ఎమ్మెల్సీ కవిత పిటిషన్ ను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 26కు వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు రావాలంటూ ఈడీ ఇచ్చిన నోటీసులపై కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. మహిళను విచారణకు పిలవద్దంటూ తాను వేసిన పిటిషన్ పెండింగ్ లో ఉండగా మళ్లీ ఈడీ నోటీసులెలా ఇస్తుందంటూ కవిత కోర్టులో సవాల్ చేశారు.
పిటిషన్ విచారణ సందర్భంగా వాదనలు వినిపించిన ఈడీ.. కావాలంటే మరో 10 రోజుల సమయం ఇస్తామని .. కవిత విచారణకు హాజరుకావాల్సిందేనని కోర్టుకు తెలిపింది. అయితే మహిళలను ఈడీ ఆఫీసుకు పిలిచి విచారించొద్దని.. గతంలో నళిని చిదంబరానికి వెసులు బాటు కల్పించారని.. అదే తరహాలో కవితకు ఆదేశాలివ్వాలని కవిత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో కోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 26 కు వాయిదా వేసింది.
లిక్కర్ స్కాం కేసులో ఈడీ కవితకు సెప్టెంబర్ 14న మరోసారి నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15న విచారణకు రావాలని ఆదేశించింది. హైదరాబాద్ లోని కవిత ఇంటికి నోటీసులు పంపగా..మెయిల్ ద్వారా మరో సెట్ నోటీసులను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. కవితనీ ఈడీ అధికారులు ఇప్పటికే మూడు సార్లు విచారించారు. మార్చి 16, 20, 21 తేదీల్లో మూడు సార్లు విచారించింది.