
- శంషాబాద్-విజయవాడ రూట్ లో సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్
- విజయవాడ- కర్నూలు రూట్లో కూడా
- సర్వేకు రైల్వేబోర్డు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ, వెలుగు : ఏపీ, తెలంగాణలో మరో కీలక ప్రాజెక్ట్‌కు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇరు రాష్ట్రాల అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసేం దుకు 2కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు ఆమోదం తెలి పింది. ఇందులో శంషాబాద్– విజయవాడ-లను కలుపుతూ ఒక రూట్, విజయవాడ–-కర్నూలును కూడా కలుపుతూ మరో రూట్ సర్వేకు అంగీకారం తెలిపింది. ఈమేరకు గురువారం దక్షిణ మధ్య రైల్వే కు రైల్వే బోర్డు లెటర్ రాసింది. ఈ 2రైల్వే లైన్ల నిర్మాణానికి అధికారులు సుమారు 942 కి.మీ సర్వే నిర్వహించనున్నారు.
ఈ సర్వేను 6 నెలల్లో పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. సర్వే రిపోర్ట్ ఆధారంగా ప్రాజెక్టుపై రైల్వే బోర్డు ముందుకు సాగనుంది. కాగా, ఈ రైల్వే లైన్లకు సంబంధించి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల విషయంలో తాను పలుమార్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసి లేఖలు సమర్పించినట్లు చెప్పారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కేంద్రం ఈ నిర్ణయాన్ని వెల్లడించడం సంతోషంగా ఉందన్నారు.
రాష్ట్రంలో వ్యాగన్ తయారీ & ఓవర్ హాలింగ్ కేంద్రాన్ని, ఎంఎంటీఎస్ (రెండో దశ), సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకీకరణ, చర్లపల్లి టర్మినల్ వంటి ప్రాజెక్టులను కేంద్ర సర్కారే చేపడుతున్నట్లు గుర్తుచేశారు.