- మూడో ట్రోఫీ వేటలో కేకేఆర్
- నేడే ఐపీఎల్ మెగా ఫైనల్
- రా. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో లైవ్
గత మూడు సీజన్లలో రెండుసార్లు ఆఖరి ప్లేస్‌లో నిలిచిన జట్టు సన్ రైజర్స్.. రెండేండ్లుగా ఏడో స్థానంతో తమ ఫ్యాన్స్‌ను ఏడిపించిన టీమ్ నైట్ రైడర్స్. ఈ రెండూ ఈసారి ప్లే ఆఫ్స్ చేరుతాయని కూడా చాలా మంది ఊహించలేదు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. సంచలనాలు సృష్టిస్తూ రైజర్స్, రైడర్స్ ఫైనల్‌కు దూసుకొచ్చాయి. కమిన్స్ కెప్టెన్సీలో సన్ రైజర్స్ కేక పుట్టించగా.. గౌతమ్ గంభీర్ గైడెన్స్‌లో నైట్ రైడర్స్ దుమ్మురేపింది. ఈ రెండు జట్లూ నేడు చెపాక్ స్టేడియంలో ఫైనల్ ఫైట్‌కు రెడీ అయ్యాయి. మరి, సన్ రైజర్స్ రెండోసారి విజేతగా నిలిచి డబుల్ ధమాకా మోగిస్తుందా.. కేకేఆర్ మూడో కప్పుతో తీన్ మార్ కొడుతుందా..? తేలేది నేడే!
చెన్నై : రెండు నెలలుగా క్రికెట్ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తున్న ఐపీఎల్–17లో అంతిమ విజేత ఎవ్వరో తేలే సమయం వచ్చింది. లీగ్ దశలో దుమ్మురేపి టాప్2లో నిలిచిన జట్ల మధ్యనే మెగా ఫైనల్‌కు వేళయింది. ఆదివారం చెపాక్ స్టేడియంలో జరిగే టైటిల్ ఫైట్‌లో సన్ రైజర్స్, నైట్ రైడర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. 2016లో టైటిల్ నెగ్గి, 2018లో రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్ ఆరేండ్ల తర్వాత ఫైనల్‌కు వచ్చింది. గంభీర్ కెప్టెన్సీలో 2012, 2014లో టైటిళ్లు నెగ్గి, 2021 రన్నరప్‌గా నిలిచిన కేకేఆర్ నాలుగోసారి ఫైనల్ చేరింది. పదేండ్ల తర్వాత మూడోసారి ట్రోఫీ అందుకోవాలని కేకేఆర్ పట్టుదలగా ఉంది. లీగ్ దశలో ఓసారి.. క్వాలిఫయర్–1లో మరోసారి రైజర్స్‌పై కేకేఆర్‌దే పైచేయి అయింది.
అయితే ఆ రెండు ఓటములకు తుదిపోరులోనే ప్రతీకారం తీర్చుకోవాలని హైదరాబాద్ కసిగా ఉంది. శుక్రవారం ఇదే వేదికపై జరిగిన క్వాలిఫయర్2లో రాజస్తాన్ ను చిత్తు చేసిన ఉత్సాహంలో ఉన్న రైజర్స్ అదే రిజల్ట్‌ను రిపీట్ చేసి ఎనిమిదేండ్ల తర్వాత రెండోసారి ఐపీఎల్ బాద్‌షా అవ్వాలని హైదరాబాద్ కోరుకుంటోంది. క్వాలిఫయర్2 నల్ల మట్టితో కూడిన పిచ్‌పై జరగ్గా.. ఫైనల్‌కు రెడీ చేసిన వికెట్‌పై ఎర్ర మట్టి కనిపిస్తోంది. ఇది బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. ఇక, చెన్నైలో శనివారం సాయంత్రం కొద్దిపాటి వర్షం కురవగా.. ఆదివారం పెద్దగా వర్ష సూచన లేదు. మ్యాచ్‌కు సోమవారం రిజర్వ్ డే ఉంది.
మిడిల్ మెరుగవ్వాలి
ఈ సీజన్‌లో భారీ స్కోర్లతో దుమ్మురేపిన సన్ రైజర్స్ బ్యాటర్లు ప్లే ఆఫ్స్ రెండు మ్యాచ్‌ల్లో ఆ స్థాయి చూపెట్టలేకపోయారు. ముఖ్యంగా భీకర ఫామ్‌లో ఉన్న అభిషేక్ రెండింటిలో నిరాశ పరిచాడు. ఫైనల్లో అతను ట్రావిస్ హెడ్‌తో కలిసి మెరుపు ఆరంభం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వరుసగా రెండు డకౌట్ల తర్వాత క్వాలిఫయర్2లో హెడ్ ఫర్వాలేదనిపించాడు. కానీ, కేకేఆర్‌పై ఆ పెర్ఫామెన్స్ సరిపోదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా.. ఛేజింగ్‌కు వచ్చినా ఓపెనర్లిద్దరూ దంచికొడితే ప్రత్యర్థిపై మానసికంగా పైచేయి సాధించొచ్చు. అయితే, చెపాక్ వికెట్ స్వభావం దృష్ట్యా తొలి బాల్ నుంచే సిక్సర్ల కోసం చూడకుండా పరిస్థితులకు తగ్గట్టు ఆడాల్సిన అవసరం ఉంది. గత పోరులో హెన్రిచ్ క్లాసెన్ ఫిఫ్టీతో సత్తా చాటగా..
