- సొంతగడ్డపై పంజాబ్‌కు హైదరాబాద్ చెక్
- రెండో ప్లేస్‌తో క్వాలిఫయర్-1కు ఎస్ఆర్హెచ్ అర్హత
- దంచికొట్టిన అభిషేక్, క్లాసెన్
మూడు సీజన్ల తర్వాత ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్ చేరుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై ఆఖరి లీగ్ మ్యాచ్‌లో అదరగొట్టింది. అభిషేక్ శర్మ (28 బాల్స్‌లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 66), హెన్రిచ్ క్లాసెన్ (26 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 42) మెరుపులతో ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించిన రైజర్స్ 17 పాయింట్లతో రెండో ప్లేస్‌తో క్వాలిఫయర్–1 పోరుకు అర్హత సాధించింది.
తొలుత పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 214/5 స్కోరు చేసింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (45 బాల్స్‌లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 71), శశాంక్ సింగ్ (24 బాల్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 49), అథర్వ తైడె (27 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 46) సత్తా చాటారు. ఛేజింగ్‌లో సన్ రైజర్స్ 19.1 ఓవర్లలోనే 215/6 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. అభిషేక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. కాగా, ఈ సీజన్‌లో సొంతగడ్డపై ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో సన్ రైజర్స్ ఐదింటిలో గెలిచింది. ఆర్‌సీబీ చేతిలో ఓడగా.. గుజరాత్‌తో మ్యాచ్ వర్షంతో రద్దయింది.
పంజాబ్ ఫటాఫట్
టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు వచ్చిన పంజాబ్ టాపార్డర్ బ్యాటర్లు దంచికొట్టడంతో భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు అథర్వ, ప్రభ్ సిమ్రన్ మొదటి వికెట్‌కు 97 రన్స్ జోడించి జట్టుకు బలమైన పునాది వేశారు. ఇన్నింగ్స్ ఐదో బాల్‌కు ఫోర్ కొట్టి బౌండ్రీల ఖాతా తెరిచిన ప్రభ్‌సిమ్రన్ స్టార్టింగ్ నుంచే దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. భువీ బౌలింగ్‌లోనే మరో రెండు ఫోర్లు రాబట్టాడు. అటువైపు నటరాజన్ వేసిన నాలుగో ఓవర్లో అథర్వ వరుసగా రెండు బౌండ్రీలు బాదగా, కమిన్స్ ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ 4, 6తో స్పీడు పెంచాడు. భువీ వేసిన ఆరో ఓవర్లో ప్రభ్ ఫోర్, అథర్వ సిక్స్ కొట్టడంతో పవర్ ప్లేను పంజాబ్ 61/0తో ముగించింది.
ఫీల్డింగ్ మారిన తర్వాత స్పిన్నర్ షాబాజ్‌కు అథర్వ 4, 6తో వెల్‌కం చెప్పాడు. విజయకాంత్ ఓవర్లో సిక్స్ బాదాడు. కానీ, పదో ఓవర్ తొలి బాల్‌కు అథర్వను ఔట్ చేసిన నట్టూ రైజర్స్‌కు బ్రేక్ ఇచ్చాడు. అయినా ప్రభ్‌సిమ్రన్ వెనక్కు తగ్గలేదు. 35 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రొసో (49) కూడా జోరు చూపెట్టాడు. నితీశ్ వేసిన 12వ ఓవర్లో రొసో 4,6 కొట్టగా.. ప్రభ్ సిక్స్ రాబట్టాడు.
వీళ్ల జోరుకు 14 ఓవర్లలోనే స్కోరు 150 దాటింది. 15వ ఓవర్లో క్లాసెన్ పట్టిన చురుకైన క్యాచ్‌కు ప్రభ్‌సిమ్రన్ పెవిలియన్ చేరాడు. నితీశ్ వేసిన తర్వాతి ఓవర్లో రొసో 6, 4 కొట్టగా... శశాంక్ సింగ్ (2) రనౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాతి మూడు ఓవర్లలో 21 రన్స్ ఇచ్చి రొసో, హిట్టర్ అషుతోశ్ (2)ను వెనక్కుపంపారు. కానీ, నితీశ్ వేసిన చివరి ఓవర్లో జితేశ్4, 6, 6తో స్కోరు 200 దాటించాడు.
