Mining Tax Case: కేంద్రం విజ్ఞప్తికి నో.. సుప్రీంకోర్టులో రాష్ట్రాలకు భారీ విజయం

Mining Tax Case: కేంద్రం విజ్ఞప్తికి నో.. సుప్రీంకోర్టులో రాష్ట్రాలకు భారీ విజయం

గనుల రూపంలో భారీ ఖనిజసంపద కలిగి ఉన్న రాష్ట్రాలకు సుప్రీంకోర్టులో భారీ విజయం దక్కింది. గనులు అధికంగా ఉన్న రాష్ట్రాలు మైనింగ్ కంపెనీల నుండి రాయల్టీపై గత బకాయిలను వసూలు చేసుకునేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం అనుమతించింది. 

అంతేకాదు, ఏప్రిల్ 1, 2005 నుంచి ఇప్పటివరకూ ఉన్న బకాయిలను కేంద్రం నుంచి రాష్ట్రాలు వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ బకాయిలను రాబోయే 12 ఏళ్లలో దశలవారీగా చెల్లించవచ్చని సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది. అయితే, బకాయిల చెల్లింపుపై ఎలాంటి జరిమానా విధించవద్దని బెంచ్ రాష్ట్రాలను ఆదేశించింది.

అంతకుముందు 1989 నుండి గనులు, ఖనిజాలపై విధించిన రాయల్టీని వాపసు చేయాలనే రాష్ట్రాల డిమాండ్‌ను కేంద్రం వ్యతిరేకించింది. ఈ నిర్ణయం పౌరులపై ప్రభావం చూపుతుందని, తమ ఖజానాను రూ. 70,000 కోట్లు చెల్లించాల్సి వస్తుందని పేర్కొంది. అయితే, ఈ వాదనతో అత్యున్నత న్యాయస్థానం ఏకీభవించలేదు. ఖనిజాలు కలిగి ఉన్న భూమిపై రాయల్టీని విధించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని సుప్రీం కోర్టు గత నెలలోనే సమర్థించింది.

'రాయల్టీ' అనేది 'పన్ను'తో సమానం కాదు

మైనింగ్ ఆపరేటర్లు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించే రాయల్టీ అనేది పన్ను కాదని.. మైనింగ్, ఖనిజ వినియోగ కార్యకలాపాలపై సెస్ విధించే అధికారం రాష్ట్రాలకు ఉందని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని 9 మంది మంది న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొంది.

ఈ తీర్పుతో ఒడిశా, జార్ఖండ్, బెంగాల్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ఖనిజాలు అధికంగా ఉన్న రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. తమ భూభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైనింగ్ కంపెనీలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు సుంకాలు వసూలు చేయవచ్చు.