బెల్లం, పటిక కర్నాటక నుంచే సప్లై

బెల్లం, పటిక  కర్నాటక నుంచే సప్లై
  • సారా తయారీదారులతో డీల్​ - యథేచ్ఛగా సాగుతున్న దందా

మహబూబ్​నగర్, వెలుగు : తెలంగాణలో బ్యాన్​ చేసిన మత్తు పదార్థాలు, వాటి కోసం వినియోగించే ముడి సరుకును వ్యాపారులు కర్నాటక నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. బెల్లం రేట్లు కర్నాటకలో తక్కువగా ఉండడంతో అక్కడి వ్యాపారులతో రాష్ట్రానికి చెందిన సారా తయారీదారులు పెద్ద మొత్తంలో బెల్లం దిగుమతి చేసుకునేందుకు డీల్​ కుదుర్చుకుంటున్నారు. కర్నాటక నుంచి తెలంగాణలోకి ఉమ్మడి పాలమూరు జిల్లా మీదుగా బెల్లం రవాణా చేస్తున్నారు. 

కర్ణాటకలో అగ్గువ.. 

ఏజెన్సీ ఏరియాలు, గిరిజన తండాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సారా తయారీ జరుగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో సారా తయారీ, విక్రయాలపై నిషేధం ఉండగా, దీని తయారీకి వినియోగించే బెల్లం, పటిక(ఆలం) రవాణాపై కూడా ఆంక్షలు ఉన్నాయి. దీంతో వ్యాపారులు బెల్లం, పటిక కోసం పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. అయితే కర్నాటకలో చెరుకు తోటలు, బెల్లం తయారీ పరిశ్రమలు ఎక్కువగా ఉండడంతో బెల్లం అగ్గువకు దొరుకుతుంది.

రాష్ట్రంలో కిలో బెల్లం రూ.70 నుంచి రూ.80 వరకు ఉండగా, కర్ణాటకలో రూ.40 నుంచి రూ.45కే దొరుకుతుంది. క్వింటాళ్ల చొప్పున తీసుకుంటే కిలో రూ.35 వరకు పడుతుంది. దీంతో సారా వ్యాపారులు బెల్లం, పటిక కోసం కర్నాటకలోని వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సమీపంలో ఉన్న రాయచూర్, గుర్మిట్కల్, యాద్గిర్​ ప్రాంతాల వ్యాపారుల వద్ద క్వింటాళ్ల కొద్ది బెల్లం కొంటున్నారు.

బార్డర్​ గ్రామాల్లో స్టాక్​ చేసి..

దందాలో ఇబ్బందులు రాకుండా వ్యాపారులు ప్లాన్​ ప్రకారం కర్నాటక నుంచి బెల్లం రవాణా చేస్తున్నారు. యాద్గిర్, రాయచూర్, గుర్మిట్కల్​ ప్రాంతాల వ్యాపారులు సారా వ్యాపారుల వద్ద ముందుగానే డబ్బులు తీసుకుంటున్నారు. ఆ అమౌంట్​కు సరిపడా బెల్లం స్టాక్​ను బార్డర్​ గ్రామాల వద్దకు తీసుకొచ్చి డంప్​ చేస్తున్నారు. ఆ తర్వాత సారా వ్యాపారులు డంప్​లను వాహనాల్లో రాష్ట్రంలోకి తీసుకొస్తున్నారు. కొందరు ఆఫీసర్లు అక్రమార్కులతో డీలింగ్స్​ పెట్టుకున్నారనే ఆరోపణలున్నాయి.

ఈ కారణంతోనే బార్డర్  చెక్​ పోస్టుల వద్ద ప్రతి వెహికల్​ను క్షుణ్ణంగా తనిఖీ చేయడం లేదని అంటున్నారు. ఇటీవల కర్నాటక నుంచి మినీ డీసీఎంలో పెద్ద మొత్తంలో బెల్లం సంచులు, పటికను బార్డర్  దాటించి తీసుకురాగా, మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలోని బైపాస్​ వద్ద ముందస్తు సమాచారంతో ఆఫీసర్లు పట్టుకున్నారు. 

కిరాణా వ్యాపారులు కూడా..

బెల్లం ధరలు తక్కువగా ఉండడంతో కిరాణ వ్యాపారులు కూడా కర్నాటక నుంచే బెల్లం దిగుమతి చేసుకుంటున్నారు. కర్నాటకకు ఆనుకొని ఉన్న మక్తల్, నారాయణపేట, కృష్ణ, నర్వ, ఊట్కూరు, మాగనూరు, జడ్చర్ల, నవాబుపేట, గండీడ్, మహమ్మదాబాద్, మహబూబ్​నగర్, అచ్చంపేట, కల్వకుర్తి, గట్టు, కేటిదొడ్డి, అయిజ ప్రాంతాల్లోని కిరాణ వ్యాపారులు కర్నాటక నుంచి బెల్లం దిగుమతి చేసుకుంటున్నారు. వీరు తీసుకొచ్చిన సరుకు షాపుల్లో పెట్టి అమ్మకుండా, ఇండ్ల వద్దనే స్టాక్​ చేసుకొని అవసరం ఉన్న వారికి అమ్ముతున్నట్లు  సమాచారం.

50 రోజుల్లో 16,913 కిలోల బెల్లం పట్టివేత

కర్నాటక నుంచి పెద్ద మొత్తంలో తెలంగాణకు బెల్లం రవాణా అవుతున్న విషయాన్ని ప్రభుత్వం సీరియస్​గా తీసుకొని ఆఫీసర్లను అలర్ట్​ చేసింది. దీంతో వారు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్ల తనిఖీలు చేస్తున్నారు. మే 18 నుంచి ఈ నెల 11 వరకు ఉమ్మడి జిల్లాలో 16,913 కిలోల బెల్లం పట్టుకున్నారు. 400 కిలోల పటికను పట్టుకోగా, ఈ కేసుల్లో 38 వెహికల్స్​ సీజ్​ చేశారు.