- ఎంపీ అభ్యర్థులకు బీఆర్ఎస్ క్యాడర్ షాక్
- అభ్యర్థుల సూచన మేరకు అసెంబ్లీ ఎన్నికల ఖర్చు భరించిన నేతలు
- ఎన్నికల్లో ఓడిపోవడంతో మొఖం చాటేసిన మాజీలు
నల్గొండ, వెలుగు : ఉమ్మడి జిల్లాలోని పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు ముందుగానే షాక్ తగులుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పెట్టిన ఖర్చు లెక్క తేలితేనే ఎంపీ ఎన్నికల్లో సపోర్ట్ చేస్తామని పార్టీ కేడర్ నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. ‘ఎన్నికలయ్యాక చూసుకుందాం ! ముందు మీరైతే ఎన్నికల సంగతి చూసుకోండి’ అని అభ్యర్థులు చెప్పడంతో అప్పో, సప్పో చేసి ఎన్నికల ఖర్చులు భరించామని, తీరా ఎన్నికలయ్యాక పైసలు వాపస్ ఇవ్వాలని అడిగితే మొఖం చాటేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి మూడు నెలలు దాటినా డబ్బులు ఇవ్వలేదని, ఎంపీ ఎన్నికల్లో సపోర్ట్ చేయమని ఎట్లా అడుగుతారని పార్టీ ముఖ్యనేతలను నిలదీస్తున్నారు.
పార్టీ ఫండ్ జేబులో వేసుకున్న ఘనులు
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నియోజకవర్గాల్లో అవసరాన్ని బట్టి విడతల వారీగా రూ. 10 నుంచి రూ.25 కోట్ల వరకు పంపినట్లు సమాచారం. దీంట్లో చివరి విడత రూ.6 నుంచి రూ.7 కోట్ల వరకు పోలింగ్‌కు రెండు రోజుల ముందు క్యాండిడేట్లకు చేరింది. ఓటర్లతో పాటు లిక్కర్ ఖర్చులకు ఈ పైసలు వాడాలని పార్టీ సూచించినట్లు తెలిసింది. అయితే మొదటి, రెండో విడతలో వచ్చిన పైసలను ఆత్మీయ సమ్మేళనాలు, బహిరంగ సభలు, చేరికలకు ఖర్చు పెట్టిన అభ్యర్థులు చివరి విడతవి మాత్రం జేబులో వేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పరిస్థితులు తమకు అనుకూలంగా లేకపోవడంతో ఓటర్ల భారమంతా లోకల్ నేతలపై వేశారు. దీంతో గ్రామాల్లో, పట్టణాల్లో ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు లక్షల రూపాయలు అప్పు చేసి మరీ ఖర్చు పెట్టారు.
ఎంపీ క్యాండిడేట్ల మెడకు బాకీల ఉచ్చు...
బీఆర్ఎస్ ఇంకా ఎంపీ క్యాండిడేట్లను డిసైడ్ చేయలేదు. కానీ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాత్రం కంచర్ల కృష్ణారెడ్డి, బూడిద భిక్షమ య్యగౌడ్ను వెంటేసుకుని తిరుగుతున్నారు. ఎండిన పంట పొలాలను పరిశీలన చేస్తూ ఎంపీ అభ్యర్థులు వీళ్లేనని కేడర్‌కు సంకేతాలు పంపుతున్నారు. అయితే అధికారిక ప్రకటన మాత్రం చేయడం లేదు. ఇప్పటికిప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తే పాత బాకీలు, కొత్త ఖర్చులని నేతలు వెంటపడుతారనే భయంతో సంకోచిస్తున్నట్లు తెలిసింది. పార్టీలోని కొందరు ముఖ్యనేతలు మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో పెట్టిన ఖర్చును తమకు తిరిగి ఇస్తేనే ఎంపీ క్యాండిడేట్లకు సహకరిస్తామని, లేదంటే తమ దారి తాము చూసుకుంటామని తేల్చిచెబుతున్నారు. క్యాండిడేట్లు ఎవరైనా సరే అసెంబ్లీ ఖర్చుల గొడవలు నల్గొండ నుంచే మొదలవుతాయని పార్టీ సీనియర్ నేత ఒకరు ‘వెలుగు’తో చెప్పారు.
పార్టీ ఫండ్ పైనే ఎంపీ క్యాండిడేట్ల ఆశలు
బీఆర్‌ఎస్‌లో ఎంపీ అభ్యర్థులమని చెప్పుకుంటున్న నేతలు పార్టీ ఫండ్ పైనే ఆశలు పెట్టుకున్నట్టు తెలిసింది. నల్గొండ ఎంపీ సీటుకు రూ.35 కోట్లు, భువన గిరి రూ.40 కోట్ల వరకు ఖర్చువుతాయన్నది అంచనా. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టుకున్న నేతలకే టికెట్ ఇస్తామని హైకమాండ్ స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే ఇప్పుడు నల్గొండ రేసులో ఉన్న ఓ నేత తనకున్న 30 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టినట్టు సమాచారం. ఇదే సీటు కోసం పోటీ పడుతున్న మరో నేత ముందుగా పార్టీ ఎంత ఫండ్ ఇస్తదో చెబితే అప్పుడు తాను పెట్టే ఖర్చు గురించి ఆలోచిస్తానని క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది. గతంలో పోటీ చేసినప్పుడు తనతో వంద కోట్లు ఖర్చు పెట్టించారని, రెండోసారి మళ్లీ అవకాశం కూడా ఇవ్వలేదనే సంగతిని గుర్తు చేస్తున్నారు. భువనగిరి స్థానానికి క్యాండిడేట్లు పోటీకి సిద్ధంగా ఉన్నా... ఖర్చుల విషయంలో పార్టీ క్లారిటీ ఇస్తే తప్ప నిర్ణయం చెప్పలేమని అంటున్నారు.
రూ. 20 లక్షల వరకు ఖర్చు పెట్టిన ఒక్కో నేత
నల్గొండ నియోజకవర్గంలోని పలువురు ముఖ్యనేతలు రూ.10 లక్షల వరకు ఖర్చు పెట్టారు. నల్గొండ, కనగల్ మండలాల్లో అయితే రూ.20 లక్షలు ఖర్చు పెట్టిన లీడర్లు కూడా ఉన్నారు. ఇక నకిరేకల్, కోదాడ, దేవరకొండ నియోజకవర్గాల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఇప్పుడు ఎంపీ టికెట్అడుగుతున్న అభ్యర్థులే ఈ ఖర్చులు ఇవ్వాలని వాళ్లు పట్టుబడుతున్నారు. యాదాద్రి జిల్లాలో ఇద్దరు అభ్యర్థులు కూడా ఎన్నికలయ్యాక ఇస్తామంటే కొందరు నేతలు సొంతగా ఖర్చు పెట్టారు. కానీ ఇప్పుడు పైసలు ఇవ్వకుండా తిప్పలు పెడుతున్నారని వాళ్లు వాపోతున్నారు.