రైజర్స్ ఈజీగా
ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటు క్లాసెన్ దంచికొట్టడంతో భారీ టార్గెట్‌ను సన్ రైజర్స్ ఈజీగా ఛేజ్ చేసింది. భీకర్ ఫామ్‌లో ఉన్న ట్రేవిస్ హెడ్ (0)ను ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే క్లీన్ బౌల్డ్ చేసిన అర్ష్‌దీప్ సింగ్ హోమ్ టీమ్‌కు షాకిచ్చాడు. కానీ, వన్ డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి (33)తో కలిసి అభిషేక్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. త్రిపాఠి ఉన్నంతసేపు భారీ షాట్లతో అలరించాడు. తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు కొట్టిన అతను.. రిషీ ధవన్ వేసిన రెండో ఓవర్లో 6 , 4, 4 బాదాడు. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, సిక్స్‌తో టచ్‌లోకి వచ్చిన అభిషేక్ తన మార్కు షాట్లతో అదరగొట్టాడు.
హర్షల్ వేసిన ఐదో ఓవర్లో 6, 4 కొట్టగా.. సిక్స్ బాదిన త్రిపాఠి ఆఖరి బాల్‌కు అర్ష్‌దీప్‌కు క్యాచ్ ఇచ్చాడు. రిషీ బౌలింగ్ లో మరో సిక్స్ కొట్టిన అభిషేక్ పవర్‌ప్లేను 84/2తో ముగించాడు. జోరుమీదున్న అతనికి నితీశ్ కుమార్ (37) తోడవడంతో స్కోరుబోర్డు దూసుకెళ్లింది. 21 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్న అభిషేక్.. హర్‌ప్రీత్ బౌలింగ్‌లో వరుసగా సిక్సర్లు కొట్టడంతో సగం ఓవర్లకే సన్ రైజర్స్ 129/2తో నిలిచింది.
తర్వాతి ఓవర్లోనే అభిషేక్‌ను శశాంక్ ఔట్ చేసినా.. నితీశ్ వెనక్కు తగ్గలేదు. స్పిన్నర్ రాహుల్ చహర్ వేసిన 12వ ఓవర్లో 6, 4తో అలరించిగా... హిట్టర్ క్లాసెన్ సిక్స్‌తో జోరందుకున్నాడు. హర్‌ప్రీత్ వేసిన తర్వాతి ఓవర్లో నితీశ్, క్లాసెన్ చెరో సిక్స్ రాబట్టి మ్యాచ్‌ను వన్‌సైడ్ చేశారు. ఈ దశలో పంజాబ్ బౌలర్లు పుంజుకునే ప్రయత్నం చేశారు. 14వ ఓవర్లో నితీశ్‌ను హర్షల్ ఔట్ చేశాడు.
15వ ఓవర్లో అర్ష్‌దీప్ ఆరు, 16వ ఓవర్లో హర్షల్ 7 రన్సే ఇచ్చారు. ఓ క్యాచ్ డ్రాప్ నుంచి తప్పించుకున్న షాబాజ్ (3) అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఔటైనా.. రాహుల్ చహర్ వేసిన 18వ ఓవర్లో సిక్స్‌తో సమద్ (11 నాటౌట్) స్కోరు 200 దాటించాడు. 19వ ఓవర్లో క్లాసెన్‌ను హర్‌ప్రీత్ బౌల్డ్ చేసినా.. చివరి ఓవర్ తొలి బాల్‌ను బౌండ్రీ చేర్చిన సన్వీర్ సింగ్ (6 నాటౌట్) మ్యాచ్ ముగించాడు.
సంక్షిప్త స్కోర్లు
పంజాబ్: 20 ఓవర్లలో 214/5 (ప్రభ్‌సిమ్రన్ 71, శశాంక్ 49, అథర్వ 46, నటరాజన్ 2/33). హైదరాబాద్: 19.1 ఓవర్లలో 215/6 (అభిషేక్ 66, క్లాసెన్ 42, అర్ష్‌దీప్ 2/37, హర్షల్ 2/49).