రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్యకు కుట్ర.. నిందితుల అరెస్ట్

రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయ్ పాల్ రెడ్డి హత్యకు కుట్ర పన్నిన నలుగురు నిందితులను సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 24వ తేదీ సోమవారం మాజీ సీఐ దాసరి భూమయ్యతోపాటు మరో ముగ్గురు సూపరి గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుండి ఒక పిస్తోల్, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ లోని గోపాలపురం పీఎస్  పరిధిలో ఓ లాడ్జిలో 20 లక్షల సూపరికి ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో నిందితులను పట్టుకున్నారు పోలీసులు.

ఈ మేరకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. "విజయ్ పాల్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని చంపడానికి మాజీ సిఐ దాసరి భూమయ్య ప్లాన్ చేశాడు. విజయ్ పాల్ రెడ్డి, దాసరి భూమయ్య కలిసి గతంలో అనేక రియల్ ఎస్టేట్ డీలింగ్స్ చేశారు. ఇద్దరు కలిసి హైదరాబాద్ సిటీ ఔట్ స్కట్స్ లో ల్యాండ్ డీలింగ్స్ చేశారు. అయితే డబ్బుకు ఆశపడిన  భూమయ్య.. మామిడి చంద్రయ్య, శంకర్, గడ్డం కుమార్ లను కాంటాక్ట్ చేసి... వారితో విజయ్ పాల్ రెడ్డి మర్డర్ చేయించాలని అనుకున్నాడు. శంకర్, కుమార్ లు మాజీ దళ సభ్యులు.. 20 లక్షల సుపారీకి ఒప్పుకొని 5 లక్షల అడ్వాన్స్ ఇచ్చాడు భూమయ్య.

ఈ క్రమంలో సుపారీ గ్యాంగ్ చైతన్య పురిలోని విజయ్ పాల్ ఇంటి దగ్గర రెక్కీ చేశారు. శ్రీలక్ష్మి లాడ్జ్ లో మర్డర్ ఎలా చేయాలని ప్లాన్ చేస్తుండగా.. సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఒక కంట్రీ మేడ్ పిస్టోల్, రెండు కత్తులు, లక్ష రూపాయల నగదు, ఆరు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నాము. 1992 లో RSI గా భూమయ్య రిక్రూట్ అయ్యాడు. 12 పోలీస్ స్టేషన్స్ లో ఎస్సై గా పని చేశాడు. 2012లో ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ వచ్చింది. గతంలో భూమయ్యపై ఏసీబీ రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. 80 ఎకరాల భూమి దాసరి భూమయ్యపై ఉన్నట్లు ఏసీబీ తెలిపింది" అని సీపీ తెలిపారు.