అరెస్ట్​ చేసుడు పోలీసుల ఇష్టమేనా?

అరెస్ట్​ చేసుడు పోలీసుల ఇష్టమేనా?

కేసుల దర్యాప్తులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు తెలంగాణ హైకోర్టు నలుగురు పోలీస్​అధికారులకు ఇటీవల 4 వారాల జైలు శిక్ష, రూ.2 వేల ఫైన్ ​విధించింది. ఆ నలుగురు పోలీసుల్లో ఓ ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. కోర్టు ధిక్కరణ కేసుల్లో చాలా కాలంగా హైకోర్టు ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల కోర్టు ధిక్కరణ కేసులంటే ఉన్నతాధికారులకు భయం లేకుండా పోయింది. ఎన్నో కేసులను ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. మచ్చుకు -పోలీస్ కంప్లైంట్ అథారిటీల ఏర్పాటు విషయమే తీసుకుంటే.. అథారిటీలను ఏర్పాటు చేయాలని గతంలో హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏర్పాటు చేయకపోవడంతో హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసుల తరువాత శిక్షను తప్పించుకోవడం కోసం ప్రభుత్వం అథారిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు జీవోలు ఇచ్చింది. అవి వచ్చి నెలలు గడిచినా.. వాటి ఏర్పాటే జరగలేదు. ఏర్పాటవుతాయన్న నమ్మకం కూడా లేదు. 

ఆర్నేశ్​ కుమార్​ వర్సెస్ ​బిహార్​ కేసులో

2014లో ఆర్నేశ్ కుమార్ వర్సెస్​ బిహార్​ కేసులో సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ఉల్లంఘనల గురించి కోర్టు ధిక్కరణ కేసులు దాఖలు చేసే వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. తాజా హైకోర్టు కోర్టు ధిక్కరణ ఉత్తర్వుల వల్ల పోలీసుల్లో మార్పు వస్తే మంచిదే. అలా రానప్పుడు కోర్టుల జోక్యం అవసరం. ఈ మార్గదర్శకాల అమలు విషయంలో మేజిస్ట్రేట్ లు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బిహార్ లో ఓ మహిళ తన అత్త  కట్నం కోసం వేధిస్తోందని కేసు పెట్టింది. అత్తకి మద్దతుగా భర్త కూడా కట్నం డిమాండ్ చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని  సెక్షన్​498 ఏ,  వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం కేసు నమోదు చేశారు. అతను ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా దొరకకపోవడంతో సుప్రీంకోర్టులో స్పెషల్ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. అప్లికేషన్​ను విచారించిన సుప్రీం అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఇదే సందర్భంలో సెక్షన్ 498 దుర్వినియోగం అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. సీఆర్ పీసీ 41లో ఉన్న అధికారాలను పోలీసులు ఏకపక్షంగా వినియోగిస్తున్నారని పేర్కొంది. 

సుప్రీంకోర్టు అభిప్రాయం 

‘‘పోలీసులపై వలసవాద ముద్ర తొలగిపోవడం లేదు. వేధింపులను, అణచివేతలను వారు ఓ సాధనంగా ఇంకా ఉపయోగిస్తున్నారు. అరెస్టు చేసే అధికారాన్ని వినియోగించడంలో పోలీసుల అహంకార ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. పోలీసుల అవినీతికి అరెస్ట్ అనేది లాభదాయకమైన వనరుగా మారిపోయింది. పోలీసుల అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయకపోవడం మేజిస్ట్రేట్ ల వైఫల్యం. నిందితుడిని ముందుగా అరెస్టు చేసి ఆ తర్వాత మిగతా విషయాలను పరిశీలించడం సరికాదు. అరెస్ట్ సమయంలో సెక్షన్​41 నిబంధనలను సరిగ్గా పాటిస్తే  ముందస్తు బెయిల్ కోసం వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. యాంత్రికంగా రిమాండ్ చేయడం మేజిస్ట్రేట్ లకు తగని పని. అరెస్ట్ అధికారాన్ని వాడే సమయంలో వ్యక్తిగత స్వేచ్ఛ, సామాజిక క్రమం మధ్య సమతుల్యతను పాటించాలి. అరెస్టు వల్ల ఆ వ్యక్తి అవమానానికి గురవుతాడు. స్వేచ్ఛను కోల్పోతాడు. అతనిపై పడిన అరెస్టు మచ్చ జీవితాంతం కొనసాగుతుంది. ప్రత్యేకమైన కారణాలు ఉంటే తప్ప అరెస్ట్ అధికారాన్ని ఉపయోగించకూడదు. కొంత దర్యాప్తు చేసిన తర్వాత ఆ వ్యక్తి మీద వచ్చిన ఆరోపణల్లో సత్యం ఉందని పోలీస్ అధికారి సంతృప్తి చెందినప్పుడు అరెస్టు చేయవచ్చు. అయితే ఆ నేరం కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ అయినంత మాత్రాన అరెస్టు చేయడం చట్టబద్ధం కాదు.

