సైదాపూర్, చిగురుమామిడి, వెలుగు: నిరుపేదలకు ఆసరా ఫించన్లు అండగా నిలుస్తున్నాయని హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్కుమార్అన్నారు. సైదాపూర్, చిగురుమామిడి మండలాల్లో బుధవారం ఆసరా లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైదాపూర్ లో కొత్తగా 1,516 పెన్షన్లు, చిగురుమామిడిలో 1,499 పెన్షన్లు మంజూరైనట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సైదాపూర్, చిగురుమామిడి ఎంపీపీలు ప్రభాకర్ రెడ్డి, వినీత, చిగురరుమామిడి జైడ్పీటీసీ రవీందర్, లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఆస్తి తగాదాలతో అన్నపై తమ్ముడి దాడి
జగిత్యాల రూరల్, వెలుగు: ఆస్తి విషయంలో తలెత్తిన వివాదంలో ఓ అన్నపై తమ్ముడు కత్తితో దాడి చేశాడు. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మంచినీళ్ల బావి సమీపంలో బుధవారం జంగిలి సంతోష్ కు అతని తమ్ముడు గణేశ్ కు ఆస్తి విషయమై గొడవ జరిగింది. ఈక్రమంలో కోపోద్రిక్తుడైన గణేశ్సంతోష్పై కత్తితో దాడి చేసి గాయపర్చాడు. చికిత్స కోసం సంతోష్ ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు.
కోళ్లకు దాణాగా రేషన్ బియ్యం
తనిఖీల్లో దొరికిన 35 క్వింటాళ్ల రైస్
మెట్ పల్లి, వెలుగు : పేదలకు సర్కారు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమార్కులు కోళ్లకు దాణాగా వినియోగిస్తున్నారని సివిల్ సప్లై సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మెట్ పల్లి కేంద్రంగా రేషన్ బియ్యం రవాణా జరుగుతుందని సమాచారం అందడంతో పట్టణ శివారులోని రామేశ్వర కోళ్ల ఫారంలో తనిఖీ చేసి 35 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే వెంకట్రావుపేట శివారులో ఎక్సెల్ వెహికల్‌పై తరలిస్తున్న రెండున్నర క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. బియ్యాన్ని సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు. తనిఖీల్లో సివిల్ సప్లై డీటీ ఉమాపతి, సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ యాదవ్, ఆనంద్ పాల్గొన్నారు.
బీజేపీ లీడర్ల ముందస్తు అరెస్ట్
రామడుగు, వెలుగు: మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్పర్యటన నేపథ్యంలో రామడుగు మండలంలోని బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అరెస్టైన వారిలో బీజేపీ మండలాధ్యక్షుడు ఒంటెల కర్ణాకర్ రెడ్డి, బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పూరెళ్ళ శ్రీకాంత్ గౌడ్, ఎడవెల్లి రామ్, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కోలపురి రమేశ్, దళిత మోర్చా మండలాధ్యక్షుడు జితేందర్, మండల ప్రధాన కార్యదర్శులు పోచంపల్లి నరేశ్ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్టర్‌కు గాయాలు
గోదావరిఖని, వెలుగు : రామగుండం కార్పొరేషన్‌లో కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్న గడ్డి కనకయ్య బుధవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. టూ వీలర్‌పై ఇంటికి వెళుతుండగా కార్పొరేషన్ ఆఫీస్ గేట్ దాటగానే ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని టూవీలర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆయన తలకు బలమైన గాయాలయ్యాయి. ఎడమ చేయి విరిగింది. ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు.
వ్రజోత్సవాలపై తహసీల్దార్ సమీక్ష
జమ్మికుంట, వెలుగు : రాష్ర్టవ్యాప్తంగా తలపెట్టిన సమైక్య వజ్రోత్సవాల నిర్వహణపై బుధవారం పలు శాఖల అధికారులు, ప్రైవేట్, ప్రభుత్వ స్కూళ్ల హెడ్మాస్టర్లతో తహసీల్దార్ రాజేశ్వరి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ఆదేశాలమేరకు సమైక్య వజ్రోత్సవాలలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐ రాంచందర్ రావు, కమిషనర్ సమ్మయ్యలతో పాటు పలు పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.