
ఫూల్ మఖానా.. ఈ పేరు వినే ఉంటారు. వీటినే తామర గింజలు అంటారు. చూడ్డానికి ఒకరకం పాప్కార్న్లా కనిపిస్తాయి. తింటే మరమరాలు గుర్తొస్తాయి. అయితే వీటిని చాలామంది చాలా రకాలుగా చేసుకుని తింటుంటారు. పోషకాలు నిండుగా ఉన్న ఈ మఖానా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాబట్టి కొందరు వాటిని ఏదో విధంగా ఫుడ్లో భాగం చేసుకోవాలి అనుకుంటుంటారు. కానీ, వాటిని ఎలా తినాలో .. ఎలా వండుకోవాలో చాలా మందికి తెలియదు. ఇప్పడు ఫూల్ మఖానా ( తామర గింజలతో) మఖానా గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
మఖానా గ్రేవీ కర్రీ తయారీకికావాల్సినవి
- జీడిపప్పు – ఒక కప్పు
- ఫూల్ మఖానా – అర కప్పు
- ఉల్లిగడ్డ – ఒకటి
- టొమాటోలు – రెండు
- యాలకులు – నాలుగు
- ఉప్పు, నీళ్లు, నూనె – సరిపడా
- ఫ్రెష్ క్రీమ్ – మూడు టేబుల్ స్పూన్లు
- వెన్న – రెండు టేబుల్ స్పూన్లు
- కొత్తిమీర – కొంచెం
- బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, నల్ల యాలక – ఒక్కోటి
- కారం, కశ్మీరీ కారం, ధనియాల పొడి – ఒక్కో టీస్పూన్
- జీలకర్ర, పసుపు, గరం మసాలా– ఒక్కోటి అర టీస్పూన్
- జీలకర్ర పొడి, మిరియాల పొడి – ఒక్కోటి అర టీస్పూన్
- వెల్లుల్లి, పచ్చిమిర్చి, కసూరీ మేథి – ఒక్కో టేబుల్ స్పూన్
తయారీవిధానం :ఒక గిన్నెలో నీళ్లు మరిగించి.. అందులో ఉల్లిగడ్డ, సగం కప్పు జీడిపప్పు తరుగు వేసి మూతపెట్టి ఉడికించాలి. తర్వాత వాటిని వడకట్టి, మిక్సీపట్టి పేస్ట్ చేయాలి. టొమాటో ముక్కలు గ్రైండ్ చేసి పేస్ట్ చేయాలి.
పాన్లో నూనె వేడి చేసి మిగిలిన జీడిపప్పులు, మఖానా విడివిడిగా వేగించాలి. అదే పాన్లో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు, నల్ల యాలక, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ తరుగు ఒక్కోటిగా వేసి వేగించాలి. అవి వేగాక పసుపు, కారం, ధనియాలపొడి, కశ్మీరీ కారం, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి కొన్ని నీళ్లు పోసి కలపాలి. ఆ తర్వాత మఖానా పేస్ట్, టొమాటో పేస్ట్, ఉప్పు వేసి కలపాలి. మూతపెట్టి కాసేపు ఉడికించాలి.
మిశ్రమం దగ్గరపడ్డాక అందులో జీడిపప్పులు వేసి కలిపి మూతపెట్టి మరికాసేపు ఉడికించాలి. ఆ మిశ్రమంలో పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, వెన్న వేసి కలపాలి. కొత్తిమీర, కసూరీ మేథి కూడా వేయాలి. ఈ గ్రేవీ కర్రీ చపాతీ, అన్నంలో తినడానికి పర్ఫెక్ట్ కాంబినేషన్.
-వెలుగు,లైఫ్