అరెస్టు చేసే అధికారం ఉండటం ఒక ఎత్తయితే, దానికి న్యాయబద్ధత ఉండటం మరొక ఎత్తు. ఆరోపణలు రాగానే వ్యక్తులను అరెస్టు చేయకూడదు. అరెస్టు చేయడానికి ముందు పోలీస్ అధికారి తనని తాను ప్రశ్నించుకోవాలి. అరెస్టు ఎందుకు చేయాలి? నిజంగా అవసరమా ? ఏ ప్రయోజనం కోసం అది ఉపయోగపడుతుంది ? ఏ ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది ? ఈ ప్రశ్నలు వేసుకొని వాటికి జవాబులు దొరికిన తర్వాత ఒకటి రెండు కారణాలు సంతృప్తికరంగా అనిపిస్తే అరెస్టు అధికారాన్ని ఉపయోగించాలి. ఏడేండ్ల కన్నా తక్కువ శిక్ష విధించే అవకాశం ఉన్న నేరాల్లో లేదా ఏడేండ్ల వరకు శిక్ష విధించే అవకాశం ఉన్న నేరాల్లో పోలీసులకు సంతృప్తి కలిగినప్పుడు కూడా అరెస్టు చేసే అధికారం లేదు. ఆ వ్యక్తి తిరిగి నేరం చేయకుండా నిరోధించడానికి, అరెస్టు తప్పనిసరని పోలీస్ అధికారి సంతృప్తి చెందినప్పుడు, కేసును సరైన దిశలో దర్యాప్తు చేయడానికి, సాక్ష్యాన్ని ఆ వ్యక్తి అదృశ్యం, తారుమారు చేయకుండా ఉండటానికి, ఇతర  నేరాలు చేయకుండా ఉండటానికి అరెస్టు చేయవచ్చు. ఆ వ్యక్తిని అరెస్టు చేయకుండా భవిష్యత్తులో కోర్టు ముందు హాజరు పరచలేమని భావించినప్పుడు కూడా అరెస్టు చేయవచ్చు. అయితే ఈ కారణాలని పోలీస్ అధికారి రాతపూర్వకంగా నమోదు చేయాల్సి ఉంటుంది” అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