రాహుల్ త్రిపాఠి అవసరానికి తగ్గట్టుగా గేర్లు మారుస్తూ ఆకట్టుకుంటున్నాడు. అయితే, మిడిలార్డర్‌లో మార్‌క్రమ్, నితీశ్ రెడ్డి బాధ్యతగా ఆడాలి. టాపార్డర్ తడబడితే కేకేఆర్ టాప్ క్లాస్ స్పిన్నర్లు నరైన్, చక్రవర్తిని ఎదుర్కొనే బాధ్యతను క్లాసెన్‌తో పాటు ఈ ఇద్దరూ తీసుకోవాల్సి ఉంటుంది. క్వాలిఫయర్1లో తేలిపోయిన తర్వాత గత పోరులో సన్ రైజర్స్ బౌలర్లు అద్భుత పెర్ఫామెన్స్ చేసి జట్టును ఫైనల్ చేర్చారు. ఇందులో క్రెడిట్ స్పిన్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్, పార్ట్ టైమ్ స్పిన్నర్ అభిషేక్ శర్మకే దక్కుతుంది.
తన మాస్టర్ మైండ్‌తో సన్ రైజర్స్‌ను పవర్ ఫుల్ టీమ్‌గా మార్చిన కెప్టెన్ కమిన్స్ ఫైనల్లోనూ ఈ ఇద్దరికే స్పిన్ బాధ్యతలు అప్పగిస్తాడా? మెయిన్ స్పిన్నర్‌గా శ్రీలంక లెగ్గీ విజయకాంత్‌ను ఆడిస్తాడా? అన్నది చూడాలి. పేసర్లలో నటరాజన్ గొప్పగా బౌలింగ్ చేస్తున్నాడు. అయితే, గత 3 మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయని భువనేశ్వర్ ఆఖరాటలో అయినా సత్తా చాటుతాడేమో చూడాలి.
ఖతర్నాక్ కేకేఆర్
టాప్ ప్లేస్‌తో లీగ్ దశను ముగించి, క్వాలిఫయర్–1లో సన్ రైజర్స్‌ను చిత్తు చేసి ముందుగానే ఫైనల్ చేరుకున్న కేకేఆర్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. సన్ రైజర్స్‌తో పోల్చితే ఆ జట్టులో ఎక్కువ మంది మ్యాచ్ విన్నర్లు ఉండటమే అందుకు కారణం. సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, రింకూ సింగ్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్, నితీశ్, హర్షిత్, చక్రవర్తి.. అంతా ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పే సత్తా ఉన్న వాళ్లే. మెంటార్ గౌతమ్ గంభీర్ రూపంలో అతి పెద్ద మాస్టర్ మైండ్ వీళ్ల వెనక ఉంది. నరైన్ అటు ఓపెనర్‌గా... ఇటు మెయిన్ స్పిన్నర్‌గా దుమ్మురేపుతున్నాడు.
ఫైనల్లోనూ తను కీలకం కానున్నాడు. ఫిల్ సాల్ట్ ప్లేస్‌లో నరైన్‌తో కలిసి ఓపెనింగ్‌కు వచ్చిన గుర్బాజ్ గత పోరులో ఆకట్టుకున్నాడు. అయ్యర్స్‌తో పాటు రసెల్, నితీష్ రాణా ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో కేకేఆర్ మరింత బలంగా ఉంది. లీగ్ దశలో తేలిపోయిన ఖరీదైన ప్లేయర్ మిచెల్ స్టార్క్.. కాలిఫయర్1లో ఎస్‌ఆర్‌హెచ్ నడ్డి విరిచాడు. అతనితో హైదరాబాద్‌కు మరోసారి ముప్పు ఉంది.
ఇండియన్ పేసర్లు వైభవ్ అరోరా, హర్షిత్ కూడా ఈ సీజన్‌లో సూపర్‌గా బౌలింగ్ చేస్తున్నారు. చెపాక్ వికెట్ స్పిన్నర్లు చక్రవర్తి(20 వికెట్లు), నరైన్ (16 వికెట్లు)కు సూట్ అవనుంది. వీళ్లను నిలువరించడంపైనే సన్ రైజర్స్ విజయావకాశాలు ఉంటాయి.
కేకేఆర్ 18.. రైజర్స్ 9
ఐపీఎల్‌లో ఇరు జట్లూ ఇప్పటి వరకు 27 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. హైదరాబాద్ తొమ్మిదింటిలోనే నెగ్గగా.. కేకేఆర్ 18 సార్లు గెలిచింది. చివరి ఐదు మ్యాచ్‌ల్లో నైట్ రైడర్స్ నాలుగుసార్లు నెగ్గగా.. సన్ రైజర్స్ ఒకేసారి ఆ టీమ్‌ను ఓడించింది. ప్లేఆఫ్స్‌లో నాలుగుసార్లు పోటీ పడగా చెరో రెండు సార్లు గెలిచాయి. ఇక, చెపాక్ స్టేడియంలో ఇదివరకు ఒకసారి పోటీ పడగా కేకేఆర్ నెగ్గింది.
చెపాక్ స్టేడియంలో ఫైనల్ జరగడం ఇది మూడోసారి. 2011 ఫైనల్లో ఆర్‌సీబీని ఓడించి సీఎస్కే విజేతగా నిలిచింది. 2012లో సీఎస్కేపై నెగ్గి కేకేఆర్ టైటిల్ గెలిచింది.
హైదరాబాద్, కోల్‌కతా కెప్టెన్లు కమిన్స్, శ్రేయస్ చెపాక్ స్టేడియం నుంచి ఆటోలో మెరీనా బీచ్‌కు వెళ్లి ఓ పడవపై ట్రోఫీతో ఫొటోలకు పోజిచ్చారు.