పోస్ట్​మన్ ​ఇంట్లో లెటర్ల గుట్టలు ! .. సస్పెండ్​ చేసిన ఉన్నతాధికారి 

నిజామాబాద్​ పోస్టాఫీస్​లో 6 నెలల నుంచి బట్వాడ చేయట్లే..  
ఓటర్, పాన్, ఆధార్​కార్డులు,చెక్​బుక్​లు, డ్రైవింగ్​ లైసెన్స్​లు మరెన్నో డాక్యుమెంట్స్​..

నిజామాబాద్, వెలుగు :  నిజామాబాద్ ​సిటీలోని సుభాష్​నగర్ ​సబ్ ​పోస్టాఫీస్​కు వచ్చిన పోస్టల్ ​కవర్లు, లెటర్లను ఆరునెలల నుంచి బట్వాడా చేయకుండా పోస్ట్​మన్​ తన ఇంట్లోని ప్లాస్టిక్ ​సంచుల్లో కుక్కిపెట్టాడు. లెటర్లు రావడం లేదని వచ్చిన ఫిర్యాదుతో అసిస్టెంట్ ​పోస్టల్ ​సూపరింటెండెంట్​(ఏఎస్పీ) విచారణ చేపట్టగా బట్వాడా చేయని 6 వేల కవర్లు, లెటర్లు పోస్ట్​మన్​ ఇంట్లో కనిపించాయి. వీటిని సబ్ ​పోస్ట్​ఆఫీస్​కు తరలించి పోస్ట్​మన్​ను సస్పెండ్ ​చేశారు.

కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారికి ఓటర్​ఐడీ కార్డులు వారిచ్చిన అడ్రస్​కు పోస్టు ద్వారా వస్తాయి. అలాగే ఆధార్, పాన్, డ్రైవింగ్​ లైసెన్స్, బ్యాంక్​ చెక్​బుక్​లు పోస్టల్​శాఖ ద్వారానే అందుతాయి. సుభాష్​నగర్​ సబ్​పోస్ట్ ఆఫీస్​పరిధిలో నెలల తరబడి వీటిని అందుకోని జనాలు పోస్ట్​మాన్​ కార్తీక్​ను ప్రశ్నించారు. దీంతో అతడు తన వద్దకు ఏం రాలేదని, వస్తే ఇస్తాను కదా అని చెప్పి దాటవేశాడు. అతడి తీరుపై అనుమానం వచ్చిన కొంతమంది అసిస్టెంట్ ​పోస్టల్ ​సూపరింటెండెంట్​ రాజ నర్సాగౌడ్​కు కంప్లయింట్​ చేశారు.

దీంతో ఆయన సోమవారం సబ్ పోస్ట్ ​ఆఫీస్​కు వచ్చారు.  అక్కడ విచారణ జరిపాక పోస్ట్​మన్​పై అనుమానంతో కార్తీక్ ఇంటికి వెళ్లి అతడిని ప్రశ్నించాడు. సరైన సమాధానం చెప్పకపోవడంతో మూలనపడి ఉన్న బ్యాగులు తెరిచి చూశారు. అందులో వేలాదిగా ఆధార్​ కార్డులు, పాన్​ కార్డులు, ఓటర్​ఐడీ కార్డులు, చెక్​బుక్​లు, ఈ ఛలాన్లు కనిపించాయి. వాటిని సబ్​పోస్ట్​ ఆఫీస్​కు తరలించారు. పోస్ట్​మన్​ను సస్పెండ్​ చేశౄమని, బట్వాడా కోసం మంగళవారం నుంచి స్పెషల్​ డ్రైవ్​ చేపడతామని రాజనర్సాగౌడ్​ తెలిపారు.