- పౌష్టికాహారానికి దూరమవుతున్న చిన్నారులు, గర్భిణులు, బాలింతలు
- స్థానికంగా సర్దుబాటు చేసుకుంటున్న టీచర్లు
భద్రాచలం, వెలుగు: అంగన్వాడీ కేంద్రాలకు రెండు నెలలుగా కందిపప్పు సరఫరా నిలిచిపోయింది. ఐసీడీఎస్ ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా చిన్నారులు, బాలింతలు, గర్భిణులు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారినా పర్యవేక్షించే వారే కరవయ్యారు. ఎప్పటికప్పుడు అంగన్వాడీ కేంద్రాలకు నిత్యావసర సరుకులు, పాలు, కోడిగుడ్లు సప్లై అవుతున్నాయా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన ఆఫీసర్లు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. రెండు నెలలుగా అంగన్వాడీ కేంద్రాలకు కందిపప్పు సరఫరా నిలిచిపోయినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆయాలు తమ సొంత డబ్బులతో వేరే పప్పులు తీసుకొచ్చి కేంద్రాలను నెట్టుకొస్తున్నారు. జిల్లాలో 2,060 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 67,276 మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఉంటారు. వీరందరికీ రోజూ పప్పుతో కూడిన భోజనం వడ్డించాలి. పిల్లలకైతే 15 గ్రాములు, పెద్దలకైతే 30 గ్రాముల కందిపప్పు అవసరం ఉంటుంది.
కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం
టెండర్ల ద్వారా కందిపప్పు సరఫరా చేసేందుకు అనుమతులు పొందిన కాంట్రాక్టర్లు సకాలంలో అందించలేక పోతున్నారు. రేటు విషయంలో పేచీ కారణంగా గోడౌన్ల నుంచి పప్పు తీసుకురావడానికి ఒప్పుకోవడం లేదని అంటున్నారు. రెండు నెలలుగా కందిపప్పు సరఫరా కాకున్నా సమస్య పరిష్కారానికి ఐసీడీఎస్ ఆఫీసర్లు ఏ మాత్రం ప్రయత్నించడం లేదు. కిలో కంది పప్పు మార్కెట్లో గరిష్టంగా రూ.115, కనిష్టంగా రూ.98 ఉంది. రోజూ అంగన్వాడీ కేంద్రాల్లో పప్పు వండి పెట్టాల్సి ఉంటుంది. టమాట పప్పు, ఆకుకూర పప్పు, దోశకాయ పప్పు ఇలా ఏదో ఒక రూపంలో పప్పు ఎక్కువగా ఇవ్వాలి. ఇందులోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఐసీడీఎస్ ఆఫీసర్లు పట్టించుకోక పోవడంతో అంగన్వాడీ కేంద్రాల్లో పప్పు అందడం లేదని అంటున్నారు.
నిలిచిన మాట వాస్తవమే
కందిపప్పు సరఫరా నిలిచిన మాట వాస్తవమే. రేటు విషయంలో తేడా కారణంగా అంగన్వాడీ కేంద్రాలకు పంపడం లేదు. ఈ సమస్యపై ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. దాదాపు కొలిక్కి వచ్చింది. జిల్లాలో కొన్ని కేంద్రాలకు రవాణా కూడా చేస్తున్నారు.
- సలోనీ, సీడీపీవో
సర్దుబాటు చేస్తున్నాం
కందిపప్పు లేకపోయినా సర్దుబాటు చేస్తున్నాం. పచ్చి శనగపప్పు తెచ్చి కిచిడీ చేసి పెడుతున్నాం. పప్పు రోజూ పెట్టాలని నిబంధన ఉంది. ఉన్నతాధికారులకు ఈ విషయం చెప్పినం. కంది పప్పు వస్తుందని చెబుతున్నారు.
- పూలమ్మ, టీచర్, భద్రాచలం