నేడు ఆధునిక సాంకేతికతతో ప్రపంచం దూసుకు పోతోంది. మరోవైపు ఈ సాంకేతికతను భారతదేశం కూడా అందిపుచ్చుకుంటోంది. ఇప్పటికే మన దేశం అంతరిక్ష రంగంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతోంది. ఇటీవల 2025 లో చేపట్టే మానవ సహిత గగన్ యాన్ యాత్రకు సిద్ధమైనది. ఈ యాత్రకు నలుగురు వ్యోమగాములను కూడా ఎంపిక చేసింది. మరోవైపు చంద్రయాన్–3 విజయవంతం కావడం శాస్త్రరంగంలో భారత్ 2023లో సాధించిన గొప్ప విజయం అనవచ్చు. సూర్యుని అధ్యయనానికి ప్రతిష్టాత్మక ఆదిత్య-ఎల్1 ప్రయోగం కూడా విజయవంతంగా ముగియడం మరొక విజయంగా చెప్పుకోవచ్చు.
అంతేకాకుండా నేషనల్ క్వాంటమ్ మిషన్‌కు కూడా అడుగుపడింది. ఇదంతా కూడా దేశీయ సైన్సు ప్రగతికి నిదర్శనం అని చెప్పవచ్చు. అయినప్పటికి మన సైన్స్‌ను మత పెద్దల ఆచారాలు, విధానాలే శాసిస్తున్నారు. వీరికి ఇచ్చినంత విలువ మన శాస్త్రవేత్తలకు, వారి ఆవిష్కరణలకు ఇవ్వడం లేదు. మనిషి వైజ్ఞానిక ఫలాలు అనుభవిస్తూనే... అంధత్వంలోకి జారుకుంటున్నాడు.
వైజ్ఞానిక చైతన్యం కరువు
ఇప్పటికీ ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి మంత్రగాళ్లు, బాబాలను ఆశ్రయించడం దురదృష్టకరమని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. మేధో వైకల్యం ఉన్న ఆరుగురు బాలికలపై ఓ మంత్రగాడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుడికి ట్రయల్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీన్ని ఖరారు చేస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అంధ విశ్వాసాలు సమాజంలో ఏ స్థాయిలో ఉన్నాయో దీన్ని బట్టి అర్థమవుతుంది.
తల్లి కడుపులో నుంచి పుట్టబోయే బిడ్డను ముహూర్తాలు చూసుకునే రోజులొచ్చాయి. మనిషి మరణానికి సైతం ఘడియలు చూస్తున్నారు. క్షుద్ర పూజలు వంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇటీవల భారత ఆర్థిక సంస్కరణల ప్రధానమంత్రి పీ.వీ నరసింహారావు గ్రామమైన వంగరలో కూడా క్షుద్ర పూజల కలకలం చర్చనీయాంశంగా మారింది. ప్రజల్లో వైజ్ఞానిక చైతన్యం లేకపోవడమే ఇలాంటి సంఘటనలకు కారణం. ఇంత సైన్స్ అభివృద్ధి చెందినప్పటికీ ప్రజలు శాస్త్రీయ వైఖరిని అవలంబించకపోవడం దురదృష్టకరం.
విశ్వవిద్యాలయాల్లోనూ..
సైన్స్ ఆవిష్కరణల కన్నా సూడో సైన్స్ కు ఆదరణ పెరిగిపోతోంది ఐఐటి లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సైతం అశాస్త్రీయ ప్రచారం జరుగుతోంది. భూత వైద్యానికి, అతీంద్రియ శక్తులకు ఆదరణ పెరుగుతోంది. సమాజ అభివృద్ధికి మూలం విజ్ఞాన శాస్త్రమే. కావున విద్యాసంస్థల్లో శాస్త్రీయ ప్రగతిశీల విద్య అభ్యసనం జరగాలి. ప్రభుత్వాలు హేతుబద్ధ, శాస్త్రీయ ఆలోచన విధానాలను ప్రోత్సహించాలి. అంతేకాకుండా సైన్స్ ప్రచార సంస్థలు కూడా ఆ దిశగా కృషి చేయాలి. అప్పుడే దేశంలో వేళ్లూనుకొని ఉన్న సామాజిక రుగ్మతలను నిర్మూలించవచ్చు. మన విశ్వవిద్యాలయాలు పరిశోధన కేంద్రాలుగా ఎదగడానికి కావాల్సిన వాతావరణాన్ని కల్పించాలి.
ఇవి నవ కల్పనలకు నాంది పలకాలి. యువతను పరిశోధన వైపు ఆకర్షించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాలి. దీనికై శాస్త్ర సాంకేతిక రంగాలకు బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించాలి. సైన్స్ సత్యాలు విశ్వవ్యాపితం. అవి జాతీయ సరిహద్దులకు పరిమితం కావు. మతాల అడ్డుగోడల మధ్య బంధీలు కావు. కుల విభజనలకు లొంగవు. వర్గ వైషమ్యాలతో సాగవు. కావున శాస్త్రీయ పురోగతి వైపు ప్రతి ఒక్కరం అడుగేద్దాం. అప్పుడే నూతన ఆవిష్కరణతో వైజ్ఞానిక విప్లవానికి నాంది పడుతుంది.
మితిమీరిన అంధవిశ్వాసాలు
గ్రామాల్లో మూఢనమ్మకాలతో శాంతిభద్రతల సమస్య నెలకొంది. మంత్రాల నెపంతో దాడులు, హత్యలు పెరుగుతున్నాయి. మానసిక బలహీనత వలన విచక్షణ కోల్పోయి అతీంద్రియ శక్తులు నమ్మడం వల్లనే సమాజంలో ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. ప్రజల్లో శాస్త్రీయ వైఖరి, ప్రశ్నించే తత్వం లోపించడమే దీనికి ప్రధాన కారణం. మితిమీరిన మత విశ్వాసాలు, అశాస్త్రీయ బోధనలు , ప్రభుత్వ విధానాలు, మీడియా ప్రకటనలు ప్రజల్ని మూఢత్వ దిశగా ప్రేరేపిస్తున్నాయి. ఇటీవల రంగురాళ్లు ధరించడం, సంఖ్యా శాస్త్రం ఆధారంగా పేర్లు మార్చుకునే వారి సంఖ్య పెరిగింది. మనదేశంలో గుళ్ళు, గోపురాలు, చర్చిలు, మసీదులకు ఇచ్చినంత ప్రాముఖ్యత విద్యాలయాలకు ఇవ్వడం లేదు.
- సంపతి రమేష్ మహరాజ్,సోషల్ ఎనలిస్ట్