ఎంజీఎం ఆస్పత్రి ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఫేక్ వీడియోలు

ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పాములు, ఎలుకల కలకలంతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఆస్పత్రి ప్రక్షాళనకు సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ చర్యలు చేపట్టారు. ఇంజినీరింగ్ విభాగం, RMOలు, శానిటేషన్ సిబ్బందితో అత్యవసర సమావేశం నిర్వహించారు. తర్వాత ఆస్పత్రి సిబ్బందిని వెంటబెట్టుకొని 39 బ్లాక్ లను పరిశీలించారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఎంజీఎంను అప్రతిష్టలపాలు చేసేందుకు ఫేక్ వీడియోలు వైరల్ చేస్తున్నారని  సూపరింటెండెంట్ అనుమానాలు వ్యక్తం చేశారు. వైరల్ అవుతున్న వీడియోలు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి అసలు నిజాలు తేల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని సూపరింటెండెంట్ చంద్రశేఖర్ చెప్పారు. 

గడిచిన రెండు వారాల్లో ఏకంగా మూడు సార్లు నాగుపాములు రావడం, వార్డుల్లో పేషెంట్లు పడుకున్న బెడ్ల కిందే ప్రత్యక్షమవుతుండడంతో పేషెంట్లు, వారి బంధువులు వణికిపోతున్నారు. ఇప్పటికే ఎలుకలు కొరికి ఓ పేషెంట్‍ ప్రాణాలు కోల్పోగా కొత్తగా పాముల వల్ల ఎవరి ప్రాణాలకు ముప్పు వస్తుందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఎంజీఎంలో ఎప్పట్లాగే ఎలుకలు తిరుగుతుండగా, వాటి కోసం ఇప్పుడు పాములు వస్తున్నాయి. రెండు వారాల్లో మూడు సార్లు నాగుపాములు  హాస్పిటల్‍ వార్డుల్లోకి వచ్చాయి. అక్టోబర్ 2న హాస్పిటల్ ఆవరణలో జనాలతో రద్దీగా ఉండే గాంధీ విగ్రహం వద్ద ఓ నాగుపాము కనిపించడంతో సెక్యూరిటీ దానిని చంపేశారు. 11 రోజుల క్రితం ఫీవర్‍ వార్డులోని బాత్రూంలోకి నాగుపాము వచ్చింది. ఆదివారం ఏకంగా న్యూరో మెడికల్‍ వార్డులోని మంచాల వద్ద ఓ నాగుపాము ప్రత్యక్షమైంది. దీంతో ఒక్కసారిగా పేషెంట్లు, వారి అటెండెంట్లు పరుగులు పెట్టారు. అక్కడున్న సిబ్బంది పామును చంపేశారు. రెండు వారాల్లో ఏకంగా మూడు నాగుపాములు రావడంతో అవి ఎక్కడి నుంచి వస్తున్నాయనే ప్రశ్న మొదలైంది. ఆసుపత్రి పరిసరాలు చిత్తడిగా ఉండడంతో అక్కడ తావు పెట్టి, ఎలుకల కోసం వార్డుల్లోకి వస్తాయని భావిస్తున్నారు. ఆదివారం అటెండెంట్లు గమనించకపోతే బెడ్​పై ఉన్న పేషెంట్​ను కరిచేదని అంటున్నారు. అప్పట్లో ఎలుక కరిచిన ఘటన తర్వాత ఎలుకలను పట్టేందుకు వారం పాటు హడావిడి చేసిన ఆఫీసర్లు, ఇప్పుడు ఎలుకలను, వాటి కోసం వచ్చే పాములను కూడా వేటాడాల్సిన పరిస్థితి వచ్చింది.

గతంలో ఎంజీఎంలోని ఆర్ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న శ్రీనివాసచారి అనే పేషెంట్‍ ఎలుకల దాడిలో చనిపోయాడు. తీవ్ర అనారోగ్యానికి తోడు ఎలుకలు కొరకడంతో రాత్రంతా రక్తం పోయింది. దీంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‍ తరలించినా ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రభుత్వం ఎలుకల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పింది. ఈ ఏడాది సెప్టెంబర్ 6న ఇదే తరహాలో పేషెంట్ల బెడ్ల వద్ద ఎలుకలు తిరుగుతుండడంతో బాధితులను చూసేందుకు వచ్చినవారు వీడియో తీసి సోషల్‍ మీడియాలో పెట్టారు.