బుధవారం(జనవరి 17) చిన్నస్వామి వేదికగా భారత్, అప్ఘానిస్థాన్ మధ్య జరిగిన ఆఖరి టీ20 చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠను తలపించిన విషయం తెలిసిందే. విజయం కోసం ఇరు జట్ల ఆటగాళ్లు సమాన స్థాయిలో పోరాడడంతో మ్యాచ్ ఫలితం కోసం రెండు సార్లు సూపర్ ఓవర్ నిర్వహించాల్సి వచ్చింది. మొదట ఇరు జట్ల స్కోర్లు(212) సమం కావడంతో మ్యాచ్ టై అయ్యింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించగా.. మళ్లీ అదే జరిగింది. సూపర్ ఓవర్‌లోనూ ఇరు జట్ల స్కోర్లు సమం(16) అయ్యాయి. దీంతో రెండోసారి సూపర్ ఓవర్ నిర్వహించగా.. టీమిండియా విజయం సాధించింది.
ఇక్కడే అందరి మదిలో ఓ ప్రశ్న తడుతోంది. ఒకవేళ డబుల్ సూపర్ ఓవర్ కూడా టై అయ్యుంటే ఏం జరిగేదన్న చర్చ జరుగుతోంది. అందుకు సమాధానమే ఈ కథనం.
బాల్ ఔట్ రూల్..
గతంలో అంతర్జాతీయ టీ20ల్లో మ్యాచ్ టై అయితే బౌల్ ఔట్ పద్దతి ద్వారా విజేతను తేల్చేవారు. ఈ పద్దతిలో ఒక్కో జట్టు నుంచి ఐదుగురు బౌలర్లు తమ బౌలింగ్ నైపుణ్యాలతో వికెట్లను పడగొట్టాల్సి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో బంతి మాత్రమే వేయాల్సి ఉంటుంది. బంతి వికెట్లను తాకి.. బెయిల్స్ కింద పడితే వాటిని లెక్కించి.. అత్యధిక సార్లు ఎవరైతే వికెట్లను పడగొట్టారో వారిని విజేతగా నిర్ణయించేవారు.
2007 టీ20 ప్రపంచకప్‍లో భారత జట్టు.. పాకిస్తాన్ పై ఇలానే విజయం సాధించింది. మొదట జట్ల స్కోర్లు కావడంతో బాల్ ఔట్ నిర్వహించగా టీమిండియా విజయం సాధించింది. ఇది జరిగిన అనంతరం 2008లో సూపర్ ఓవర్ రూల్ తీసుకొచ్చారు.
ఇంగ్లాండ్ తొండాటతో మారిన రూల్స్
2019 వన్డే ప్రపంచకప్ ముందు వరకు ఒకసారి మాత్రమే సూపర్ ఓవర్ నిర్వహించి.. విజేతను నిర్ణయించేవారు. ఒకవేళ సూపర్ ఓవర్ కూడా టై అయితే ఎక్కువ బౌండరీలు చేసిన జట్టును విజేతగా తేల్చేవారు. అంతకూ ఇరు జట్ల బౌండరీలు సమానమైతే.. సూపర్ ఓవర్‌లో చివరి బంతికి ఎక్కువ పరుగులు చేసిన జట్టును విజేతగా ప్రకటించేవారు. అయితే 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్ పోరులో ఇంగ్లండ్ జట్టు బౌండరీ కౌంట్ రూల్‌తో న్యూజిలాండ్‌పై విజయం సాధించడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ రూల్‌పై సమీక్ష జరిపిన ఐసీసీ కీలక మార్పులు చేసింది.
ఫలితం వచ్చేదాకా సూపర్ ఓవర్
మ్యాచ్ టై అయితే ఫలితం వచ్చేదాకా సూపర్ ఓవర్ ఆడించాలని ఐసీసీ నిర్ణయించింది. అంటే ఒకవేళ భారత్ - ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ డబుల్ సూపర్ ఓవర్ కూడా టై అయ్యుంటే మూడో సూపర్ ఓవర్ ఆడించేవారు. ఇలా ఫలితం తేలే వరకు సూపర్ ఓవర్స్ నిర్వహించేవారు. రెండుసార్లు సూపర్ ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే కాగా, ఐపీఎల్ 2020 సీజన్‌లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ డబుల్ సూపర్ ఓవర్‌కు దారితీసింది.