Telangana Kitchen : టేస్టీగా క్యాబేజీ.. కారంగా కీరదోస.. స్పైసీగా కాలీఫ్లవర్ పచ్చళ్లు ఇంట్లోనే ఇలా తయారీ..!

Telangana Kitchen : టేస్టీగా క్యాబేజీ.. కారంగా కీరదోస.. స్పైసీగా కాలీఫ్లవర్ పచ్చళ్లు ఇంట్లోనే ఇలా తయారీ..!

పచ్చడి అనగానే.. రోటి లేదా నిల్వ పచ్చళ్లు నోరూరిస్తూ కళ్ల ముందు మెదుల్తయ్ కదా! రెగ్యులర్ గా  చేసుకునే పచ్చళ్లు కాకుండా కీరదోసకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్ లతో వారం, పది రోజులు నిల్వ ఉండే పచ్చళ్లు చేసుకోవచ్చు. రుచిగా, వెరైటీగా ఉండే ఆ పచ్చళ్లను ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం. . .

క్యాబేజీ పచ్చడి తయారీకి కావలసినవి

  • క్యాబేజీ తరుగు: ఒకటిన్నర కప్పు
  • ఆవాలు: ఒక టీ స్పూన్
  • కారం: రెండు టేబుల్ స్పూన్లు
  • మెంతులు: పావు టీ స్పూన్
  • పసుపు: చిటికెడు
  • ఆవాలు, మెంతుల పొడి : ఒక టేబుల్ స్పూన్
  • చింతపండు గుజ్జు: ఒక టేబుల్ స్పూన్
  • ఉప్పు: తగినంత
  • నూనె: సరిపడా
  • శెనగపప్పు: ఒక టేబుల్ స్పూన్
  • వెల్లుల్లి తరుగు: అర టీ స్పూన్
  • ఇంగువ: చిటికెడు
  • ఎండుమిర్చి: రెండు

తయారీ విధానం:  ఒక గిన్నెలో క్యాబేజీ తరుగు వేయాలి. అందులో ఆవాలు-మెంతుల పొడి (వేగించాక పొడి చేయాలి), కారం, ఉప్పు, పసుపు, చింతపండు గుజ్జు వేసి కలపాలి. తర్వాత స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. అందులో ఆవాలు, మెంతులు, శెనగపప్పు, ఎండుమిరి వేసి వేగించాక వెల్లుల్లి తరుగు, ఇంగువ వేసి స్టవ్ ఆపేయాలి. పోపు పూర్తిగా చల్లారాక ... క్యాబేజీ మిశ్రమంలో కలపాలి. ఈ పచ్చడి వారం రోజులపాటు తాజాగా ఉంటుంది. ఫ్రిజ్ లో పెడితే పదిహేను రోజుల వరకు తినొచ్చు.

కీరదోస పచ్చడి తయారీకి కావలసినవి:

  • కీర దోస : ఒకటి
  • ఉప్పు: పావు కప్పు
  • కారం: అర కప్పు
  • ఆవ పొడి: అర కప్పు
  • మెంతి పొడి: అర టేబుల్ స్పూన్
  • పసుపు: ఒక టీ స్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు: తొమ్మిది
  • నువ్వుల నూనె: అర కప్పు

తయారీ విధానం: కీర దోసకాయను చెక్కు తీయకుండానే ముక్కలు తరగాలి. చెక్కు తీస్తే ముక్క త్వరగా మెత్తబడుతుంది. ఆ ముక్కలను ఒక పెద్ద గిన్నెలో వేయాలి. అందులో ఉప్పు, కారం, ఆవ పొడి, మెంతి పొడి, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, గోరువెచ్చని నువ్వుల నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు రోజులపాటు ఊరబెట్టాలి. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే, రుచి అదిరిపోతుంది. నాలుగైదు రోజులు నిల్వ ఉంటుంది.


కాలీఫ్లవర్ పచ్చడి తయారీ కి కావాల్సినవి

  • కాలీఫ్లవర్ ముక్కలు: ఒక కప్పు
  • ఉప్పు: తగినంత
  • కారం: రెండు టేబుల్ స్పూన్లు
  • మెంతుల పొడి: ఒక టీ స్పూన్
  • నిమ్మరసం: అర కప్పు
  • నూనె: మూడు టేబుల్ స్పూన్లు
  • ఆవాలు: అరటీస్పూన్
  • జీలకర్ర: పావు టీ స్పూన్
  • శెనగపప్పు: అర టీస్పూన్
  • ఎండుమిర్చి: నాలుగు

తయారీ విధానం: ఒక పెద్ద గిన్నెలో కాలీఫ్లవర్ ముక్కలు, ఉప్పు, కారం, మెంతి పొడి, నిమ్మరసం వేసి కలపాలి. తర్వాత స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. అందులో జీలకర్ర, ఆవాలు, శెనగపప్పు, ఎండుమిర్చి వేసి వేగించాలి. పోపును కాలీఫ్లవర్ ముక్కల్లో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో నిల్వ చేయాలి. రెండు రోజులకు ముక్కలు ఊరతాయి. ఈ పచ్చడిని వేడి అన్నంలో కలుపుకున్నా, పెరుగన్నంలో నంజుకు తిన్నా చాలా బాగుంటుంది. వారం రోజుల వరకు పచ్చడి తాజాగా ఉంటుంది.

-వెలుగు... లైఫ్-