సూపర్ స్టార్ కృష్ణ ముఖ్య పాత్రలో నటించిన చివరి చిత్రం ‘ప్రేమ చరిత్ర కృష్ణ విజయం’. హెచ్ మధుసూదన్ దర్శకత్వం వహించడంతోపాటు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. చిత్రంలో యశ్వంత్, సుహాసిని జంటగా నటించగా, నాగబాబు, ఆలీ ముఖ్యపాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ పలు అనుకోని కారణాలవల్ల రిలీజ్ కాలేదు. దీంతో కొన్నేళ్ల తర్వాత మేకర్స్ ఈ చిత్రాన్ని జనవరి 3న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు కృష్ణ పర్సనల్ మేకప్‌మేన్ మాధవరావు, నిర్మాతలు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, రత్నమయ్య హాజరై ఈ చిత్రం కృష్ణ గారికోసమైనా చూడాలని కోరారు. దర్శకనిర్మాత మధుసూదన్ మాట్లాడుతూ ‘కృష్ణ గారితో సినిమా రూపొందించడం నా అదృష్టం. ఆయన నటించిన ఆఖరి చిత్రం విడుదల కాని చిత్రాల జాబితాలో ఉండకూడదనే పట్టుదలతో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’ అని చెప్పారు. ఎంఎం శ్రీలేఖ ఈ చిత్రానికి సంగీతం అందించారు.