వర్ధన్నపేట, వెలుగు: ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. వర్ధన్నపేట మండలం ల్యాబర్తి, డీసీ తండాలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆఖరి గింజ వరకు ధాన్యాన్ని ప్రభుత్వమే పూర్తి గా కొనుగోలు చేస్తుందన్నారు. ధాన్యం ఎగుమతి అయిన కొద్ది రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందన్నారు.
త్వరతిగతిన కాంటాలు పెట్టాలని నిర్వహకులకు సూచించారు. అనంతరం ల్యాబర్తి లో రూ.16 లక్షలతో నిర్మిస్తున్న హెల్త్ సబ్ సెంటర్ను తనిఖీ చేశారు. హెల్త్ సబ్ సెంటర్లో మిషన్ భగీరథ నీటి పైపులు, ల్యాబ్లో వివిధ పనుల కోసం రూ.4లక్షలను మంజూరు చేస్తానని తెలిపారు. రెండు నెలల్లో అందుబాటులో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు.