- అగ్గువకే అమ్ముకుంటున్రు!
- సూర్యాపేట మార్కెట్లో జాడ లేని మద్దతు ధర
- క్వింటాల్‌కు రూ.1500 మించి రాని 1001 రకం వడ్లు
- ధర కోసం రోజుల తరబడి మార్కెట్ లో ఎదురు చూపులు
- ఎక్కడికక్కడ పేరుకుపోయిన వడ్ల కుప్పలు
సూర్యాపేట, వెలుగు యాసంగిలో వడ్లను రైతులు అగ్గువకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. మరికొందరు రైతులు ఎక్కువ ధర కోసం రోజుల తరబడి మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించక పోవడంతో గత 10 రోజులుగా రైతులు సూర్యాపేట మార్కెట్ కు వడ్లను భారీగా తీసుకువస్తున్నారు. కొన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ ట్యాబ్ ఎంట్రీ చేసే అవకాశం లేకపోవడంతో వడ్లను కాంటా వేయడం లేదు. దీంతో పట్టణ మార్కెట్‌కు ధాన్యం పోటెత్తుతోంది. మంగళవారం ఒక్కరోజే సూర్యాపేట మార్కెట్ కు 32,135 బస్తాల ధాన్యం వచ్చింది.
దళారుల దగా..
కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడం, సూర్యాపేట మార్కెట్‌కు ధాన్యం భారీగా తరలిరావడం దళారులకు కలిసివస్తోంది. ఇదే అదనుగా రైతులకు మాయమాటలు చెబుతూ తక్కువ ధరకు వడ్లను కొను గోలు చేసుకుంటూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ పరిస్థితితో ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2060 ఉంటే సూర్యాపేట మార్కెట్ లో 1001 రకం వడ్లకు క్వింటాల్‌కు రూ.1500 కు మించి ధర రావడం లేదు. తేమ సాకుతో కొనుగోలు చేయడానికి నిరాకరిస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో పెట్టుబడులు కూడా చేతికి రావడం లేదని రైతులు వాపోతున్నారు.
ఎక్కువ ధర కోసం ఎదురుచూపులు.. .
కొంతమంది రైతులు వడ్లను తక్కువ ధరకు అమ్ముకోలేక మార్కెట్లోనే రోజుల తరబడి మంచి ధర వస్తుందన్న ఆశతో వేచి చూస్తున్నారు. 3 రోజుల కింద ధర రాకపోవడంతో దాదాపు 5వేల బస్తాలు కోడ్ కాకపోవ డం గమనార్హం. సెంటర్లలో కూడా వడ్లు కాంటా చేయకపోవడంతో కల్లాలన్నీ నిండిపోయాయి. ఇకనైనా అధికారులు కాంటాలు త్వరగా వేయాలని, 1001 రకం వడ్లు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
మార్కెట్ లోనే ఉండిపోయాం...
మార్కెట్ లో మంచి ధర వస్తుందని సూర్యాపేట మార్కెట్ కు శనివారం రాత్రి రూ.5వేలు కిరాయి మాట్లాడుకొని ట్రాక్టర్ లో 90బస్తాల 1001 రకం వడ్లు తీసుకొచ్చినం. కానీ వడ్లు బాగలేవని క్వింటాల్‌కు రూ.1400 మాత్రమే ఇస్తమన్నరు. ఆ ధరకు ఇవ్వ బుద్ధికాలే. మళ్లీ ఇంటికి తీసుకపోతే రూ.5వేలు నష్టపోవాల్సి వస్తది. చేసేది లేక వడ్లను మార్కెట్ లోనే పెట్టి మంచి ధర కోసం ఎదురుచూస్తున్నం.
- వీరన్న, నర్సింహుల గూడెం, కూసుమంచి
రూ.1400 కే అమ్ముకున్న..
సిరికొండ నుంచి 130 బస్తాల 1001 రకం వడ్లు తీసుకోచ్చిన. 60 బస్తాలకు రూ.1430కే కొన్నరు. ఇష్టం లేకున్నా ఇయ్యాల్సి వచ్చింది. అందుకే మరో 70 బస్తాల వడ్లను అమ్మలే. మంచి ధర కోసం ఆపిన. ధర వస్తే అమ్ముతా.. లేకుంటే వెనక్కు తీసుకుపోతా..
- షేక్ సాహెబ్ అలీ, సిరికొండ, మోతే మండలం