‘సూపర్ స్పెషాలిటీ’ మరింత లేట్

పీఎంఎస్ఎస్వై బిల్డింగ్ లో కరోనా ట్రీట్ మెంట్ కు ఏర్పాట్లు
250 బెడ్లతో ప్రణాళికలు
ఎక్విప్మెంట్ ఫిట్ చేయక ఇబ్బందులు
ప్రత్యామ్నాయంగా ఎంజీఎంలోనే బెడ్ల పెంపు

‘పైసా ఖర్చు లేకుండా కరోనా ట్రీట్ మెంట్ అందించేందుకు ప్రభుత్వం రెడీగా ఉంది. ఇందుకు కేఎంసీలో ని పీఎంఎస్ఎస్ వై బిల్డింగ్లో మరో 250 బెడ్లు ఏర్పాటు చేసి కోవిడ్ –19 పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తాం. పది రోజుల్లోగా పనులన్నీ కంప్లీట్ చేసి హాస్పిటల్ను అందుబాటులోకి తీసుకొస్తాం’ జులై 28న హన్మకొండ సీఎస్ఆర్ గార్డెన్లో కోవిడ్ పై రివ్యూ మీటింగ్ లో హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పిన మాటలివి.

వరంగల్, వెలుగు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 12వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో పేషెంట్లకు ట్రీట్మెంట్ అందించడానికి ఎంజీఎంలో ఉన్నబెడ్లతో పాటు కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలో నిర్మించిన పీఎంఎస్ఎస్ వై (ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన) బిల్డింగ్ను కోవిడ్ హాస్పిటల్గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆక్సిజన్, వెంటిలేటర సదుపాయం, ఇతర ఎక్విప్మెంట్ ఫిట్చేయాలని లీడర్లు ఆఫీసర్లకు ఆదేశాలు కూడా ఇచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో హాస్పిటల్ను పది రోజుల్లోగా అందుబాటులోకి తీసుకొస్తామని హెల్త్మినిస్టర్ చెప్పారు. కానీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్ల్యంతో ఎక్విప్మెంట్ అంతా నిరుపయోగంగా పడి ఉంటోంది. వాటిని ఫిట్ చేసేవారు లేకపోవడంతో హాస్పిటల్ ప్రారంభానికి నోచుకోవడం లేదు. దీంతో ఎంజీఎంపైనే భారం పడుతోంది. అయితే పీఎంఎస్ఎస్ వై హాస్పిటల్లో ఎక్విప్మెంట్ ను అమర్చడానికి చొరవ తీసుకోవాల్సిన ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతోనే సమస్య ఎదురవుతోందనే ఆరోపణలున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా అల్టర్నేట్ గా ఎంజీఎంలోనే బెడ్ల సంఖ్యను పెంచాల్సిన పరిస్థితి.

మరో 250 బెడ్ల టార్గెట్
వివిధ రోగాలకు వేలకు వేలు ఖర్చు పెట్టి ప్రైవేట్లో ట్రీట్మెంట్ తీసుకోలేని పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందించడానికి కేఎంసీ ఆవరణలో ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద రూ.150 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టారు. ఇందులో కేంద్రం రూ.120 కోట్లు, రాష్ట్రం 30కోట్లు భరించాల్సి ఉంటుంది. అయితే కేంద్రం విడుదల చేసిన ఫండ్స్తో బిల్డింగ్ నిర్మాణం చేపట్టారు. ఎక్విప్మెంట్ కూడా తెచ్చి పెట్టారు. ఇదిలా ఉంటే కోవిడ్ –19 పేషెంట్లకు ఎంజీఎంలో 250 బెడ్లు కేటాయించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇక్కడ అన్నిరకాల డాక్టర్లు అందుబాటులో ఉంటారనే ఉద్దేశంతో ఉమ్మడి జిల్లా నుంచి పేషెంట్లు ఎంజీఎంకే తరలివస్తున్నారు. దీంతో బెడ్లు సరిపోని పరిస్థితి. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని కేఎంసీలో పీఎంఎస్ ఎస్ వై బిల్డింగ్ ను కోవిడ్ హాస్పిటల్గా మార్చి, 250 బెడ్లతో ట్రీట్మెంట్ అందించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ అందులో ఏర్పాట్లుపూర్తి కాకపోవడంతో.. ఎంజీఎంలో పేషెంట్లకు బెడ్లు సరిపోక చాలామందిని హోం ఐసోలేషన్లో ఉండమంటున్నారు.

కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. ఎంజీఎంపై భారం
ఇప్పటికే పీఎంఎస్ఎస్వై హాస్పిటల్ కు కోట్లు విలువ చేసే ఎక్విప్మెంట్ తెప్పించారు. ఆ ఎక్విప్ మెంట్ ను వివిధ కంపెనీల నుంచి కొనుగోలు చేశారు. అయితే వాటిని ఫిట్ చేయాలంటే ఆయా కంపెనీలకు చెందిన టెక్నీషియన్లు రావాల్సి ఉంది. కానీ కాంట్రాక్టర్లు ఈ విషయంలో దృష్టిపెట్టడం లేదు. పర్యవేక్షించాల్సిన ఆఫీసర్లు కూడా నిరక్ష్ల్యంగా వ్యవహరిస్తుండడంతో ఆ ఎక్విప్మెంట్ అంతా ఖాళీగా పడిఉంటోంది. అంతే గాకుండా ఎంజీఎంపై కరోనా పేషెంట్లతో భారం పెరుగుతోంది. కోవిడ్ కోసం ఏర్పాటు చేస్తున్న హాస్పిటల్ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ఎంజీఎంలోనే బెడ్లు పెంచుతున్నారు. ఇదివరకే ఉన్న250 బెడ్లకు తోడు ఫీమేల్ ఓల్డ్ సర్జికల్ వార్డులో 150 బెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే 90 బెడ్లు అందుబాటులోకి వచ్చాయి. మరో 60 వారం రోజుల్లో ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఎంజీఎంలో 360 బెడ్లు కరోనా ట్రీట్మెంట్కు సిద్ధం చేశారు. అయితే అక్కడ బెడ్లు సరిపోక పేషెంట్లు ఇబ్బందులు పడిన నేపథ్యంలో ఇప్పుడు కరోనా సోకితే ట్రీట్మెంట్ కోసం కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్స్
కు పరుగులు తీస్తున్నారు. దీంతో పైసా ఖర్చు లేకుండా కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ అందిస్తామన్న లీడర్ల హామీ కేవలం మాటలకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మరో నెల రోజులు?
పీఎంఎస్ఎస్వై హాస్పిటల్కు రాష్ట్రం తన వాటాగా చెల్లించాల్సిన దాంట్లో రూ.12కోట్లు జులై 30న రిలీజ్ చేసింది. వీటితో ఈ నెల 12లోగా హాస్పిటల్ను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్రావు పలుసార్లు చెప్పారు. కానీ అందుకు సంబంధించిన పనులు మాత్రం నత్తనడకనే సాగుతున్నాయి. హాస్పిటల్ ప్రారంభానికి ఇంకో నెలరోజులైనా పట్టే అవకాశం ఉంది. ఇదిలాఉంటే ఈ నెల 17న బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హాస్పిటల్ను సందర్శించిన టైంలో ఎంజీఎంలోనే బెడ్లు పెంచి, ఈ బిల్డింగ్ను మాత్రం నిరుపేదలకు సూపర్ స్పెషాలిటీ ట్రీట్ మెంట్ అందించేందుకే వినియోగించాలన్నారు. అలాకాకుండా కోవిడ్ హాస్పిటల్ గా మార్చితే కేంద్రం జోక్యం చేసుకుంటుందని చెప్పారు. దీంతో ఈ హాస్పిటల్ ప్రారంభం విషయంలో సందిగ్ధత ఏర్పడింది. ప్రతి రోజూ ఉమ్మడి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న నేపథ్యంలో మరిన్ని బెడ్లు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.

For More News..

రామప్ప బ్యాక్ వాటర్ తో కష్టాలు

పరిహారం ఇవ్వరు.. కొత్త ఇల్లు కట్టుకోనివ్వరు..

పేదలకు పైసా ఖర్చు లేకుండా ‘డబుల్‌‌‌‌’ ఇండ్లు