హైదరాబాద్, వెలుగు : రికార్డు స్కోర్లతో.. వరుస విజయాలతో దూసుకెళ్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మరోసారి పోటీకి సిద్ధమైంది. పది రోజుల కిందట బెంగళూరులో తమ రికార్డు స్కోరును బ్రేక్ చేస్తూ ఆర్‌సీబీని చిత్తు చేసిన రైజర్స్ గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో ఆ టీమ్‌తో తలపడనుంది. వరుసగా నాలుగు విజయాలతో జోరు మీదున్న కమిన్స్‌సేన అదే ఊపులో మరో విజయం సాధించాలని చూస్తోంది. ఫుల్ ఫామ్‌లో ఉన్న హిట్టర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ సొంతగడ్డపై దంచికొట్టేందుకు ఆత్రుతగా ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో గెలిస్తే మళ్లీ రెండో ప్లేస్‌కు చేరుకోవడంతో పాటు ప్లే ఆఫ్స్ బెర్తుకు రైజర్స్ చేరువ అవుతుంది. మరోవైపు ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడింటిలో ఓడి లాస్ట్ ప్లేస్‌లో ఉన్న ఆర్‌సీబీ ఉప్పల్‌లోనూ ఓడితే ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా వైదొలిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో రైజర్స్‌ను పడగొట్టి గెలుపు బాట పట్టాలని ఆర్‌సీబీ ఆశిస్తుండగా.. ఈ మ్యాచ్‌లో అందరి ఫోకస్ ఆ టీమ్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీపై ఉండనుంది. కోహ్లీని చూసేందుకు భాగ్యనగర అభిమానులు స్టేడియానికి పోటెత్తనున్నారు. దాంతో ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన క్షణాల్లోనే ఈ మ్యాచ్ టికెట్లన్నీ అమ్ముడయ్యాయి.
భారీ డిమాండ్, కోహ్లీ క్రేజ్ దృష్ట్యా కొంత మంది ఈ మ్యాచ్ టికెట్లను బ్లాక్ మార్కెట్‌లో పెట్టి ఐదారు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. రూ. 750 టికెట్ 5 వేలు.. రూ. 2500 టికెట్ పది వేలు పలుకుతోంది. విరాట్‌ను, అతని ఆటను నేరుగా చూడాలని ఆశిస్తున్న అభిమానులు భారీ మొత్తానికి బ్లాక్‌లో టికెట్లను కొనుగోలు చేస్తున్నారు. ఎక్స్ (ట్విటర్), సోషల్ మీడియాలో బ్లాక్ టికెట్ల దందా జరుగుతున్నా.. పోలీసులు, సన్ రైజర్స్ యాజమాన్యం, హెచ్‌సీఏ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.