యమైనా.. అసలైన సమయంలో అదరగొట్టి తన రేటుకు న్యాయం చేశాడు.
72/1 పవర్ ప్లేలో కేకేఆర్ స్కోరు . ఐపీఎల్ ఫైనల్ పవర్ ప్లేలో అత్యధికం. గతేడాది చెన్నైపై జీటీ 62/1 రన్స్ రికార్డు బ్రేక్ అయింది.
113 సన్ రైజర్స్ స్కోరు ఐపీఎల్ ఫైనల్లో అత్యల్పం. 2013లో ముంబైపై సీఎస్కే 125/9 స్కోరు చేసింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్లో ఓడటం ఇది రెండోసారి. 2016లో టైటిల్ నెగ్గిన ఆ టీమ్ 2018లో రన్నరప్‌గా నిలిచింది. ఎక్కువసార్లు రన్నరప్‌గా నిలిచిన మూడో జట్టు హైదరాబాద్.
సీఎస్కే ఐదుసార్లు, ఆర్‌సీబీ మూడుసార్లు ఫైనల్లో ఓడాయి.
ఐపీఎల్‌లో కోల్‌కతా ట్రోఫీ నెగ్గడం ఇది మూడోసారి. 2012, 2014లో చాంపియన్ అయిన కేకేఆర్ అత్యధిక టైటిళ్లతో రెండో ప్లేస్‌లో నిలిచింది. ముంబై, చెన్నై చెరో ఐదు టైటిళ్లతో టాప్‌లో ఉన్నాయి.
ఐపీఎల్ 2024 ప్రైజ్‌మనీ
విన్నర్ (కోల్‌కతా)
రూ. 20 కోట్లు
రన్నరప్ (హైదరాబాద్)
రూ. 12.5 కోట్లు
ఆరెంజ్ క్యాప్ : విరాట్ కోహ్లీ (ఆర్‌సీబీ) 741 రన్స్
పర్పుల్ క్యాప్ : హర్షల్ పటేల్ (పంజాబ్) 24 వికెట్లు
ఎమర్జింగ్ ప్లేయర్ : నితీష్ రెడ్డి (ఎస్‌ఆర్‌హెచ్)
మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ : సునీల్ నరైన్, కోల్‌కతా
అత్యధిక సిక్సర్లు: అభిషేక్ శర్మ, ఎస్‌ఆర్‌హెచ్
అత్యధిక ఫోర్లు: 64 ట్రావిస్ హెడ్, ఎస్‌ఆర్‌హెచ్
బెస్ట్ పిచ్, గ్రౌండ్ : ఉప్పల్ స్టేడియం, హైదరాబాద్
ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు