సూపర్‌స్టార్‌ కృష్ణ కన్నుమూత

సూపర్‌స్టార్‌ కృష్ణ కన్నుమూత

ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్‌ కృష్ణ (79) తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో కుటుంబసభ్యులతో పాటు అభిమానులు, తెలుగు సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది.

ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్‌ కృష్ణ (79) కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్టుకు గురైన కృష్ణను కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానులు, తెలుగు సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. 

అసలు పేరు ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి

1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు కృష్ణ జన్మించారు. ఐదుగురు సంతానంలో ఈయనే పెద్దవారు. కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి.

అక్కినేనిని చూసి..

చిన్నప్పటి నుంచి ఆయనకు సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండేది. అయితే ఆయన తల్లిదండ్రులు మాత్రం కృష్ణను ఇంజినీర్‌ చేయాలనుకున్నారు. కానీ, సీటు దొరక్కపోవడంతో డిగ్రీలో చేరారు. అక్కడ చదువుతున్నప్పుడు ఏలూరులో ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా సన్మానం జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన కృష్ణకు సినిమాలపై ఇష్టం మరింత పెరిగి ఈ రంగంవైపు వచ్చేశారు.

1965లో వివాహం

1965లో ఇందిరను కృష్ణ వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు సంతానం. రమేశ్‌బాబు, మహేశ్‌బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల. ఆ తర్వాత సినీ నటి, దర్శకురాలు విజయనిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు.