ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నకిలీ దందా

  • ఫిర్యాదులపై అవగాహన కరువు
  • నాణ్యత, తూకం, బిల్లులపై గందరగోళం
  • ఎవరికీ పట్టని సమస్య

నిర్మల్,వెలుగు: ఉమ్మడి జిల్లాలో నకిలీ దందా జోరుగా సాగుతోంది. చాలామంది వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా అసలిని పోలిన నకిలీ వస్తువులు వినియోగదారులకు అంటగడుతున్నారు. అంతేకాదు తూకం, కొలతల్లో మోసానికి పాల్పడుతున్నారు. వ్యాపారులు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తూ నకిలీ వస్తువులు, సరుకులను మార్కెట్​లోకి వదులుతున్నారు. నిరక్షరాస్యులే కాకుండా.. అక్షరాస్యులూ మోసపోతున్నారంటే వ్యాపారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఇట్టే అర్థమవుతోంది. పెట్రోల్ బంకులు, కిరాణ దుకాణాలు, కూరగాయలు, పండ్ల దుకాణాల్లో తూకం, కొలతల్లో మోసాలకు అంతేలేదు. ఆఫీసర్లు ఎన్ని ఫిర్యాదు చేసినా ‘మామూలు’గా తీసుకుంటున్నారు.

బిల్లులు లేవు... వివరాలు ఉండవు..

ఫర్టిలైజర్, మెడికల్ షాపుల్లోనూ నకిలీ దందా సాగుతోంది. చాలాచోట్ల వ్యాపారులు అమ్ముతున్న వస్తువులకు బిల్లులు ఇవ్వడంలేదు. అంతేకాదు వివరాలు ఉండడంలేదు. పేరుమోసిన హోటళ్లు, ఫాస్ట్​ఫుడ్ సెంటర్లల్లోనూ రెండు, మూడు రోజుల ఆహార పదార్థాలు వినియోగదారులకు అంటగడుతున్నారు. నకిలీలలతో ఇబ్బంది పడుతున్న జనం ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా.. ఫోన్​నంబర్ల కోసం వెతికినా ఏ ఆఫీసర్​ అడ్రస్​ దొరకడంలేదు. ఆఫీసర్లు కూడా టోల్​ఫ్రీ నంబర్లు... ఎక్కడ ఫిర్యాదు చేయాలనే విషయంపై అవగాహన కల్పించడంలేదు. ఎందుకంటే నెలనెలా మూముళ్లు అందుతుండడంతో వినియోగదారులను చైతన్యపర్చడంలో వెనకడుగు వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

తూకం, కొలతల్లో మోసం..

తూకం, కొలతల్లో మోసాలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ బంకుల్లో పాయింట్ల మోసం దర్జాగా సాగుతోంది. లీటర్ పెట్రోల్, డీజిల్ కు మూడు నుంచి నాలుగు పాయింట్లు తక్కువగా వస్తున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. కిరాణ దుకాణాల్లో చాలాచోట్ల మ్యాన్యువల్​ కాంటాలే కనిపిస్తున్నాయి. ఒక వేళ ఎలక్ట్రానిక్ ​కాంటాలు పెట్టినా.. సెట్టింగ్స్​మార్చి వినియోగదారులను దోచుకుంటున్నట్లు సమాచారం. 

బలవంతంగా ఇన్సూరెన్స్....

ఉమ్మడి జిల్లాలో బైకులు, కార్ల కంపెనీలకు సంబంధించిన షోరూమ్​ యాజమాన్యాలు బలవంతంగా ఇన్సూరెన్స్​ అంటగడుతున్నారు. వాహనాలు కొనుగోలుచేసే వారికి తమ కిష్టమైన ఇన్సూరెన్స్ కంపెనీలో బీమా చేసుకునే అవకాశం ఉన్నా.. షోరూమ్ యజమానులు ఏజెంట్లతో ఒప్పందం చేసుకొని ఇన్సూరెన్స్ చేసుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. అయితే కొన్ని ఇన్సూరెన్స్​ కంపెనీలు క్యాష్​ బ్యాక్,​ కిస్తీ ఫ్రీ సౌకర్యం కల్పించాయి. షో రూమ్​ల యజమానులు బలవంతంగా ఇన్సూరెన్స్​ చేయించడంతో నష్టపోవడం జనం వంతవుతోంది.

అవగాహన కల్పిస్తాం..

తూనికలు, కొలతల మోసాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా లీగల్ మెట్రాలజీ సైట్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ఫోరం ద్వారా చైతన్యం కల్పిస్తాం. పత్రికలు, ఇతర మీడియా ద్వారా ప్రజలకు సమాచారం అందిస్తాం. 
- రవీందర్, ఇన్​చార్జి లీగల్ మెట్రాలజీ ఆఫీసర్, నిర్మల్

ఫుడ్​ సేఫ్టీపై అలర్ట్​ చేస్తాం..

ఫుడ్ సేఫ్టీ విషయంలో ప్రజలను జాగృతం చేస్తాం. కల్తీ ఆహారంపై 7981764779  నంబర్​కు కాల్​చేసి ఫిర్యాదు చేయొచ్చు. కల్తీ ఆహార నిరోధక చర్యల్లో భాగంగా ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ పేరిట ప్రచారం చేస్తున్నాం. ప్రజలు ఎఫ్ఎస్ఎస్ఏఐ వెబ్​సైట్​ద్వారా ఆన్​లైన్​ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.

-  ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, నిర్మల్

 

 

ఇవి కూడా చదవండి

స్లోగా సూర్యాపేట అభివృద్ధి పనులు

తరగని ఆస్తినంతా దానం చేసి ఏం చేస్తున్నారంటే..

బీటెక్ వాళ్లు కూడా సోషల్ సైన్స్ చదవొచ్చు