మేజిస్ట్రేట్ న్యాయపరమైన పరిశీలనలు

‘‘ఒక వ్యక్తిని నిర్బంధించడం సత్యనిష్టమైన పని. దేశపౌరుల స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను ఇది ప్రభావితం చేస్తుంది. అందుకని ఈ అధికారాన్ని మేజిస్ట్రేట్ చాలా జాగ్రత్తగా వినియోగించాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో నిర్బంధ ఉత్తర్వులను మేజిస్ట్రేట్స్ రొటీన్ పద్ధతుల్లో జారీ చేస్తున్నారు. సెక్షన్167 ప్రకారం రిమాండ్ చేసేముందు ఆ అరెస్టు చట్టబద్ధమైనదని, చట్టానికి లోబడి ఉందని, ఆ వ్యక్తి రాజ్యాంగ హక్కులను సంతృప్తి పరిచాయని మేజిస్ట్రేట్ సంతృప్తి చెందాలి. సెక్షన్​41లో పేర్కొన్న ఆవశ్యకతలను సంతృప్తి పరచలేదని మేజిస్ట్రేట్ భావించినప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తిని రిమాండ్ చేయకూడదు. తక్షణం అతడిని విడుదల చేయాల్సిన బాధ్యత మేజిస్ట్రేట్ మీద ఉంటుంది. పోలీస్ అధికారి చెప్పిన విషయాలను గుడ్డిగా విశ్వసించ కూడదు. నిందితుడిని అరెస్టు చేసి తన ముందు హాజరుపరిచినప్పుడు అరెస్ట్ కు సంబంధించిన ప్రత్యేకమైన కారణాలను పోలీసులు నమోదు చేశారా?, ప్రాథమిక దృష్టితో చూసినప్పుడు అవి సమంజసమైనవిగా ఉన్నాయా? అని జడ్జి సమీక్షించాలి. అలా ఉన్నాయని భావించినప్పుడే మేజిస్ట్రేట్ రిమాండ్ విధించవచ్చు”అని ఈ మేరకు మెజిస్ట్రేట్ న్యాయపరమైన పరిశీలన చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది.

కోర్టు మార్గదర్శకాలు

సెక్షన్​498 ఏ కేసుల్లో  కేసు నమోదు కాగానే  అరెస్టు చేయకూడదని,సెక్షన్ 41లో పేర్కొన్న పరిమితులకు లోబడి ఉన్నప్పుడే అరెస్టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి. సెక్షన్​41(1)(బి)( ii) లో పేర్కొన్న చెక్ లిస్ట్ ను పోలీస్ అధికారులు అందరికీ అందజేయాలి. చెక్ లిస్ట్​ను పూర్తి చేసి తగిన కారణాలను, మెటీరియల్స్ ను ముద్దాయితో పాటు మేజిస్ట్రేట్ కు పంపాలి. నిందితుడిని అరెస్టు చేయకూడదని పోలీస్ అధికారి భావించినప్పుడు, ఆ నిర్ణయాన్ని కేసు నమోదు చేసిన తేదీ నుంచి రెండు వారాల్లోగా మేజిస్ట్రేట్ కు తెలియజేయాలి. తగిన కారణాలు ఉన్నప్పుడు రాతపూర్వకంగా నమోదు చేసి ఆ కాలాన్ని జిల్లా ఎస్పీ పొడిగించవచ్సు. కేసు నమోదైన రెండు వారాల్లో 41ఎ నోటీసులను పోలీసులు ముద్దాయికి అందించాలి. ఈ కాలాన్ని కూడా జిల్లా ఎస్పీ రాతపూర్వకంగా నమోదు చేసి పొడిగించవచ్సు. ఈ మార్గదర్శకాలు పాటించని పోలీస్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. 

మేజిస్ట్రేట్​కు సుప్రీం ఆదేశాలు 

పోలీసు అధికారి అందించిన నివేదికను పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే మేజిస్ట్రేట్ ​రిమాండ్ విధించాలి. ఆ ఆదేశాలను పాటించకుండా తగిన కారణాలను రాతపూర్వకంగా నమోదు చేయకుండా రిమాండ్ చేసిన మేజిస్ట్రేట్ పై హైకోర్టు శాఖాపరమైన చర్యలు తీసుకోవొచ్చు. ఈ ఆదేశాలు సెక్షన్ 498 ఏ కేసులకే కాదు ఏడు సంవత్సరాల వరకు, ఏడు సంవత్సరాల లోపు కేసులన్నిటికీ వర్తిస్తాయి. ఇన్ని జాగ్రత్తలను సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ అవి అమలు జరగడం లేదు. దీనికి కారణం అధికారుల్లో చిత్తశుద్ధి లేకపోవడం. ఏమీకాదన్న ధీమా. ఇలాంటి చర్యలు హైకోర్టు తీసుకోవాలి. ముఖ్యంగా మేజిస్ట్రేట్స్ ఈ తీర్పులోని మార్గదర్శకాల ప్రకారం రిమాండ్లను స్వీకరించాలి. అలా లేనప్పుడు తిరస్కరించాల్సిందే. 

-  మంగారి రాజేందర్, మాజీ డైరెక్టర్, జ్యుడీషియల్​ అకాడమీ