మ్యాజిక్ తో మూఢనమ్మకాలకు చెక్

ఇంద్రజాలం మన దేశంలోనే పుట్టిన కళ. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. దాదాపు 70 వేల మంది మెజీషియన్స్ వివిధ దేశాల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు. ప్రముఖ ఇంద్రజాలికులు గొగేపాష, కే లాల్, పీసీ సర్కార్ తదితరులు మేజిక్‌‌ను బాగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. మొదట వీధులలో ప్రదర్శించిన ఈ కళ… తర్వాత స్టేజి ప్రదర్శనగా మార్పు చెంది ఎంతో ఆదరణ పొందింది. ఇండియాలో పుట్టిన ఈ కళను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటి సారిగా పీసీ సర్కార్, గొగే పాష  విదేశాలకు వెళ్లి ప్రదర్శనలు ఇచ్చి గొప్ప పేరు సంపాదించారు. 1972లో పీసీ సర్కార్​ జపాన్‌‌ లో మేజిక్ ప్రదర్శిస్తూ అస్వస్థతకు గురయ్యారు. షో మధ్యలో ఆగిపోకూడదని ఇబ్బంది పడుతూనే చివరికి అదే స్టేజిపై మరణించారు. ఆయనకు గుర్తుగా 1975 నుంచి ఫిబ్రవరి 23న ‘మెజీషియన్‌‌ డే’  నిర్వహిస్తున్నారు.

ఇంద్రజాల కళలో 23 రకాలు ఉన్నాయి. ఒక్కో కళాకారుడు కొన్ని రకాల ప్రదర్శనలు ఇస్తుంటారు. ముఖ్యంగా  ‘ఇల్యూషన్’ అనే ఇంద్రజాల విద్య ఎంతో ఆదరణ పొందింది. ఇందులో మనుషులను ముక్కలుగా చేయడం, మాయం చేయడం, మళ్లీ అతికించడం జరుగుతుంది. ఇండియన్ రోప్ ట్రిక్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందింది. ఎన్నో ప్రముఖ పత్రికల్లో ఈ కళ గురించి ఆర్టికల్స్​ పబ్లిషయ్యాయి. ఇందులో ఓ వ్యక్తి నాదస్వరం ఊదుతూ ఉంటాడు. అప్పుడు తాడు పాములాగా పైకి లేస్తుంది. ఆ వ్యక్తి తాడును పట్టుకుని పైకి ఎక్కుతాడు.  తాడును గాలిలో విసిరి మాయమై పోతాడు. శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా కిందపడిపోతాయి. మరి కొద్దిసేపటికి తాడు మీద నుంచి కిందకి దిగుతాడు. ఇది సముద్ర తీర ప్రాంతంలో చేసిన ఇంద్రజాల విద్య.  దీనిని మరోసారి ప్రదర్శించిన వారికి అమెరికాలో రివార్డు కూడా ఉంది.

విదేశాల్లో ఆదరణ ఎక్కువ

మనదేశంలో పుట్టిన ఇంద్రజాల కళ అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. కానీ, ఇండియాలో మాత్రం తగిన ఆదరణ లేదు. మెజీషియన్‌‌గా కెరీర్‌‌‌‌ ప్రారంభించేందుకు  ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడమే. విదేశాల్లో మేజిక్‌‌ షో చూడడానికి టికెట్ల కోసం పోటీ పడతారు.  ఇండియాలో ఆ పరిస్థితి లేదు. సాహిత్యం, సంగీతం, ఆర్ట్స్ వంటి కళలను గుర్తిస్తూ పురస్కారాలు ఇస్తూ, సత్కారాలు చేస్తున్న ప్రభుత్వం… ఇంద్రజాల విద్య విషయంలో చాలా చిన్న చూపు చూస్తోంది. ఇక్కడ ఎలాంటి ప్రోత్సాహకాలూ లేవు.

ప్రత్యేక చట్టం రావాలి

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో మంత్రాలు, చేతబడుల పేరుతో బాబాలు, స్వామీజీలు అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. రోగాలు నయం చేస్తామని, సంతాన ఫలం ఇస్తామని, ఎలాంటి కష్టం లేకుండానే డబ్బులు వచ్చేలా చేస్తామని చెబుతూ జేబులు నింపుకుంటున్నారు. ఇలాంటివాళ్ల మోసాలను బట్టబయలు చేయడానికి మెజీషియన్లు కృషి చేస్తున్నారు. గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. మంత్రాలు, మాయలు లేవని, ఇది కేవలం ఇంద్రజాల విద్య అని ప్రదర్శనలతో రుజువు చేస్తున్నారు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపించే కళా ప్రదర్శన మాత్రమేనని ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో దొంగ బాబాలు, స్వామీజీల గుట్టు బయట పడుతుందని మెజీషియన్లపై దాడులు జరిగిన సంఘటనలు  అనేకం ఉన్నాయి. జనాలను మోసం చేసేవారిని శిక్షించడానికి తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి చట్టాలు లేకపోవడం గమనార్హం. కేవలం చీటింగ్ కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. మహారాష్ట్ర, ఒడిశా, కర్నాటక చత్తీస్​గఢ్ తరహాలో చట్టాలు వస్తేనే… మూఢనమ్మకాల నిర్మూలనతో పాటు ఇందుకోసం కృషి చేస్తున్న మెజీషియన్స్‌‌కు రక్షణ లభిస్తుంది.

తెలంగాణలో సాధనాశూరులు

తెలంగాణ పల్లెల్లో సాధనాశూరులు ఇంద్రజాల, గారడీ విద్యలతో జీవనోపాధి పొందుతున్నారు. అగ్గితో వివిధ ప్రదర్శనలు చేయడం, దారాన్ని కాల్చి మళ్లీ సృష్టించడం, తలపై పొయ్యి పెట్టి పూరీలు చేయటం, ఎర్రగా కాల్చిన పారను చేతితో పట్టుకోవడం, కర్ర సాముతో పాటు వివిధ గారడీలు చూపడం వంటివి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కళ అంతరించే దశలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం ‘సాంస్కృతిక సారథి’ కింద కళాకారులకు ఉద్యోగాలిచ్చి గవర్నమెంట్​ స్కీమ్​లకు ప్రచారం చేయిస్తోంది. అదేవిధంగా మూఢ నమ్మకాలు, చేతబడులు, దొంగ బాబాలు, స్వామీజీల మాయలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు  ఇంద్రజాల విద్య తెలిసిన వారిని నియమించి ప్రోత్సాహం అందించాలి.

(ఇవాళ వరల్డ్ మెజీషియన్ డే సందర్భంగా..)

సామల వేణు,
ప్రముఖ మెజీషియన్