- 56 ఎకరాల్లో.. 30 అంతస్తులతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు
వరంగల్ రూరల్, వెలుగు: వరంగల్ సెంట్రల్ జైల్లోని 56 ఎకరాల 30 గుంటల స్థలంలో 30 అంతస్తుల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు చెప్పారు. ఈ నెల 21న సీఎం వరంగల్ పర్యటన నేపథ్యంలో చీఫ్‌విప్ దాస్యం వినయ్‍భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, లైబ్రరి చైర్మన్ అజీజ్‍ఖాన్‍తో కలిసి శనివారం హన్మకొండ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్‍లో ప్రెస్‍మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‍ను గతంలో కెనడా దేశంలోని 24 అంతస్తుల మాదిరి కట్టలనుకున్నా ఇప్పుడు దానిని పెంచినట్లు చెప్పారు. బయట కొంత ప్రచారం జరుగుతున్నట్లుగా భూములు ప్రైవేటువారికి ఎవ్వరికీ ఇవ్వడంలేదని స్పష్టం చేశారు. మామునూర్ ఫోర్త్ బెటాలియన్ వద్ద కొత్త సెంట్రల్ జైల్ నిర్మాణానికి ప్లేస్ నిర్ణయించామని..త్వరలోనే ఆ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
భూములు ఆక్రమించేటోళ్లే బీజేపీలోకి..
భూములు ఆక్రమించేటోళ్లే బీజేపీలో చేరుతున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. సీఎం కేసీఆర్ అభివృద్ధిలో వరంగల్ రూపురేఖలు మార్చేలా చేస్తుంటే.. కమలం పార్టీ లీడర్లు డెవలప్‍మెంట్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అందుకే సెంట్రల్ జైల్‍పై సింగ్ వంటి కొందరు వ్యక్తులతో కోర్ట్ కు వెళ్లినట్లు చెప్పారు. బీజేపోళ్లు పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడకుండా సైలెంట్‍గా ఉండాలన్నారు. గ్రేటర్ ఎలక్షన్లో చాలెంజ్ చాలెంజ్ అంటూ భద్రకాళి చెరువులో పడ్డారని ఎద్దేవా చేశారు. కరోనా టైంలో ఆక్సిజన్, రెమ్డిసివిర్ ఇంజక్షన్లు, వాక్సిన్ అందించడంలో కేంద్రం సహకరించలేదన్నారు. లారీలోళ్లు, రైస్‍మిల్లర్లు సహకరించకున్నా ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ పొజిషన్లో ఉందన్నారు.
సిటీలో.. సీఎం ఫోర్ అవర్స్ టూర్
వరంగల్ అర్బన్ జిల్లా పర్యనటలో భాగంగా సీఎం కేసీఆర్ సోమవారం ఉదయం వరంగల్ సెంట్రల్ జైల్ వద్దకు రానున్నట్లు మంత్రి తెలిపారు. 10.30 గంటలకు 30 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హస్పిటల్ నిర్మాణ పనులకు భూమిపూజలో పాల్గొంటారని పేర్కొన్నారు. 11 గంటలకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ కొత్త భవనాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. 11.45 గంటలకు అర్బన్ కలెక్టరేట్ ఓపెనింగ్చేస్తారని వివరించారు. అనంతరం కడియం శ్రీహరి నివాసంలో లంచ్ చేశాక.. మధ్యాహ్నం 2.30 గంటలకు ఇక్కడి నుంచి యాదాద్రి పర్యటనకు బయలుదేరి వెళతారన్నారు.
హన్మకొండ, వరంగల్ జిల్లాలకు ఎమ్మెల్యేలు ఓకే
వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల స్థానంలో.. వరంగల్, హన్మకొండ జిల్లాలు ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యేలు ఓకే చెప్పినట్లు ఎర్రబెల్లి స్పష్టం చేశారు. హన్మకొండ జిల్లా కావాలని దాస్యం వినయ్‍భాస్కర్, వరంగల్ జిల్లా కావాలని నన్నపునేని నరేందర్ కోరినట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనకు ఇతర ఎమ్మెల్యేలు, లీడర్లు సైతం ఒప్పుకున్నారని.. అపొజిషన్ పార్టీలు, జనాలు సైతం ముందస్తుగా తమ సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. దీనిపై సీఎం కేసీఆర్ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు.